మంగళవారం 19 జనవరి 2021
Telangana - Dec 25, 2020 , 01:38:10

అనాథ పెండ్లికి హరిశే పెద్దన్న

అనాథ పెండ్లికి హరిశే పెద్దన్న

  • చదివించి, ఉపాధి చూపిన ఆర్థిక మంత్రి

సిద్దిపేట కలెక్టరేట్‌: అనాథ ఆడబిడ్డకు కొండంత అండ! అన్నలా ఆప్యాయత పంచారు. తండ్రిలా ఆదరించారు. అభాగ్యురాలిని చేరదీసి అన్నీతానై నిలిచి పెండ్లిపెద్దగా బాధ్యతలు నెరవేర్చారు మంత్రి హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లికి చెందిన భాగ్య కొన్నేండ్ల కిందట తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలింది. ఈ విషయం తెలుసుకొన్న మంత్రి హరీశ్‌రావు వెంటనే స్పందించారు. కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో మాట్లాడి భాగ్య చదువు, విద్య, ఉపాధి కల్పిద్దామని సూచన చేశారు. 2017లో మహిళా శిశుసంక్షేమశాఖ ఆధీనంలో ఉన్న బాలసదనంలో ఆమెకు వసతి కల్పించారు. మంత్రి ఆదేశాలతో జిల్లా అధికారులు ఆమె బాగోగులు చూసుకున్నారు. అప్పటికే భాగ్య ఇంటర్‌ చదివింది. ఆ తర్వాత డీఎడ్‌ పూర్తిచేసి.. ప్రస్తుతం ఎంఎస్‌డబ్ల్యూ చదువుతున్నది. ఆమెకు బతుకుదెరువు కోసం 2018 జూన్‌లో బాలల పరిరక్షణ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు. పెండ్లీడుకు వచ్చిన ఆమె ఇబ్రహీంనగర్‌కు చెందిన రాజును వివాహం చేసుకునేందుకు సుముఖత వ్యక్తంచేసింది. రాజు సౌదీఅరేబియాలో డ్రైవర్‌గా ఉద్యోగం చేసి తిరిగొచ్చి సొంతంగా టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నారు. వీరి వివాహం జరిపేందుకు హరీశ్‌రావు పెండ్లి పెద్దగా మారారు. గురువారం సిద్దిపేట టీటీసీ భవనంలో వేడుకగా పెండ్లి జరిపించి భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, శిశు సంక్షేమశాఖ అధికారి రామ్‌గోపాల్‌రెడ్డి, అధికారులు తమ ఇంటి కార్యక్రమం అన్నట్టుగానే పెండ్లి వేడుకను నిర్వహించారు. మరోవైపు, సిద్దిపేటలోని కేసీఆర్‌ నగర్‌కాలనీలో 216 మంది లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేపించారు. ఈ సందర్భంగా మంత్రికి మహిళలు స్వాగతం పలికారు.