బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 01:58:37

ఉత్తమ్‌.. దుబ్బాక అభివృద్ధి చూడు నీవు మంత్రిగా ఉండి ఏం చేశావ్‌?

ఉత్తమ్‌.. దుబ్బాక అభివృద్ధి చూడు నీవు మంత్రిగా ఉండి ఏం చేశావ్‌?

  • బోరు మోటర్లకు మీటరు పెట్టే బీజేపీకి బుద్ధిచెప్పాలి
  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు 
  • టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు

దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్‌ నాయకులు ముందుగా ఇక్కడ జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు తెలుసుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ నాయకుల మాయమాటలు వినే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. దుబ్బాకలో 20 రోజులు ఎన్నికల ప్రచారంలో ఉంటానని అంటున్న ఉత్తమ్‌కుమార్‌, గతంలో మంత్రిగా పని చేసినప్పుడు దుబ్బాకకు వచ్చావా?, ఇక్కడి ప్రజల కష్టాలను పట్టించుకున్నావా? అని మంత్రి ప్రశ్నించారు. ఏనాడు దుబ్బాకను పట్టించుకోని ఉత్తమ్‌కుమార్‌, ఇప్పుడు ఓట్ల కోసం వస్తున్నావా?.. దుబ్బాక నుంచి వెళ్లే ముందు ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి పనులు చూడు, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఏ ఒక్క మంచి పనైనా చేశారా? అంటూ ఉత్తమ్‌ను ప్రశ్నించారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి సంఘంలో కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో నిర్మించిన రంగనాయక్‌ సాగర్‌, దుబ్బాక నియోజకవర్గంలో జలకళతో నిండిన చెరువు, కుంటలు చూడాలని, అందులో చెంగుచెంగునా దుంకుతున్న చేప పిల్లలను, దుబ్బాకలో నిర్మించిన వెయ్యి డబుల్‌ బెడ్రూం ఇండ్లను, కేసీఆర్‌ స్కూల్‌, వంద పడకల దవాఖాన భవనాలు చూసైనా.. సోయి తెచ్చుకోవాలని హితవు పలికారు.  

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరిక

కాంగ్రెస్‌కు చెందిన దుబ్బాక మండలం చీకోడ్‌ ఎంపీటీసీ రాంరెడ్డి, మిరుదొడ్డి ఎంపీటీసీ సుతారి నర్సింలు, గొడుగుపల్లి ఎంపీటీసీ లక్ష్మీనర్సవ్వ, వెంకటగిరితండా ఉపసర్పంచ్‌ అజ్మీరా మోహన్‌, నాయకులు అమరేందర్‌రెడ్డితోపాటు సుమారు 500 మంది కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. తొగుట మండలం తుక్కాపూర్‌లో ఉమ్మడి మెదక్‌ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి చెరుకు కొండల్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, తుక్కాపూర్‌ ఎక్స్‌ రోడ్‌కు చెందిన తుర్క కాశి యువకులు, తొగుట, తుక్కాపూర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్‌, బీజేపీ నుంచి మంత్రి హరీశ్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

బీజేపీకి ఓటుతో బుద్ధి చెప్పాలి..

రైతులను గోస పెడుతున్న బీజేపీకి ఈ ఉప ఎన్నికల్లో ఓటుతో బుద్ధిచెప్పాలని దుబ్బాక ప్రజలను మంత్రి హరీశ్‌రావు కోరారు. కేం ద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌ రైతులను ఇబ్బందులకు గురిచేసే చట్టాలు తీసుకొచ్చిందన్నా రు. నియోజకవర్గంలో 43 వేల రైతు కుటుంబాలున్నాయని, బీజేపీ నాయకులు ఏ ము ఖం పెట్టుకుని వారిని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

నన్ను ఆశీర్వదించండి

  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత విజ్ఞప్తి


మిరుదొడ్డి: పెన్ను.. గన్ను.. గులాబీ కండువాతోనే దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తన జీవితాంతం పేదల కోసం పనిచేశారని టీఆర్‌ఎస్‌ దుబ్బాక అభ్యర్థి సోలిపేట సుజాత రామలింగారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. బుధవారం మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి కూడవెల్లి గ్రామంలో దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ.. తన భర్త చేసిన సేవలకు గుర్తుగా సీఎం కేసీఆర్‌ తనకు దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదిస్తే దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తరహాలోనే తాను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 


logo