శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 13, 2020 , 02:55:01

ఔన్నత్యానికి ప్రతీక నుమాయిష్‌

ఔన్నత్యానికి ప్రతీక నుమాయిష్‌
  • ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు
  • ఎగ్జిబిషన్‌ మరో మూడ్రోజులు పొడిగింపు
  • హోంమంత్రి మహమూద్‌అలీ
  • ఘనంగా నుమాయిష్‌ బహుమతుల ప్రదానోత్సవం

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇంటిల్లిపాది షాపింగ్‌ దాహాన్ని తీర్చే నుమాయిష్‌.. హైదరాబాద్‌ ఔన్నత్యానికి ప్రతీకని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నుమాయిష్‌ అంటే హైదరాబాద్‌ సంస్కృతికి చిహ్నమని, కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చిన అద్భుతమైన ప్రదర్శనని పేర్కొన్నారు. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నిర్వహించిన నుమాయిష్‌ బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్‌అలీ, హరీశ్‌రావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. నుమాయిష్‌ విజయవంతానికి కృషిచేసిన జీహెచ్‌ఎంసీ, పోలీసు, ట్రాఫిక్‌, అగ్నిమాపకశాఖ, విద్యుత్‌, ఆదాయపన్నుశాఖ, జీఎస్టీ సహా పలుశాఖల ప్రభుత్వ విభాగాలు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, ఉత్తమంగా నిర్వహించిన స్టాళ్ల నిర్వాహకులకు బహుమతులను ప్రదానంచేశారు. 


సిద్దిపేటలో మహిళా కళాశాల ఏర్పాటుచేయండి

ఏటా జనవరి 1న ఎగ్జిబిషన్‌ ప్రారంభమవుతుండటంతో హైదరాబాదీలకు న్యూఇయర్‌ అంటే నుమాయిష్‌గా స్థిరపడిందని హరీశ్‌రావు అన్నారు. ఎగ్జిబిషన్‌ ద్వారా వచ్చిన ఆదాయంతో 18 విద్యాసంస్థలను నడపటం, 30 వేలమంది పేదగ్రామీణ విద్యార్థులకు విద్యనందించడంపై సొసైటీ నిర్వాహకులను అభినందించారు. సిద్దిపేట నియోజకవర్గంలో బాలికలు/మహిళల కోసం ఫార్మసీ, వ్యవసాయ సంబంధ కోర్సులు నిర్వహించే కళాశాలను ఏర్పాటుచేయాలని ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వాహకులను హరీశ్‌రావు కోరారు. ఇందుకు సం బంధించిన అనుమతులు, స్థల సేకరణ విషయాలను తాను చూసుకుంటానని హామీఇచ్చారు. ఇందుకు ఎగ్జిబిషన్‌ సొసైటీ నిర్వాహకులు సైతం సుముఖత తెలుపడంపై ఆయన సంతోషం వ్యక్తంచేశారు. నుమాయిష్‌కు కొద్దిరోజులే గడువు ఉండటంతో రద్దీ పెరిగిందని, విజ్ఞప్తుల ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడు, మంత్రి ఈటల రాజేందర్‌ తో చర్చించగా, నుమాయిష్‌ను మరో మూడురోజులు పొడిగించేందుకు అంగీకరించినట్టు హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. రెండువేల స్టాళ్లతో దేశంలోనే అతిపెద్ద ప్రదర్శనగా నుమాయిష్‌ నిలుస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు నరేందర్‌, ప్రధాన కార్యదర్శి ప్రభాశంకర్‌మిశ్రా, సంయుక్త కార్యదర్శి బీ హనుమంతరావు, కోశాధికారి వినయ్‌కుమార్‌, సలహాదారు ఎన్వీఎన్‌ చార్యులు పాల్గొన్నారు.


logo