బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 02, 2020 , 02:22:28

బురద రాజకీయం

బురద రాజకీయం

  • కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులే కొట్టుకుపోయాయి
  • పైపులైన్లు పటాకుల్లా పేలిపోయాయి
  • ఎస్సారెస్పీ కాల్వలు తెగిపోయాయి
  • రైల్వేట్రాక్‌ కొట్టుకుపోతే బీజేపీ మాట్లాడదే
  • విపక్షాలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఫైర్‌

గజ్వేల్‌: జగదేవ్‌పూర్‌ కాల్వకు చిన్న బుంగపడితే రాద్ధాంతంచేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ తమ హయాంలో ఒరగబెట్టిందేమిటని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పాలనలో నీటిపారుదలకు సంబంధించి అనేక అనర్థాలు జరిగాయని, ఉత్తమ్‌, పొన్నాల, జీవన్‌రెడ్డి ఆ విషయాలన్నీ మరిచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్ద లిఫ్టింగ్‌ ప్రాజెక్టు. 530 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోసి తెలంగాణ భూములను సస్యశ్యామలం చేస్తున్నది. 

1832 కిలోమీటర్ల ప్రధాన కాలువలు, 5 వేల కిలోమీటర్ల డిస్ట్రిబ్యూషన్‌ కాలువలతో రాష్ట్రంలోనే ప్రధాన ప్రాజెక్టుగా నిలిచింది. అసాధ్యమనుకున్న కాళేశ్వరం విజయవంతంగా పూర్తికావడంతో ప్రజల్లో ప్రభుత్వానికి వస్తున్న గుర్తింపును జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు చిన్నచిన్న సమస్యలను ఎత్తి చూపుతూ గోబెల్స్‌ ప్రచారానికి పాల్పడుతున్నాయి’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ అత్యంత ఎత్తులో నిర్మితమైందనీ, అనేక చెరువులు, కుంటల్లోకి నీరు వదలడానికి కాలువల ద్వారా ట్రయల్న్‌ నిర్వహిస్తున్నట్లు స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ పాలనలో ఎస్సారెస్పీ కాలువకు రెండుసార్లు గండ్లు పడ్డాయని చెప్పారు.

ఖమ్మం జిల్లా పాలెంవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయిందని.. కేసీఆర్‌ సీఎం అయ్యాక డిజైన్‌లో మార్పుచేసి పూర్తిచేశారని గుర్తుచేశారు. దేవాదుల ప్రాజెక్టు పైపులైన్లు పటాకుల్లా పేలిపోయాయని.. నాడు పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదలశాఖ మంత్రిగా ఉండి కూడా కప్పిపుచ్చుకొన్నారన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి 10 లిఫ్టింగ్‌ల ద్వారా 618 మీటర్ల ఎత్తుకు నీటిని విజయవంతంగా తరలించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తితో రైతులకు ఆనందబాష్పాలువస్తే కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల కండ్లలో కన్నీళ్లొస్తున్నాయని ఎద్దేవాచేశారు. 

మనోహరాబాద్‌-గజ్వేల్‌ రైల్వేట్రాక్‌ ఇటీవలే నిర్మించగా చిన్నపాటి వర్షానికే బుంగపడి ట్రాక్‌ కొట్టుకుపోయిందని దీనిపై బీజేపీ నాయకులు.. ప్రధాని మోదీని, రైల్వేశాఖ మంత్రిని తప్పుపట్టాలని సూచించారు. గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 207 సార్లు కాలువలకు సమస్యలు వచ్చాయని అంతమాత్రాన ఆ ప్రాజెక్టు గొప్పదనాన్ని తక్కువచేసి చూపం కదా అన్నారు. ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారంచేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు తమ వైఖరిని మార్చుకోవాలని మంత్రి సూచించారు. కొండపోచమ్మ సాగర్‌ను చూడడానికి వచ్చినందుకు అమ్మవారికి మొక్కుకొని రిజర్వాయర్‌లోని నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే ఆయా పార్టీ ప్రభుత్వాలుచేసిన పాపాలు పోతాయన్నారు. 

కాంగ్రెస్‌ పాలనలో ఎస్సారెస్పీ కాలువకు రెండుసార్లు గండ్లు పడ్డాయి. ఖమ్మం జిల్లా పాలెంవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోయింది. కేసీఆర్‌ సీఎం అయ్యాక డిజైన్‌లో మార్పుచేసి పూర్తిచేశాం. దేవాదుల ప్రాజెక్టు పైపులైన్లు పటాకుల్లా పేలిపోయాయి. నాడు పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదలశాఖ మంత్రిగా ఉండి కూడా కప్పిపుచ్చుకొన్నారు.

- మంత్రి హరీశ్‌రావు


logo