శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 02:40:38

షూటింగ్‌లకు అనుమతి

షూటింగ్‌లకు అనుమతి

  • సినిమాలు.. సీరియళ్లు షూట్‌ చేసుకోవచ్చు
  • ఫైల్‌పై సంతకంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • థియేటర్లకు అనుమతి ఇవ్వలేమన్న ప్రభుత్వం
  • కేసీఆర్‌కు మెగాస్టార్‌ చిరంజీవి కృతజ్ఞతలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగ్‌లు నిర్వహించుకోవడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అనుమతించారు. ఇందుకు సంబంధించిన ఫైలుపై సోమవారం సంతకంచేశారు. కానీ, సినిమా థియేటర్లను ప్రారంభించడానికి మాత్రం ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాల్సి ఉన్నందున థియేటర్లకు అనుమతించడం సాధ్యం కాదని స్పష్టంచేసింది. పరిమిత సిబ్బందితో, కొవిడ్‌-19 కు సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలను, లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ సినిమా, టీవీ కార్యక్రమాల షూటింగ్‌లను నిర్వహించుకోవచ్చునని ప్రభు త్వం సూచించింది. షూటింగ్‌లు పూర్తయిన వాటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు కూడా వెంటనే నిర్వహించుకోవచ్చునని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు. 

సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల సీఎం కేసీఆర్‌ను కలిసి సినిమా, టీవీ షూటింగ్‌లకు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించుకోవడంతోపాటు, సినిమాహాళ్లను కూడా తెరువడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం.. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, సినీరంగ ప్రముఖులు సమావేశమై ముసాయిదాను రూపొందించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పరిమిత సిబ్బందితో షూటింగ్‌ జరుపుకొంటామని సినీ ప్రముఖులు హామీ ఇచ్చారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ షూటింగ్‌లు, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం జీవో విడుదల కానుంది. 

ముఖ్యమంత్రికి చిరంజీవి కృతజ్ఞతలు


వేలమంది దినసరి వేతన కార్మికుల బతుకుతెరువును దృష్టిలో ఉంచుకొని సినిమా, టీవీ షూటింగ్‌లకు అనుమతి మంజూరుచేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ప్రముఖ నటుడు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించి, సహకరించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు, ప్రభుత్వాధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.


logo