గురువారం 09 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 02:24:17

సీజనల్‌ వ్యాధులపై జన సమరం

సీజనల్‌ వ్యాధులపై జన సమరం

  • 8వ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు
  • పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం పెద్దపీట
  • వారోత్సవాలను ప్రారంభించిన మంత్రులు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య వారోత్సవాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఓ వైపు కరోనా, మరోవైపు వానకాలం సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో సర్కార్‌ ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో పట్టణం, పల్లె తేడా లేకుండా అన్నిచోట్లా ఒకటి నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఈ వారోత్సవాలను సోమవారం ఆయా జిల్లాల్లో మంత్రులు ప్రారంభించగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. గతంలోనూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేరిట పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. పల్లెప్రగతి మొదటిసారిగా గత ఏడాది సెప్టెంబర్‌ 6 నుంచి నెల రోజులపాటు, రెండో విడుత ఈ ఏడాది జనవరి రెండో తేదీ నుంచి 12వ తేదీ వరకు, పట్టణ ప్రగతి ఈ ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమాల నిర్వహణతో గ్రామాలు, వార్డుల రూపురేఖలే మారిపోయాయి. ఇలాంటి కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగించాలంటూ ప్రజలు అప్పట్లోనే ప్రభుత్వానికి విజ్ఞప్తులు సైతం చేశారు. 

నమస్తేతెలంగాణ నెట్‌వర్క్‌: సీజనల్‌ వ్యాధుల పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఇందు కోసం మరోసారి పారిశుద్ధ్య వారోత్సవాలను నిర్వహిస్తున్నది. ఒకటి నుంచి 8వరకు నిర్వహించే ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలను మంత్రులు సోమవారం పట్టణం, పల్లె తేడా లేకుండా అన్నిచోట్ల ప్రారంభించారు. పరిసరాలను పరిశీలించి స్థానికులకు జాగ్రత్తలు సూచించారు. 

వరికోలు గ్రామంలో..

వరంగల్‌ రూరల్‌ జిల్లా నడికూడ మండలం వరికోలు గ్రామంలో సోమవారం పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కలెక్టర్‌ హరితతో కలిసి వరికోలు గ్రామం లో పాదయాత్ర చేశారు. ఆకస్మిక తనిఖీలతో పారిశుద్ధ్యం, మురికి కాలువల నిర్వహణను పరిశీలించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సీజనల్‌, అంటువ్యాధులు, విషజ్వరాలు ప్రబలకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈనెల 1 నుంచి 8వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సిద్దిపేటలో అవగాహన..

సిద్దిపేట పట్టణంలోని 6వ వార్డులో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు  పాదయాత్ర చేశారు. చెత్తసేకరణ, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్‌ కార్యాలయంలో కౌన్సిలర్లు, ఆర్పీలు, మున్సిపల్‌ సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. 

నిర్మల్‌లో ముందస్తు సూచనలు

నిర్మల్‌ పట్టణంలోని సోఫీనగర్‌తోపాటు నిర్మల్‌ రూరల్‌ మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించారు. వానకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని స్థానికులకు సూచించారు. ఖమ్మం జిల్లా కొండకొడిమ, కొణిజర్ల మండలంలోని తనికెళ్లలో వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. గ్రామాల్లో విరివిగా ఇంకుడు గుంతలు నిర్మించాలని, వానకాలం లో దోమల వ్యాప్తిని నివారించి సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మంత్రి సూచించారు. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో..

మహబూబ్‌నగర్‌ పట్టణంలోని 7వ, 41వ వార్డు ల్లో పారిశుద్ధ్య వారోత్సవాలను ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. వానకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని, కాలనీల్లో పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని కోరారు. వనపర్తిలోని ఒకటో వార్డులో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పట్టణ ప్రగతిని ప్రారంభించారు. మురుగు కాలువలను శుభ్రంగా ఉంచుకుంటే దోమల వ్యాప్తి తగ్గుతుందని మంత్రి  తెలిపారు. రోడ్లపై చెత్తవేస్తే రూ.వెయ్యి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి, జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం జగదేవ్‌పేటలో పర్యటించిన ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.


logo