మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 24, 2020 , 03:23:06

రికవరీ ఘనం

రికవరీ ఘనం

  • ఫలిస్తున్న ప్రభుత్వ ముందస్తు వ్యూహం
  • ఖర్చుకు వెనుకాడకుండా బాధితులకు వైద్యం
  • తక్కువ మరణాలు.. కోలుకునేవారు అధికం
  • ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా తెలంగాణ

కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల పెను ప్రమాదం తప్పుతున్నది. ముందుచూపుతో పక్కా ప్రణాళిక ప్రకారం నడుచుకోవడంతో పరిస్థితి అదుపులోనే ఉంటున్నది. పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైతే ఎదురయ్యే పరిస్థితిని ముందే ఊహించి ఏర్పాట్లుచేయడంతో వైరస్‌ భయం తొలిగి పోతున్నది. రాష్ట్రంలో మార్చి 2న తొలి కేసు నమోదైన నాటినుంచి ఇప్పటివరకు లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు వెలుగుచూసినప్పటికీ, రికవరీ రేటులో గణనీయమైన వృద్ధి, ఒక్క శాతం కంటే తక్కువగా మరణాలు ప్రభుత్వ వ్యూహం ఫలిస్తున్నదని చెప్పేందుకు నిదర్శనం.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ కరోనా విజృంభిస్తున్న సమయంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు, తదుపరి నిరోధక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ అస్ర్తాన్ని ప్రయోగించాయి. ఈ సమయంలో వైద్య సామగ్రిని సమకూర్చుకోవడం, ప్రజల్లో వైరస్‌ గురించి అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేపట్టాయి. బాధితులకు చికిత్స అందించడంలో, నిర్ధారణ పరీక్షలు చేయడంలోనూ ఒక ప్రణాళికబద్ధంగా నడుచుకున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఇతర రాష్ర్టాల కంటే మరింత ముందుచూపుతో వ్యవహరించింది. కరోనా చికిత్స కోసం గాంధీ వంటి ప్రధాన దవాఖానను కేటాయించడంతోపాటు ప్రత్యేకంగా టిమ్స్‌ దవాఖానను సిద్ధంచేస్తున్నట్టు ప్రకటించింది. అప్పుడప్పుడే నమోదవుతున్న కేసులతోపాటు భవిష్యత్‌లో పెద్దసంఖ్యలో కేసులు వెలుగుచూస్తే ఎలా ఎదుర్కోవాలనే కోణంలోనూ ఆలోచించింది. ఇందులో భాగంగా క్రమంగా ఇతర ప్రధాన దవాఖానలైన కింగ్‌ కోఠి, ఫీవర్‌, ఛాతి దవాఖానల్లో చికిత్స అందించేలా ఏర్పాటుచేసింది. వైరస్‌ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో త్వరితగతిన వైద్యం అందించాలనే లక్ష్యంతో కరోనా చికిత్సను వికేంద్రీకరించింది. దీంతో అన్ని జిల్లా, ఏరియా దవాఖానల్లో కరోనా చికిత్స అందుబాటులోకి వచ్చింది. 

ప్రస్తుతం రోజుకు 40 వేల పరీక్షలు

పరీక్షల సంఖ్యను భారీగా పెంచడం, సమర్థవంతమైన ట్రాకింగ్‌, బాధితులకు తక్షణం వైద్య సదుపాయాలు అందించడం అనే వ్యూహంతో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఇందులో ముఖ్యమైన కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను అనుసరిస్తున్నది. నిజానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి 10 లక్షల జనాభాలో 140 మందికి టెస్టులు చేయాలని సూచించింది. ఈ లెక్కన తెలంగాణ జనాభాను బట్టి రోజుకు 5,600 పరీక్షలు నిర్వహించాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం పరీక్షల సంఖ్యను క్రమంగా 40 వేలకు పెంచింది. దీని ప్రకారం, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 10 లక్షల మందిలో 25 వేల పరీక్షలు నిర్వహిస్తున్నది. గతంలో కేవలం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను మాత్రమే నిర్వహించిన సర్కారు.. కేవలం 15 నిమిషాల్లో ఫలితాలు ఇచ్చే ర్యాపిడ్‌ టెస్టులను చేపట్టింది. 

కరోనా మొబైల్‌ టెస్టింగ్‌ బస్సులను సమకూర్చింది. రాష్ట్రంలో ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా అన్ని జిల్లాల్లో కలిపి 1,100 వైరస్‌ నిర్ధారణ కేంద్రాలను ఏర్పాటుచేసింది. 

పెరిగిన రికవరీ.. తగ్గిన మరణాలు 

కరోనా విజృంభించిన తొలిరోజుల్లో దేశంతోపాటు తెలంగాణలోనూ రికవరీ రేటు తక్కువగా ఉన్నది. అయితే అతితక్కువ కాలంలోనే దేశంలోని చాలా రాష్ర్టాలను దాటుకొని రికవరీ రేటు మన రాష్ట్రంలో పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు దేశంలో 74% ఉంటే.. మన రాష్ట్రంలో 77.3శాతంగా నమోదైంది. నాణ్యమైన వైద్యసేవలు అందుతుండటంతో మరణాల రేటు 1% కంటే తక్కువగానే కొనసాగుతున్నది. ఒకవైపు పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షకు చేరుకున్నప్పటికీ రికవరీ రేటులో గణనీయమైన వృద్ధి, మరణాలు 1% కంటే తక్కువగా ఉండటం సానుకూలంశాలని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

ముందునుంచి సిద్ధంగానే ఉన్నాం

కరోనా విషయంలో ముందునుంచి అప్రమత్తంగానే ఉన్నాం. కేసుల సంఖ్య పెరిగినా ఎదుర్కొనేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లుచేసింది. నాణ్యమైన చికిత్స అందిస్తుండటం వల్ల కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నది. మరణాల శాతాన్ని పూర్తిగా తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించడం, భౌతికదూరం వంటి అంశాలే ప్రతి ఒక్కరినీ కాపాడుతాయి. లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలి. సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలి.

- శ్రీనివాసరావు, ప్రజారోగ్యశాఖ సంచాలకుడు

విలువైన ఔషధాలు, వైద్య సామగ్రి

కరోనా బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు ఎంత ఖర్చు అయినా వెనుకాడొద్దని సీఎం కేసీఆర్‌ చెప్పడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ దిశగా చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌లో ఉన్న ఫార్మా కంపెనీల సాయంతో విలువైన అత్యవసర మందులు రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి వచ్చాయి. రెమ్డిస్‌విర్‌, ఫావిపిరవిర్‌, డెక్సామెథాసోన్‌ సహా ఖరీదైన మెడిసిన్‌గాచెప్పుకొనే టోస్లిజుమాబ్‌ ఇంజెక్షన్లు కొరతలేకుండా బాధితులకు ఉచితంగా అందుతున్నాయి. మరోవైపు జీహెచ్‌ఎంసీ సహా అన్ని జిల్లా దవాఖానల్లోని పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యాన్ని పెంచారు. అవసరాలకు అనుగుణంగా వెంటిలేటర్ల కొనుగోలు, వైద్యసిబ్బంది నియామకం వంటి చర్యలను ప్రభుత్వం తీసుకున్నది. 


logo