మంగళవారం 26 మే 2020
Telangana - May 24, 2020 , 01:57:29

సూర్యదీపికకు సరిలేరు

సూర్యదీపికకు సరిలేరు

  • ఎఫ్‌సీఆర్‌ఐ విద్యార్థినికి ఆబర్న్‌వర్సిటీలో సీటు
  • 15వేల డాలర్ల ఫీజు మాఫీ
  • ఫీజు మాఫీతోపాటు స్కాలర్‌షిప్‌
  • రంగారెడ్డి జిల్లా విద్యార్థినికి అరుదైన అవకాశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌ అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ)కి చెందిన విద్యార్థినికి అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఆబర్న్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ ఉచిత సీటు లభించింది. రంగారెడ్డి జిల్లాకుచెందిన సూర్యదీపిక ఈ ఘనత సాధించింది. రెండేండ్ల కోర్సుకుగాను ఫీజు మాఫీతోపాటు ప్రతినెల ఉపకారవేతనం కూడా లభించనుంది. ఎఫ్‌సీఆర్‌ఐలో ఫారెస్ట్రీ కోర్సు చివరి సంవత్సరం చదువుతున్న దీపిక.. ఇంకా తుది పరీక్షలు రాయాల్సి ఉండగానే ఈ అరుదైన అవకాశం దక్కించుకుంది. ఫారెస్ట్రీ కోర్సులో ఆమె ప్రతిభను చూసిన ఆబర్న్‌ యూనివర్సిటీ ఎంఎస్‌లో సీటు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రెండేండ్ల వ్యవధిగల ఈ కోర్సు ఫీజు ఏడాదికి 15వేల డాలర్ల (సుమారు రూ.11.4 లక్షలు)వరకు ఉంటుంది. ఈ మొత్తాన్ని మాఫీ చేయడంతోపాటు నెలకు 1500 డాలర్ల (సుమారు రూ.1.14 లక్షలు) ఉపకారవేతనాన్ని కూడా యూనివర్సిటీ మంజూరుచేసింది. ఆబర్న్‌ యూనివర్సిటీలో డాక్టర్‌ జన్నా విల్లాగ్‌ నేతృత్వంలో జెనెటిక్స్‌, వన్యప్రాణులపై సూర్యదీపిక అధ్యయనం చేయనుంది. అమెరికాలో తాను ఎంఎస్‌ చదువుతానని అసలు ఊహించలేదని సూర్యదీపిక తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. తన కలను నిజం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు, కళాశాల యాజమాన్యానికి ఆమె కృతజ్ఞతలు తెలిపింది.


logo