బుధవారం 03 జూన్ 2020
Telangana - May 09, 2020 , 02:00:56

ఎఫ్‌సీఐ నిండా తెలంగాణ ధాన్యం

ఎఫ్‌సీఐ నిండా తెలంగాణ ధాన్యం

  • దేశవ్యాప్తంగా 45 లక్షల టన్నులు సేకరిస్తే 30 లక్షల టన్నులు మన రాష్ట్రం నుంచే
  • రాష్ట్ర చరిత్రలో తొలిసారి
  • యాసంగిలో 90 లక్షల టన్నుల పంట

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) యాసంగి సీజన్‌కుగాను రికార్డుస్థాయిలో బియ్యాని పౌరసరఫరాలశాఖ నుంచి సేకరించనున్నది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 45 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో తెలంగాణ వాటా 30 టన్నులు. ఏపీ నుంచి 10 లక్షల టన్నులు సేకరించగా, దేశంలోని మిగిలిన రాష్ర్టాల నుంచి సేకరించింది ఐదు లక్షల టన్నులే కావడం గమనార్హం. యాసంగిలో తెలంగాణ సాధించిన వరిధాన్యం దిగుబడి దేశమంతటి దృష్టిని ఆకర్షిస్తున్నది. సాగునీటి ప్రాజెక్టుల సౌజన్యంతో కాలువలు, చెరువులు, భూగర్భంలో నీటి వనరులు సమృద్ధిగా అందుబాటులోకి రావడంతో ఈ ఏడాది యాసంగిలో ధాన్యం దిగుబడి అనూహ్యంగా పెరిగింది. ఇక ధాన్యం కొనుగోళ్లలో కూడా ముందున్న రాష్ట్రం ఎఫ్‌సీఐకి దానిని అందజేయడంలో కూడా అగ్రభాగాన నిలిచింది. గురువారం నాటికి ఎఫ్‌సీఐ దేశమంతటా 45 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో తెలంగాణ వాటా 30 లక్షల టన్నులు. ఈ విషయాన్ని ఎఫ్‌సీఐ సీఎండీ డీవీ ప్రసాద్‌ తెలిపారు. యాసంగి సీజన్‌లో తెలంగాణలో దాదాపు 90 లక్షల ధాన్యం పండే అవకాశం ఉన్నదని ఆయన అంచనావేశారు. తెలంగాణ చరిత్రలో ఈ స్థాయిలో ధాన్యం పండించడం ఇదే మొదటిసారి అని తెలిపారు. కాళేశ్వరం, దాని అనుబంధ ప్రాజెక్టుల్లో జలవనరులు సమృద్ధిగా అందుబాటులోకి రావడంలో కాలువ చివరి భూముల్లో కూడా దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. బియ్యాన్ని సేకరించి, ఇతర రాష్ర్టాలకు సరఫరా చేసే విధానాన్ని ప్రణాళికాబద్ధం చేయడంపై దృష్టి సారిస్తున్నామని ప్రసాద్‌ తెలిపారు. సాధారణంగా రేషన్‌కార్డుపై నెలకు ఒక వ్యక్తికి ఆరుకిలోల చొప్పున బియ్యం పంపిణీ చేసే తెలంగాణ ప్రభుత్వం గత నెలలో కరోనా నేపథ్యంలో పేదలకు 12 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీచేసింది. దీనికితోడు ఇతర రాష్ర్టాలలో ఆకలితో అలమటించే వారిని ఆదుకొనేందుకు 374 రైళ్ల ద్వారా 10.47 లక్షల టన్నుల బియ్యాన్ని రవాణా చేసింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ర్టాలకు బియ్యం పంపించింది. రాష్ట్రంలోని 57 స్వచ్ఛంద సంస్థలకు సబ్సిడీ రేటుతో ఆహార ధాన్యాల్ని ఎఫ్‌సీఐ తెలంగాణశాఖ విడుదలచేసింది. అంతేకాకుండా మరో ఐదు నెలలపాటు రాష్ట్రలోని 87 లక్షల రేషన్‌కార్డుదారులకు పంపిణీ చేసేందుకు బియ్యం నిల్వలు సమృద్ధిగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద దాదాపు రూ. 46 వేల కోట్ల ఖర్చుతో 120 లక్షల టన్నుల ఆహార ధాన్యాల్ని కేంద్రం రాష్ట్రాలకు సరఫరా చేసింది. కొవిడ్‌-19 నేపథ్యంలో సుమారు 1.33 లక్షల టన్నుల బియ్యాన్ని కిలో రూ.22 చొప్పున తెలంగాణకు ఎఫ్‌సీఐ విడుదల చేసింది. logo