గురువారం 16 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 02:31:03

దక్షిణాది వైరస్‌ బలహీనం

దక్షిణాది వైరస్‌ బలహీనం

  • ఉత్తరాదిన ఏ2ఏ, దక్షిణాదిన ఏ3ఏ
  • ఉత్తరభారతంలో మరణాలు 5 శాతం
  • దక్షిణాది రాష్ర్టాల్లో మృతులు 3% లోపే
  • సీసీఎంబీ జీనోమ్‌ సీక్వెన్సీ రిసెర్చ్‌లో వెల్లడి
  • 2 రకాల కరోనా ఉత్తరాదిలో అతి తీవ్రం

దక్షిణాదిలో ప్రబలుతున్న వైరస్‌ సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌లో వ్యాప్తి చెందుతున్న వైరస్‌ జన్యుక్రమం ఒక్కటిగా ఉన్నది. ఈ వైరస్‌ బలహీనంగా ఉన్నది. అందుకే దక్షిణాది రాష్ర్టాలలో మరణాల రేటు తక్కువగా ఉన్నది. గుజరాత్‌, మహారాష్ట్ర, ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నది. అక్కడి వైరస్‌ మ్యుటేషన్‌లో తేడా ఉన్నది.

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దేశంలో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌.. ఉత్తర, దక్షిణ భారతంలో వేర్వేరు తీవ్రతలతో ఉన్నట్టు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) జరుపుతున్న పరిశోధనల్లో వెల్లడవుతున్నది. ఉత్తరాదిలో కేసులు భారీగా నమోదవుతుండగా, దక్షిణాదిలో ఆ సంఖ్య తక్కువగా ఉన్నది. దక్షిణాదిలో ప్రబలుతున్న వైరస్‌ బలహీనంగా ఉండటం వల్లనే మరణాల రేటు తక్కువగా ఉన్నదని సీసీఎంబీ భావిస్తున్నది. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రబులుతున్న వైరస్‌కు, మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ వంటి రాష్ర్టాలలో విస్తరిస్తున్న వైరస్‌కు స్పష్టమైన తేడా ఉన్నట్టు సీసీఎంబీ జరుపుతున్న ‘జీనోమ్‌ సీక్వెన్సీ’ పరీక్షలలో స్పష్టమవుతున్నది. పరిశోధకులు దక్షిణాదిలో మనుగడులో ఉన్న వైరస్‌కు ‘ఏ3ఏ’గా, ఉత్తర భారతంలో విజృంభిస్తున్న వైరస్‌కు ‘ఏ2ఏ’గా పేరుపెట్టారు. 

ఈ రెండు వైరస్‌లలో స్పష్టమైన తేడా ఉన్నట్టు తమ జన్యు క్రమ పరీక్షలలో తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. దక్షిణాదిలో ప్రబలుతున్న వైరస్‌ సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌లో వ్యాప్తి చెందుతున్న వైరస్‌ జన్యుక్రమం ఒక్కటిగా ఉన్నదని నిర్ధారించారు. ఈ వైరస్‌ బలహీనంగా ఉన్నదని తెలిపారు. దక్షిణాది రాష్ర్టాలలో మరణాల రేటు తక్కువగా ఉండటానికి ఇది ఒక కారణమని వెల్లడించారు. కరోనా జన్యుక్రమంలో మార్పుల గుట్టురట్టు చేయడానికి సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా నేతృత్వంలో గత నెల రోజులుగా జీనోమ్‌ సీక్వెన్సీ పరిశోధనలను జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ కూడా కొంత సహకారమందించింది. ఇప్పటివరకు వందకు పైగా  వైరస్‌ నమూనాల జన్యువులను వేరు (ఐసోలేట్‌) చేసి లోతుగా పరిశీలించారు. ఈ పరిశోధనలలో కరోనా జన్యువులలో తేడాలను గ్రహించగలిగారు. దేశంలో విస్తరిస్తున్న వైరస్‌ ప్రధానంగా రెండు రకాలుగా ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్‌, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ర్టాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, అక్కడి వైరస్‌ మ్యుటేషన్‌లో తేడా ఉందని చెప్పారు. ఇక్కడ ప్రబలుతున్న కరోనా జన్యువు అమెరికా, చైనా, ఇటలీ దేశాలలోని కరోనా జన్యువుతో సరిపోలుతున్నట్లు  గుర్తించారు. 


మరణాలు రేటు 17శాతం తక్కువ

భారతదేశంలో కరోనా మరణాల రేటు 3.3శాతంగా ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న మరణాల రేటుతో పోలిస్తే దాదాపు 17శాతం తక్కువ. కానీ మన దేశంలో దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్నది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో అది 5 శాతం ఉండగా, దక్షిణాదిలో 3 శాతం లోపే ఉన్నది. ఉత్తర భారతంలో విస్తరిస్తున్న వైరస్‌ యూరప్‌ దేశాల నుంచి వచ్చి ఉంటుందని రాకేశ్‌ మిశ్రా నమస్తే తెలంగాణకు చెప్పారు. దక్షిణాదిన ప్రబలుతున్న వైరస్‌ దక్షిణాసియా దేశాల నుంచి ప్రధానంగా సింగపూర్‌ లేదా ఫిలిప్పీన్స్‌ నుంచి వ్యాప్తి చెంది ఉంటుందని తెలిపారు. దక్షిణాదిలో ప్రబలుతున్న కరోనా వైరస్‌ తీవ్రత తక్కువగా ఉన్నదన్నారు. దక్షిణాదిలో కరోనా సోకిన వారికి  వైరస్‌ లోడ్‌ తక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. దీని వల్ల వైరస్‌ ప్రభావం తీవ్రత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. 


logo