గురువారం 16 జూలై 2020
Telangana - Jun 19, 2020 , 01:58:58

పట్టణాల్లో చిట్టి అడవులు

పట్టణాల్లో చిట్టి అడవులు

  • యాదాద్రి మోడల్‌తో అటవీ అభివృద్ధి
  • 140 పట్టణాల్లో 420 చిట్టడవుల సృష్టి
  • తక్కువ ప్రదేశంలో ఎక్కువ మొక్కలు
  • పూలు, పండ్ల మొక్కలు ఒకే చోట 
  • జీవవైవిధ్యానికి నిలయాలుగా పట్టణాలు
  • హరితహారంలో అమలుకు ప్రణాళికలు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పారిశ్రామీకరణ, పట్టణీకరణ ప్రభావంతో అడవులు అంతరించిపోతున్నాయి. దీంతో పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు ప్రభుత్వాలు మళ్లీ అడవుల పెంపకంవైపు దృష్టి సారిస్తున్నాయి. హరితహారం కార్యక్రమంతో పచ్చదనం పెంపుదలలో ముందంజలో ఉన్న తెలంగాణ, అటవీ ప్రాంతాల పెంపునకు వినూత్న ప్రణాళికలు రూపొందించింది. పట్టణాల్లో కూడా చిట్టడవులు సృష్టించేందుకు శ్రీకారం చుట్టింది. ఎకరం ఖాళీస్థలం ఉన్నా, దట్టంగా చెట్లు పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం ‘యాదాద్రి న్యాచురల్‌ ఫారెస్ట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ప్రోగ్రాం’ను అందుబాటులోకి తెచ్చింది. చిట్టడవుల పెంపకంలో ఇప్పటికే విజయవంతమైన యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ (మియావాకి)ని అన్ని పట్టణాల్లో అమలుచేయడానికి  సిద్ధమైంది. హరితహారంలో భాగంగా ఈ ఏడాది ప్రతి పట్టణంలో కనీసం మూడు ప్రాంతాలను ఎంచుకుని దట్టమైన అడవిని పెంచాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 140 పట్టణాల్లో దాదాపు 420 కృత్రిమ అడువులను పెంచేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధంచేసింది. 

యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌

పట్టణ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు వీలుగా జనాభా దా మాషాలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం యాదాద్రి మో డల్‌ విధానాన్ని అనుసరించాలని నిర్ణయించింది. ఈ పద్ధతిలో అరెకరం లేదా ఎకరం భూమిలో 40సెంటీమీటర్ల లోతులో ఎం డిన ఆకులు, పేడ, కొబ్బరి పీచు, యూరియా, వర్మికంపోస్టును ఒక పొరగా నింపుతారు. దానిపై ఎర్రమట్టిని కప్పి మూడు రోజులపాటు నీళ్లు పడుతారు. మూడు వారాల తర్వాత ఆ ప్రదేశాన్ని దున్ని మొక్కలు నాటేందుకు అనువుగా సిద్ధం చేస్తారు. 

2017లోనే శ్రీకారం..

తెలంగాణలో మియావాకీ విధానానికి 2017లో మంచిర్యాల జిల్లా చెన్నూరులో శ్రీకారం చుట్టారు. 1.30 హెక్టారు స్థలంలో దాదాపు యాభై రకాల మొక్కలు పదివేలు నాటారు. చుట్టూ వైర్‌ ఫెన్సింగ్‌ వేసి, వేసవిలో మూడుసార్లు నీటిసౌకర్యం కల్పించడంతో 95శాతం మొక్కలు బతికాయి. సహజసిద్ధమైన అడవిని కృత్రిమ పద్ధతుల్లో రూపొందించవచ్చని దీంతో నిరూపితమైంది. స్థానికంగా దొరికే రకరకాల మొక్కలు, రకరకాల వృక్షజాతులను ఇక్కడ మిశ్రమపద్ధతిలో పెంచారు. కేవలం ఏడాదిలోనే దట్టంగా ఏపుగా పెరిగిన చెట్లతో అటవీ సంపద వృద్ధిచెందింది. గతేడాది యాదాద్రి భువనగిరి జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టు గా మియావాకి పద్ధతిలో అడవుల పెంపకాన్ని చేపట్టారు. విజయవంతం కావడంతో దీన్ని రాష్ట్రమంతటా అమలుచేయాలని నిర్ణయించారు.

తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు


రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో కనీసం వెయ్యి చదరపు మీ టర్ల నుంచి ఎకరం విస్తీర్ణంలో యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌కు చర్యలు తీసుకోవాలని ప్రభు త్వం అటవీ, మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ శాఖలను ఆదేశించింది. ఎకరం విస్తీర్ణంలో వెయ్యి నుంచి ఎనిమిది వేల మొక్కలు నాటవచ్చు. ఇం దుకు ఎకరానికి 10 నుంచి 15 టన్నుల ఎరువును ఉపయోగిస్తున్నారు. ప్రతి మూడు మీటర్ల దూరంలో ఒక పెద్దసైజు మొక్క, రెండు చిన్న సైజు మొక్కలు వరుసగా నాటుతారు. పెరిగిన తర్వాత ఒకదానికి మరొకటి అడ్డురాకుండా ఉండేందుకు వృక్షజాతులు, వాటి ఎత్తు, విస్తరణ ఆధారంగా ఎంపికచేసి నాటుతారు. ఈ విధంగా ఎకరానికి రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు ఖర్చవుతుందని అంచనా.

45 రకాల మొక్కలు

యాదాద్రి డెన్స్‌ ప్లాంటేషన్‌ విధానంలో నాటేందుకు కొన్ని ప్రత్యేకమైన మొక్కలను ఎంచుకుంటారు. అత్యంత ఎత్తుగా ఎదిగే మొక్కలతోపాటు మధ్యస్థంగా, తక్కువ ఎత్తులో పెరిగే మొక్కలను పెంచుతారు. తులసి, లెమన్‌ గ్రాస్‌, మింట్‌, దావ ణం, అలోవెరా వంటి నలభైఐదు రకాల మొక్కలను నాటుతారు. తంగేడు, వెదురు, నేరేడు, మారేడు, సీతాఫలం, టేకు, గన్నేరు, గోరింటాకు, ఇప్ప, మద్ది, మోదుగ, రేల, వేప, ఉసిరి వంటివి నాటుతారు. వీటిలో పండ్లు, పూల చెట్లకు స్థానం కల్పిస్తారు. ఆ మొక్కల ఎదుగుదలను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులను కొనసాగించటం కూడా ఈ మోడల్‌ ప్రత్యేకత. 

ఎనిమిది నెలల్లో చిట్టడవులు

యాదాద్రి మోడల్‌లో మొక్కలు నాటిన ఎనిమిది నెలల్లోపే సుమారు రెండుమీటర్ల ఎత్తు వరకు పెరిగి చిట్టడవులను తలపిస్తాయి. ఈ పద్ధతిలో చౌటుప్పల్‌ దగ్గర తంగేడువనం అర్బన్‌ఫారెస్ట్‌ పార్క్‌లో ఎకరా భూమిలో పెంచిన అడవి కేవలం ఏడాదిలోనే మంచి ఫలితాలను ఇచ్చింది. దాంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పచ్చదనం అలుముకున్నది. వీటితోపాటు రాచకొండ, లక్కారం, బీబీనగర్‌, కొండమడుగు, వీరారెడ్డిపల్లి, మేడ్చల్‌-కండ్లకోయ, కరీంనగర్‌-పోలీస్‌గ్రౌండ్స్‌, రామగుండం-ఎన్టీపీసీ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన యాదాద్రి విధానం సత్ఫలితాలు ఇస్తున్నది. 

పట్టణ ప్రాంతాలు లక్ష్యంగా..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంతోపాటు రాష్ట్రంలోని 140 పట్టణాల్లో దాదాపు 420 కృత్రిమ అడువులను పెంచాలని ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ), హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీఏ), మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలోని అన్ని పురపాలక సంస్థలు యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ను చేపట్టనున్నాయి. జీహెచ్‌ఎంసీలో 40 యూనిట్లు, హెచ్‌ఎండీఏ పరిధిలో 50 యూనిట్లు, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 40 యూనిట్లు, రాష్ట్రవ్యాప్తంగా పట్టణ పురపాలక సంస్థల్లో కనీసం మూడు చొప్పున చిట్టడవులను అభివృద్ధి చేసేందుకు ఆయా విభాగాలు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి.

యాదాద్రి మోడల్‌ అనుకూలం

పట్టణ ప్రాంతాల్లో గ్రీనరీ పెంచేందుకు యాదాద్రి మోడల్‌ ఎంతో దోహదపడుతుంది. మియావాకీ విధానంలో తక్కువ కాలంలో ఎక్కువ పచ్చదనాన్ని ఇచ్చే మొక్కలను పెంచవచ్చు. ఇరుకైన ప్రాంతాల్లో కూడా ఈ పద్ధతిలో మొక్కలు నాటి కాపాడుకోవచ్చు. 

- బీ శ్రీనివాస్‌, డైరెక్టర్‌, అర్బన్‌ ఫారెస్ట్రీ, హెచ్‌ఎండీఏ 


logo