e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home Top Slides కమ్మపల్లి ఏటా పల్లి

కమ్మపల్లి ఏటా పల్లి

కమ్మపల్లి ఏటా పల్లి
  • వ్యవసాయ మొత్తం విస్తీర్ణం 800 ఎకరాలు
  • ప్రతి వానకాలం 480 ఎకరాల్లో వేరుశనగ సాగు
  • ఒక్కో ఎకరంలో 8 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి
  • మార్కెట్‌కు పోకుండా రైతుల ఇండ్ల వద్దే అమ్మకం
  • పెట్టుబడి ఖర్చుపోగా ఎకరానికి 20 వేల ఆదాయం
  • యాసంగిలో మరో వాణిజ్యపంట మిర్చి సాగు
  • ఆదర్శంగా వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని గ్రామం

కమ్మపల్లి.. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని ఓ గ్రామం. సుమారు 800 ఎకరాల వ్యవసాయభూమి ఉంటుంది. అందరికీ భిన్నంగా ఆ గ్రామ రైతులు ‘వేరు’గా సాగుతున్నారు. మొత్తం భూమిలో దాదాపు 480 ఎకరాల్లో పల్లి పంటవేస్తూ కమ్మ ‘పల్లి’ అనే తమఊరు పేరును సార్థకం చేసుకుంటున్నారు. ఎకరంలో 12 నుంచి 18 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తూ.. పెట్టుబడిపోగా రూ.20 వేలదాకా ఆదాయం పొందుతున్నారు. విశేషమేమిటంటే.. రైతులెవరూ తమపంటను అమ్ముకొనేందుకు ఇప్పటిదాకా మార్కెట్‌ దిక్కే వెళ్లలేదు. వ్యాపారులు, ఆయిల్‌ మిల్లర్లే రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేసుకుని తీసు కెళ్తుంటారు. ఇదీ మార్కెట్‌లో వేరుశనగకు ఉన్న డిమాండ్‌. వానకాలంలో వేరుశనగ వేస్తున్న రైతులు.. యాసంగిలో మరో వాణిజ్యపంట మిర్చితో ముందుకు ‘సాగు’తున్నారు.

వరంగల్‌ రూరల్‌, జూన్‌ 16 (నమస్తే తెలంగాణ): మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలనే సాగుచేయండి అంటూ ప్రభుత్వం తరుచూ సూచిస్తూ వస్తున్నది. దీనివల్ల పంటను సులభంగా అమ్ముకోవడంతోపాటు, అధిక లాభాలు పొందవచ్చని అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నది. వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట మండలంలోని రైతులు మాత్రం దశాబ్దాల క్రితంనుంచే మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న వాణిజ్య పంటలనే సాగుచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యంగా మండలంలోని కమ్మపల్లి అనే గ్రామ రైతులు తమ ఊరుపేరును సార్థకం చేసుకుంటూ పల్లి పంటను సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. వానకాలంలో వేరుశనగ, యాసంగిలో మరో వాణిజ్య పంట మిరప వేస్తున్నారు. గ్రామంలో మొత్తం సాగు విస్తీర్ణం సుమారు 800 ఎకరాలు ఉండగా.. అందులో దాదాపు 60 శాతం విస్తీర్ణంలో వానకాలం పంటగా వేరుశనగ వేస్తున్నారు. నూటయాభై ఎకరాల్లో పత్తి, వందఎకరాల్లో వరి, మిగతా విస్తీర్ణంలో పెసర, ఉద్యానపంటలు పండిస్తారు. కొన్ని దశాబ్దాలుగా కమ్మపల్లి రైతులు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఇప్పటికే సుమారు 480 ఎకరాల్లో వేరుశనగ వేశారు.

- Advertisement -

ఇంటివద్దే కొనుగోళ్లు
ఎండాకాలంలోనే వేరుశనగ విత్తనాలు సిద్ధం చేసుకునే రైతులు.. బోర్ల ఆధారంగా దుక్కులను కూడా రెడీచేసుకుంటారు. తొలకరి వర్షాలు కురియగానే విత్తనాలు చల్లుతారు. జూన్‌ మొదటివారం వరకు విత్తనాలు చల్లడం పూర్తవుతుంది. ఎక్కువగా బోర్ల కింద సాగయ్యే ఈ పంటకోసం రైతులు కాలానుగుణంగా ఎక్కువ దిగుబడి ఇచ్చే మేలురకం విత్తనాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఎకరంలో దేశవాళీ విత్తనాలైతే ఏడు నుంచి ఎనిమిది, హైబ్రీడ్‌ రకం విత్తనాలైతే 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు సాధిస్తున్నారు. వేరుశనగకు ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు, ఆయిల్‌ మిల్లర్లు రైతుల ఇండ్లవద్దకే వచ్చే పంటను కొనుగోలు చేస్తున్నారు. కమ్మపల్లి రైతులు వేరుశనగ పంటను అమ్ముకొనేందుకు ఇప్పటిదాకా మార్కెట్‌కు వెళ్లకపోవడం గమనార్హం. ఇంటివద్దే క్వింటాల్‌కు రూ.4,500 నుంచి రూ.8 వేల వరకు ధర పొందుతున్నారు. రూ.4,500 కంటే ఎప్పుడూ తగ్గకపోవటం గమనార్హం. పెట్టుబడి ఖర్చులు పోను ఎకరానికి రూ.20 వేలకుపైగా ఆదాయం పొందుతున్నారు. సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో వేరుశనగ పూర్తికాగానే.. యాసంగిలో మిర్చి పంటను సాగుచేస్తారు. ప్రభుత్వం వానకాలం, యాసంగిలో రైతుబంధు అందిస్తుండటంతో రైతులు అప్పులు చేయాల్సిన అవసరం రాలేదు. మెజారిటీ రైతులు పంటరుణం కోసం బ్యాంకులను కూడా సంప్రదించడం లేదు.

జిల్లాల్లో పెరుగుతున్న వేరుశనగ సాగు
ప్రభుత్వ సూచనతో వరంగల్‌ జిల్లాలో పల్లి పంటసాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతున్నది. నర్సంపేట మండలంలోని దాసరిపల్లె, చంద్రయపల్లె, బాంజిపేటలో పల్లి అధికంగా సాగుచేస్తున్నారు. ఈ గ్రామాల్లోని మెజారిటీ రైతులు వానకాలంలో పల్లి, రెండోపంటగా మిర్చి సాగు చేస్తున్నారు. గతేడాది వానకాలం జిల్లావ్యాప్తంగా సుమారు 8 వేల ఎకరాల్లో పల్లి వేశారు. ఇందులో నర్సంపేట వ్యవసాయ డివిజన్‌ పరిధిలోనే 6వేల ఎకరాలు ఉండటం గమనార్హం. ఈసారి 10వేల ఎకరాలకు పెరుగవచ్చని అంచనా.

బుద్దెరిగినప్పటి నుంచీ పల్లిసాగే
మా ఊర్లో వానకాలం ఎక్కువగా పల్లి సాగుచేస్తం. బుద్దెరిగినప్పటి నుంచీ అదే వేస్తున్నం. ఈ ఏడాది కొత్త వెరైటీ లేపాక్షి 1812 రకం సీడ్‌ను రెండున్నర
ఎకరాల్లో వేశా. ఎకరానికి 18 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందట.
– వలుగుబెల్లి రంగారెడ్డి, సర్పంచ్‌, కమ్మపల్లి

రైతుకు, భూమికి లాభం
పల్లి పంటతో అటు రైతుకు, ఇటు భూమికీ లాభమే. ప్రతి వానకాలం నర్సంపేట మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పల్లి సాగుచేస్తున్నారు. రైతులు ఏపీలోని అనంతపురం వెళ్లి లేపాక్షి 1812 రకం విత్తనాలు తెచ్చి సాగుచేశారు. వేరశనగ ధర ఎన్నడూ క్వింటాల్‌కు రూ.4,500కు తగ్గలేదు.
– కృష్ణకుమార్‌, వ్యవసాయ అధికారి, నర్సంపేట

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కమ్మపల్లి ఏటా పల్లి
కమ్మపల్లి ఏటా పల్లి
కమ్మపల్లి ఏటా పల్లి

ట్రెండింగ్‌

Advertisement