శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 26, 2020 , 16:46:28

29న రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా

29న రైతు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ధ‌ర్నా

వ‌రంగ‌ల్ రూర‌ల్ : ఈ నెల 29న వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టబోయే ధర్నా కార్యక్రమాన్ని పార్టీలకు అతీతంగా అధిక సంఖ్యలో పాల్గొని విజయవంత చేయాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు.  హన్మకొండలోని తన నివాసంలో పరకాల రూరల్, నడికూడ, ఆత్మకూర్, దామెర, గీసుగొండ, సంగెం మండలాల టీఆర్ఎస్ ముఖ్యకార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ, ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రైతులకు మద్దతుగా ఈ నెల 29 న కలెక్టర్ కార్యాలయం ముందు రూరల్ జిల్లా ఎమ్మెల్యేలంతా ధర్నా చేయనున్నట్లు తెలిపారు.

ఈ చట్టాలు కార్పొరేట్‌ సంస్థలకు, అంబానీ, అదానీల వంటి పెట్టుబడిదారులకు మేలు చేసేలా, భవిష్యత్తులో రైతులను కూలీలను చేసేలా ఉన్నాయన్నారు. రైతులంటే అదానీ, అంబానీలు కాదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో వ్యవసాయాన్ని పండుగలా మార్చుతున్నారన్నారు. ఇందులో భాగంగానే 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు తెచ్చారని, ఎరువుల కొరత లేకుండా చేశారని గుర్తుచేశారు.

కాళేశ్వ‌రం నీటితో చెరువుల‌కు జ‌ల‌క‌ళ‌

గతేడాది నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో చెరువులు నింపుతున్నారని, దేవాదుల ప్రాజెక్టు మూడోదశ నుంచి నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట, ములుగు, భూపాలపల్లి తదితర నియోజకవర్గాలకు సాగు, తాగు నీరందుతుందని  చెప్పారు. ఇదే దేవాదుల మూడోదశలో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరైన చలివాగు ప్రాజెక్టు నుంచి దేవాదుల నీటిని మిషన్‌ భగీరథ పథకం ద్వారా పరకాల వంటి పట్టణానికి సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. దేవాదుల మూడో దశ, కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు ఆపాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మొదట ఆగస్టు 7న సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారని, ఈ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం కేసీఆర్‌ సమాచారం ఇచ్చినా కేంద్ర జలశక్తి మంత్రి తిరిగి ఈ నెల 11న మళ్లీ లేఖ రాశారని, పనులు ఆపకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి తన లేఖలో పేర్కొన్న విష‌యాన్ని గుర్తు చేశారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఈ ప్రాజెక్టుల పనులపై కమిషన్‌ వేయాలి లేదా విచారణ జరపాలి గానీ పనులు ఆపాలని ఆదేశాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దేవాదుల మూడోదశ, కాళేశ్వరం మూడో టీఎంసీ పనులను, రైతులను రోడ్డునపడేసిన కేంద్ర ప్రభుత్వానికిని రైతులు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. రాజకీయాలకు అతీతంగా 29న వరంగల్‌రూరల్‌ కలెక్టరేట్‌ ఎదుట జరిగే నిరాహారదీక్షలో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.


logo