బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 02:10:46

భూమి మీకు.. భవిష్యత్తు మాకు

భూమి మీకు.. భవిష్యత్తు మాకు

  • ఫార్మాసిటీకి భూమి ఇచ్చేందుకు  రైతులు సుముఖం
  • వేగంగా కొనసాగుతున్న భూముల సేకరణ
  • ఇంటికో ఉద్యోగంపై హర్షం
  • ప్లాట్ల కేటాయింపునకు సర్కారు సన్నాహాలు

ఫార్మాసిటీకి అడుగు ముందుకు పడింది.. ఇంటికో ఉద్యోగం, ప్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఓకే అనడంతో రైతులు భూమిని ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. ఉద్యోగం వస్తే బిడ్డ భవిష్యత్తు బంగారం అవుతుందని, ప్లాట్లు వస్తే మంచి ఇల్లు కట్టుకోవచ్చని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మాసిటీ వస్తే తమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని ఆనందపడుతున్నారు.

రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/కందుకూర్‌: తెలంగాణకు తలమానికంగా, దేశానికి గర్వకారణంగా నిలువనున్న ఫార్మాసిటీ కట్టేందుకు భూమిని ఇచ్చేందుకు సిద్ధమే! అంటున్నారు రైతులు. భూమికి బదులుగా ఇంటికో ఉద్యోగం, ఎకరాకు 121 గజాల ప్లాటు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ముందుకు వస్తున్నారు. దీంతో ప్రభావిత కుటుంబాల జాబితా అధికారులు తయారుచేస్తున్నారు. కుటుంబ సభ్యుల విద్యార్హతలు, ఇతర సాంకేతిక అర్హతలను మ్యాపింగ్‌ చేస్తున్నారు. వీరికి శిక్షణ ఇచ్చేందుకు టాస్క్‌, ఇతర శిక్షణ సంస్థల సహకారం తీసుకొంటున్నారు. 

ఫార్మాసిటీ పరిసరాల్లోనే శిక్షణ కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు, యాచారం, కడ్తాల్‌ మండలాల్లో 19,333.20 ఎకరాల్లో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్‌, సిటీ టౌన్‌షిప్‌, యూనివర్సిటీ, ఫార్మా రిసెర్చ్‌, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే.. కందుకూరు మండలం ముచ్చర్ల, ఊట్లపల్లి, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట, తిమ్మాయిపల్లి, సాయిరెడ్డిగూడ, మహ్మద్‌నగర్‌, కందుకూర్‌, సర్వరావులపల్లి, యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్‌, కుర్మిద, (కుర్మిద, ముచ్చర్ల రెవెన్యూ 6,200 ఎకరాలు), కందుకూరు డివిజన్‌లో మరో 4వేల ఎకరాలను అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. వీటికి సంబంధించి నష్టపరిహారాన్ని కూడా రైతులకు చెల్లించారు. మరికొందరికి డబ్బులు చెల్లించాల్సి ఉంది.

రైతు కుటుంబాలకు భారీ లేఅవుట్‌

భూ నిర్వాసితుల కోసం ప్రభుత్వం భారీ లేఅవుట్‌ను సిద్ధం చేస్తున్నది. 400 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ తరహాలో లేఅవుట్‌ ఏర్పాటు చేసి ఎకరానికి 121 ఎకరాల గజాల ప్లాటు ఇచ్చేలా నిర్ణయం తీసుకొన్నారు. ముందుగా, టీఎస్‌ఐఐసీ అధికారులు మీర్‌ఖాన్‌పేట రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్‌ 121లో 15 ఎకరాల విస్తీర్ణంలో మోడల్‌ లేఅవుట్‌ ఏర్పాటు పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించి భారీ లేఅవుట్‌ను ప్రారంభించనున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌

తెలంగాణలో నిర్మిస్తున్న ఫార్మాసిటీని ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాక్లస్టర్‌గా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకు పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. కేంద్ర పథకానికి ఎంపికైతే నిధులు వచ్చి, పనులు మరింత వేగంగా జరుగుతాయి. ఇప్పటికే హైదరాబాద్‌ శివారులోని సుల్తాన్‌పూర్‌లో 250 ఎకరాల్లో మెడ్‌టెక్‌ పార్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడ ఇరవైకిపైగా పరిశ్రమలు యూనిట్లను స్థాపించాయి. అందులో కొన్ని ఉత్పత్తులను ప్రారంభించాయి. మెడికల్‌ డివైజెస్‌ పార్కులను ప్రోత్సహించడానికి ఒక్కోదానికి రూ.100 కోట్లు రాయితీగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సుల్తాన్‌పూర్‌ మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌కు నిధుల కోసం దరఖాస్తు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీన్ని మరో 250 ఎకరాల మేర విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కేంద్ర పథకానికి ఎంపికైతే రెండు పార్క్‌లు శరవేగంగా పూర్తి కానున్నాయి.

ఫార్మాసిటీ ప్రత్యేకతలు

  • అత్యధిక శాతం ఫార్మా యూనిట్లు జీరో లిక్విడ్‌ డిశ్చార్జిగా ఉండనున్నాయి.
  • వ్యర్థాలను శుద్ధి చేసేందుకు అధునాతన ఏర్పాట్లు
  • లివ్‌, వర్క్‌, లెర్న్‌ స్ఫూర్తితో యూనిట్ల ఏర్పాటు
  • ఫార్మాసిటీలో పనిచేసేవారికి అక్కడే నివాస సౌకర్యాలు
  • అనుబంధంగా అత్యుత్తమ విద్యాసంస్థల ఏర్పాటు

ఫార్మాసిటీతో ఉద్యోగ అవకాశాలు పుష్కలం

ఫార్మాసిటీ ఏర్పాటుతో మండలంలో నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వందల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వం భూనిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వడం ఎంతో సంతోషకరం.

- దోస మహేశ్‌, నిరుద్యోగి, మేడిపల్లి, మం:యాచారం

ఎకరాకు 121 గజాలు ఇవ్వడం హర్షణీయం

భూములు కోల్పోతున్న బాధిత రైతులందరికీ ఎకరాకు 121 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. భూమికి ఎకరాకు రూ.16 లక్షలతో పాటు 121 గజాల ఇంటి స్థలం ఇవ్వటంతో ఎకరాకు సుమారు రూ.30 లక్షల పరిహారం అందుతున్నది. ఎన్ని ఎకరాలు ఫార్మాకు ఇస్తే అన్ని 121 గజాల ప్లాట్లు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటున్నది. - మక్కపల్లి మధు, మేడిపల్లి

యాచారం అన్ని రంగాల్లో అభివృద్ధి..

ఫార్మాసిటీ ఏర్పాటుతో యాచారం మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. దేశవ్యాప్తంగా యాచారం మండలానికి గుర్తింపు వస్తుంది. యువతకు ఉద్యోగవకాశాలు వస్తాయి. చుట్టూ పరిశ్రమలు విస్తరిస్తాయి. రియల్‌ వ్యాపారం పుంజుకుంటుంది. ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రతి ఒక్కరు సహకరించి అభివృద్ధికి బాసటగా నిలవాలి.

- మహ్మద్‌ గౌస్‌, యాచారం