శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 01:54:00

కాంగ్రెస్‌ పాలనలో రైతుల ఆత్మహత్యలు

కాంగ్రెస్‌ పాలనలో రైతుల ఆత్మహత్యలు

  • దొంగరాత్రి కరెంటిచ్చి  రైతులను ఆగం చేసిండ్రు
  • కాంగ్రెస్‌, బీజేపీలు  ఇచ్చే సీసాలు మనకొద్దు
  • దుబ్బాక ఎన్నికల   ప్రచార సభల్లో హరీశ్‌రావు

సిద్దిపేట, నమస్తే తెలంగాణ: ‘ఢిల్లీలో బీహార్‌లో ఒకేప్రభుత్వం ఉంటేనే డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ ఉంటుంది అని బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ చెప్పిన్రు. నేను కూడా అదే చెప్తున్న.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తేనే దుబ్బాకలో డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ ఉంటుంది’ అని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉందని, దుబ్బాకలో కూడా ఆ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా తొగుట మండ లం ఘనపూర్‌, గుడికందుల గ్రామాల్లో హరీశ్‌రావు రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రం లో.. కాంగ్రెస్‌ పాలనలో రోజూ రైతుల ఆత్మహత్యలు జరిగేవని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీతోనే రైతుల బతుకులు ఆగమయ్యా యని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ పాలనలో కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, పంటలకు మద్దతు ధర లేదు.. ఎరువులు దొరకని పరిస్థితి. కరెంట్‌ కోసం అర్ధరాత్రి కండ్లలో వత్తులు వేసుకొని రైతులు పొలం దగ్గర ఉండే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దొంగ కరంట్‌ ఇస్తాం.. మాకు ఓట్లేయండని కాంగ్రెస్‌ వాళ్లు ప్రజలను అడుగుతారా?’ అని ప్రశ్నించారు. బీజేపీ పాలిస్తున్న 17, కాంగ్రెస్‌ పాలిస్తున్న 5 రాష్ర్టాల్లో ఎక్కడైనా రైతులకు ఉచితంగా 24గంటల కరెంట్‌ ఇస్తున్నారా.. అది చెప్పి ఓట్లు అడుగాలని సవాల్‌ చేశారు. దివంగత మాజీ మంత్రి ముత్యంరెడ్డి హయాంలో కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లకు బదులుగా అదనపు ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరుకు మరో రూ.30 వేలు చెల్లించడంతో రైతులపై భారం పడేదని గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో కారు.. సీఎం కేసీఆర్‌ వైపు ప్రజలంతా నిలబడాలని కోరారు.

ఆ సీసాలు మనకొద్దు

 కాంగ్రెస్‌, బీజేపీ ఇచ్చే సీసాలు ఎడమ కాలితోతన్నాలని హరీశ్‌ చెప్పారు. ఈ రెండు పార్టీలకు ఎందుకు ఓటు వేయాలో ఆలోచించుకోవాలని సూచించారు. ‘కాంగ్రెస్‌ చేతిలో నెత్తిలేదు.. కత్తిలేదు.. వాళ్లేమి చేస్తరు.. తెలంగాణ వచ్చాకనే రైతుల పరిస్థితి మారింది.. నాటి నిజాంపాలన నుంచి ఆంధ్రా పాలకుల వరకు ప్రతిఒక్కరూ భూమి ఉన్న వారి వద్ద శిస్తు వసూలు చేశారు. కానీ, సీఎం కేసీఆర్‌ మాత్రం చరిత్రను తిరగరాసి, భూమి ఉన్న ప్రతిఒక్కరికీ రైతుబంధు ద్వారా డబ్బులి స్తూ, రైతులకే శిస్తు ఇస్తున్నారు’ అని వివరించారు. సోలిపేట రామలింగారెడ్డి ఆశయ సాధన కోసం కారు గుర్తుకు ఓటేసి సుజాతక్కను గెలిపించాలని కోరారు. 

మేం తెలంగాణలో కలుస్తాం

  • మీ పథకాలు మాకూ వర్తించేలా చేయండి 
  • మంత్రి హరీశ్‌రావును కోరిన మహారాష్ట్ర ప్రతినిధులు 

సిద్దిపేట కలెక్టరేట్‌/బోధన్‌: ‘మా గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలుపండి.. మాకూ మీ సంక్షేమపథకాలు వర్తించేలా చూడండి’ అంటూ మహారాష్ట్ర వాసులు గురువారం సిద్దిపేటలో ఆర్థికమంత్రి హరీశ్‌రావును కలిసి విన్నవించారు. నాందేడ్‌ జిల్లా ధర్మాబాద్‌ డివిజన్‌ పరిధిలోని 42గ్రామాలను తెలంగాణలో కలుపాలని మంత్రి హరీశ్‌ను కోరినట్టు మహారాష్ట్ర ప్రతినిధులు రాజ్‌లింగారెడ్డి, శంకర్‌శెట్టి, బాలాజీ తెలిపారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ అద్భుతమైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, రైతుబంధు, ఆసరా పింఛన్లు ఇలా ఎన్నో పథకాలు అందిస్తున్నారని, తమను కూడా తెలంగాణలో కలిపి, ఆ పథకాలు వర్తించేలా చూడాలని కోరారు. ఈ మేరకు 42 గ్రామాలు చేసిన తీర్మాన పత్రాలను మంత్రి హరీశ్‌రావుకు అందజేశామన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హరీశ్‌రావు తమకు హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు.