గురువారం 28 మే 2020
Telangana - May 19, 2020 , 16:31:58

ప్రభుత్వ సూచనల మేరకు రైతులు పంటలు వేయాలి

ప్రభుత్వ సూచనల మేరకు  రైతులు పంటలు వేయాలి

నిజామాబాద్ : సీఎం కేసీఆర్ సూచనల ప్రకారం రాబోయే వానాకాలంలో వ్యవసాయ అధికారులు సూచించిన పంటలు వేసి రైతులు లాభాలు గడించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు.జిల్లాలోని అగ్రికల్చర్, హార్టికల్చర్ అధికారులు, డీలర్స్, సమన్వయ సభ్యులు తదితరులతో కలెక్టరేట్ లోని ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వ్యవసాయ పాలసీని రాబోయే రెండు మూడు రోజుల్లో ప్రకటించనున్నదని, అప్పటి వరకు రైతులు వరి విత్తనాలు కొనుగోలు చేయవద్దని, జిల్లాలో ప్రతి రైతుకు లాభం వచ్చేలా ఏ ప్రాంతంలో ఎటువంటి పంటలు వేయాలో అధికారులు సూచిస్తారన్నారు.

గత సంవత్సరం జిల్లాలో అవసరానికి మించి వరి, మొక్కజొన్న తదితర పంటలు సాగు అయ్యాయని, డిమాండ్ ఉన్న పత్తి, కంది, కూరగాయలు వంటి పంటలు ఎక్కువగా సాగుచేస్తే రైతుకు లాభసాటిగా ఉంటుందన్నారు. ఇప్పటికే వారి, మొక్కజొన్న ప్రభుత్వం వద్ద అధికముగా స్టోరేజ్ ఉన్నదని, అందుకనే మొక్కజొన్న పంట వేయవద్దని, సీడ్ డీలర్స్ మొక్కజొన్న విత్తనాలు అమ్మవద్దన్నారు. అదేవిధంగా వరి కూడా  ప్రభుత్వం సూచించిన రకం వేయాలని తెలిపారు. నాణ్యత లేని   కల్తీ విత్తనాలు అమ్మవద్దని, ఈ సంవత్సరం వరి 20 శాతం తగ్గించి, దాని బదులు డిమాండ్ ఉన్న పత్తి, కంది వంటి పంటలు వెయ్యాలని, వీటికి ప్రభుత్వ ప్రోత్సాహం అన్ని విధాలా ఉంటుందని, అదేవిధంగా సోయాబిన్, పసుపు పంటలకు మేలైన విత్తనాలు అమ్మాలి అన్నారు. వ్యవసాయ అధికారులు ముఖ్య పాత్ర పోషించి, రైతులకు సరైన రీతిలో సూచనలు చేసి నమ్మకం కలిగించాలని, ప్రతి క్లస్టర్ లో రైతు వేదికలు ఏర్పరుచుకోవాలని సూచించారు. ఏఈవోలు గ్రూప్ లు ఏర్పరుచుకొని రైతులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, ప్రతి విషయం రైతుకు తెలియజేయాలన్నారు.


logo