సోమవారం 13 జూలై 2020
Telangana - Mar 28, 2020 , 01:30:34

మీ ఊరికే వస్తాం.. మీ ధాన్యం కొంటాం

మీ ఊరికే వస్తాం.. మీ ధాన్యం కొంటాం

-కనీస మద్దతు ధర అందిస్తాం

-ధాన్యం డబ్బు ఖాతాల్లో వేస్తాం

-రైతులు ఆందోళన చెందొద్దు

-ఏప్రిల్‌ 10 వరకు నీటి విడుదల

-ఒక్క ఎకరం ఎండకూడదు

-మీడియాతో మఖ్యమంత్రి కేసీఆర్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పండించిన ప్రతి గింజను మీ గ్రామానికి వచ్చి కనీస మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్‌ రైతులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతాంగం అనవసర ఒత్తిడికి గురికావొద్దని, గత్తర బిత్తర కావొద్దని సూచించారు. ‘నేనూ కాపోడినే, నాకు కూడా 20 ఎకరాల పొలం ఉన్నది, నా పంటను కూడా అమ్ముకోవాల్సి ఉన్నది’ అని అన్నారు. మార్కెట్లు మొత్తం బంద్‌ చేశామని, ఒక్క రైతు కూడా మార్కెట్‌కు రావొద్దని చెప్పారు. మార్కెట్‌, వ్యవసాయశాఖ సిబ్బంది గ్రామాల్లో ఉంటారని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో రైతుబంధు సమితులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని, గ్రామ సర్పంచ్‌, ఎంపీటీసీ సభ్యులు కూడా కథానాయకులు కావాలన్నారు. రైతుల మధ్య ఉండాలని, రైతులను చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. మక్కలు, వరి, ఇతర పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పంట తీసుకొచ్చేటప్పుడు బ్యాంకు పాస్‌బుక్‌ తీసుకురావాలని సూచించారు. ధాన్యం కొనుగోలు డబ్బును చెక్కుల ద్వారా రైతు ఖాతాల్లో వేస్తామని చెప్పారు. వెంటనే డబ్బులు వస్తాయని రైతులు అనుకోవద్దని, ప్రభుత్వం ఒక నెలలోపు జమ చేస్తుందన్నారు. పంటలను కొనుగోలు చేయడానికి దాదాపు రూ.35 వేల కోట్లు అవసరం ఉంటుందని, దీనికోసం ఆర్బీఐతో మాట్లాడుతున్నామని చెప్పారు. ఎఫ్‌సీఐకి ఇచ్చినా అక్కడినుంచి డబ్బు రావడానికి కొంత సమయం పడుతుందని, ఈ విపత్కర పరిస్థితులో కొంత సర్దుబాటు అవసరమన్నారు. కొన్న పంటలను ప్రభుత్వం నిర్మించిన గోడౌన్లలో పెడుతామని, అవి సరిపోకుంటే తాత్కాలికంగా ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో నిల్వచేస్తామని తెలిపారు. వ్యాపారులు ఊర్లలోకి పోయి కొంటామంటే కొనుగోలు చేయచ్చని, అయితే కనీస మద్దతు ధరకే కొనాలని సూచించారు. మార్కెట్లను మూసివేశామని దీనిపై సీఎస్‌, వ్యవసాయశాఖ కార్యదర్శి.. కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. మళ్లీ ఆదేశాలు ఇస్తారని, దీనిపై ఆదివారం సాయంత్రం 5 గంటలకు కలెక్టర్ల, వ్యవసాయ, మార్కెటింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నట్టు సీఎం కేసీఆర్‌ వెల్లడించారు.

పంటలకు ఏప్రిల్‌ 10 వరకు నీటివిడుదల

రాష్ట్రంలో రైతులు 50 లక్షలకుపైగా ఎకరాల్లో పంటలు వేశారని, పంటలు చేతికొచ్చే సమయం వచ్చిందని సీఎం కేసీఆర్‌ చెప్పారు. పంటలొస్తేనే మనకు అన్నం దొరుకుతుందని, వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ, కాళేశ్వరం, నాగార్జునసాగర్‌, జూరాల ఆయకట్టు కింద పంటలకు అవసరమైన నీటిని ఏప్రిల్‌ 10 వరకు విడుదలచేస్తామని ప్రకటించారు. చివరి ఎకరం కూడా ఎండకుండా పండాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టంచేశారు. కల్వకుర్తి, దేవాదుల ఎత్తిపోతల ద్వారా కూడా ఏప్రిల్‌ 10 వరకు నీటిని విడుదలచేస్తామని వెల్లడించారు. వాస్తవంగా ఈ నెల 31 వరకే నీటిని విడుదలచేయాలని అనుకున్నామని చెప్పారు. అయితే మంత్రులు ఈటల, వేముల, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి, సత్యవతిరాథోడ్‌, నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడానని, మరో పదిరోజులు పొడిగించాలని వారు కోరారన్నారు. దేవుడి దయవల్ల నీటి కొరతలేదని, విడుదలచేస్తామని తెలిపారు. రైతులు, శాసనసభ్యులు, రైతుబంధు సమితి సభ్యులు సమన్వయం చేసుకొని నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్క ఎకరం ఎండకుండా పంట పండించుకోవాలన్నారు. రాష్ట్రంలో బావులు, బోర్ల మీద ఆధారపడి కూడా పంటలు సాగుచేశారని, ప్రస్తుతం విద్యుత్‌ 9,832 మెగావాట్ల డిమాండ్‌ ఉన్నదని చెప్పారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు మంచి ప్రకటన చేశారని, విద్యుత్‌ సిబ్బంది మరో 15 రోజులు కష్టపడి పనిచేసి విద్యుత్‌ సరఫరాకు ఆటంకం లేకుండా చేస్తే ఆ తరువాత విద్యుత్‌ డిమాండ్‌ తగ్గుతుందన్నారు. ప్రజలకు విద్యుత్‌ సిబ్బంది గొప్ప సేవ చేస్తున్నారని ప్రశంసించారు. నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా చేసి పంటలు చేతికొచ్చేలా సహకరించాలని కోరారు.

మంత్రి వేముల హర్షం

ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల కోసం వచ్చే నెల పదో తేదీ వరకు సాగునీరు అందిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడం పట్ల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఎన్నడూ లేని విధంగా ఎస్సారెస్సీ పరిధిలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ప్రపంచమంతా కరోనాపై యుద్ధంచేస్తున్న వేళ.. కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోసం అన్నిరకాల ముందు జాగ్రత్తలు తీసుకొంటున్నదని చెప్పారు. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లుచేసినందున రైతులెవరూ మార్కెట్‌ కేంద్రాలకు రావద్దని విజ్ఞప్తి చేశారు.


logo