గురువారం 28 మే 2020
Telangana - May 21, 2020 , 22:09:10

ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి..

ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి..

హైదరాబాద్‌: రాష్ట్రంలో గతేడాది వర్షాకాలంలో వరి పంట 40 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగిందని.. ఈ సారి కూడా అంతే విస్తీర్ణంలో సాగు చేయాలని సీఎం కేసీఆర్‌ రైతులకు సూచించారు. నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేసే విధానంపై ప్రగతిభవన్‌ లో విస్తృతస్థాయి సమావేశంలో జిల్లాల అధికారులు, రైతు బంధు సమితి అధ్యక్షులతో సీఎం కేసీఆర్‌ ముఖాముఖి నిర్వహించారు, వారి అభిప్రాయాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు.

ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ సారి కొంచెం పెంచి 70 లక్షల ఎకరాల్లో పత్తిసాగు చేయాలి. గతేడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లో కంది సాగు చేశారు. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి. కంది పంట వేయడం వల్ల బహుళ ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కందులు కొనుగోలు చేస్తుంది. కందిలో తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వచ్చే విత్తానాలు వచ్చాయి. పత్తికి మార్కెట్‌ లో మంచి డిమాండ్‌ ఉంది. సోయాబీన్‌, పసుపు, మిర్చి, కూరగాలు గతేడాది మాదిరిగానే వేయొచ్చు. వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యాథావిధిగా చేసుకోవచ్చు. పచ్చి రొట్టను విరివిగా సాగు చేసుకోవచ్చు.

వర్షాకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు కాబట్టి..సాగు చేయవద్దు. యాసంగిలో మక్కలు సాగు చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ సూచించారు.  వర్షాకాలంలో మక్కలు వేసే అలవాటున్నవారు. పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలి. వరి వంగడాల విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న రకాలు వేసుకోవాలి. తెలంగాణ సోనాకు డిమాండ్‌ ఉంది. 6.5 ఎంఎం సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్‌ ఉందన్నారు. 


logo