మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 21:44:01

అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణం : మంత్రి జగదీశ్‌రెడ్డి

అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణం   : మంత్రి జగదీశ్‌రెడ్డి

సూర్యాపేట : అన్నదాతలను సంఘటిత చేసేందుకే తెలంగాణ ప్రభుత్వం రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. నియంత్రిత సాగుపై దృష్టి సారించాలని రైతాంగానికి ఆయన పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తొండ, వర్ధమానుకోట గ్రామాల్లో రూ. 22 లక్షల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన రైతు వేదికల నిర్మాణానికి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేసి మాట్లాడారు.

రాష్ట్రంలో రైతును రాజుగా చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్లో ఎన్నడూలేని విధంగా 50% నిధులు వ్యవసాయ రంగానికి కేటాయించారని గుర్తు చేశారు. ఏకకాలంలో రూ.25వేలలోపు పంట రుణం మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు సీఎం కేసీఆర్ దార్శనికతకు ప్రతిరూపాలని అభివర్ణించారు. సాగుకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని ఆయన అన్నారు. బడుగు, బలహీనవర్గాలతోపాటు మైనారిటీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పీట వేస్తున్నదని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్‌తో కలిసి నాగారం జడ్పీఉన్నత పాఠశాల ఆవరణలో ఎస్సీ అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు ఆస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్‌కే రజాక్, జిల్లా వ్యవసాయాధికారి జ్యోతిర్మయి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శీరిష తదితరులు పాల్గొన్నారు.


logo