శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 12:12:38

పంటల సాగుపై రైతులను చైతన్యం చేయాలి : మంత్రి హరీశ్ రావు

పంటల సాగుపై రైతులను చైతన్యం చేయాలి : మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : రైతులు, ప్రజా ప్రయోజనార్థం వారి ఆదాయాభివృద్ధి పెరిగేలా.. సేవ చేసినప్పుడే నిజమైన ప్రజాసేవ చేసిన వారవుతారని ప్రజాప్రతినిధులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని నంగునూరు మండలం సిద్దన్నపేటలోని శ్రేష్ట ఫంక్షన్ హాల్ లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను, ఇటీవల కురిసిన వర్షాలకు కూలిన ఇండ్లకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. అలాగే ఆత్మహత్య చేసుకున్న రైతు అంజవ్వ కుటుంబానికి రూ. 5 లక్షలు, పశువులు మృతి చెందిన ఇద్దరికి, కాల్వల భూ సేకరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు మొత్తం 216 మందికి గాను రూ.77 లక్షల 30 వేల 432 రూపాయలు విలువ చేసే చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మిల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కర్ణాటక, ఏపీలోని చింతలపూడిలో కీరదోస సాగులో మంచి దిగుబడి సాధిస్తున్నారని తెలిపారు. రెండు నెలల వ్యవధిలో ఎకరం పంటకు 70 వేల రూపాయలు నుంచి లక్ష రూపాయలు మిగులుతున్నాయని చెప్పారు. ఆ దిశగా రైతులకు లాభం చేకూర్చే పంటల సాగుపై చైతన్యం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు. విత్తనాల్ని కొనుక్కు రావడమే కాదు, తయారు చేసే పని కూడా నంగునూరు మండల రైతులు చేయాలన్నారు.

ఆ దిశగా రైతుల్ని ప్రోత్సహించి వారు ముందుకొచ్చేలా చైతన్యం చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి చెక్కుల్ని, సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు. మండలంలోని సర్పంచ్ లు, ఎంపీటీసీలు ప్రతి గ్రామంలో రైతువేదిక, డంప్ యార్డు, వైకుంఠ ధామం నిర్మాణాలు ఈ దసరా పండుగలోపు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పెండింగ్ లో ఉండకుండా పూర్తి చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు మంత్రి సూచించారు.