ఆదివారం 31 మే 2020
Telangana - May 24, 2020 , 00:47:38

సాగు పండుగవ్వాలి రైతు బాగుపడాలి

సాగు పండుగవ్వాలి రైతు బాగుపడాలి

  • అందుకోసమే నియంత్రిత సాగు విధానం
  • ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి అన్నదాతలు ఆర్థికంగా బాగుపడాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్‌ నియంత్రిత సాగు విధానానికి శ్రీకారం చుట్టారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నియంత్రి త సాగుపై ప్రజాప్రతినిధులు, రైతుబంధు కోఆర్డినేటర్లకు అవగాహన కల్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. వానకాలంలో మక్కజొన్న దిగుబడి తగ్గి రైతులు నష్టపోతున్నారని, ఈసారి దానిని సాగు చేయొద్దని సూచించారు. సన్నరకం వరి, కంది, పత్తి సాగుకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. 

ఈ వానకాలంలో కోటి 40 లక్షల మందికి రైతుబంధు ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసినప్పుడే రైతులు లాభాలు పొందవచ్చన్నారు. విత్తనాలు, ఎరువుల కృత్రిమకొరత సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.  ఇకనుంచి కాలంతోపని లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో నిశ్చింతగా సాగు చేసుకోవచ్చన్నారు. అనంతరం రైతు వేదిక నిర్మాణానికి సంగారెడ్డి డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌ మంత్రికి రూ.5 లక్షల విరాళం అందించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, జెడ్పీ చైర్‌పర్సన్లు మంజుశ్రీ, రోజాశర్మ, ఎమ్మెల్యేలు కాంత్రికిరణ్‌, మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దిన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo