మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:57:42

చిన్న రైతుకు పెద్ద అండ

చిన్న రైతుకు పెద్ద అండ

  • చిన్న, సన్నకారు రైతుల కోసమే కొత్త చట్టం
  • భూ సమస్యలు ఎదుర్కొనేవారిలో వారే అధికం
  • రాష్ట్రంలో 90శాతానికి పైగా చిన్న కమతాలు 
  • వీరి గురించి ఆలోచించని గత ప్రభుత్వాలు
  • సుదీర్ఘ మథనంతో కేసీఆర్‌ కొత్త చట్టం

కాలంతో పాటు చట్టాలు మారాలి. ప్రభుత్వాల విధానాలు కూడా మారాలి. అలా మారకపోతే చట్టాలు రెలెవెన్స్‌ కోల్పోయి, నిరుపయోగంగా మారతాయి. ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి బదులు కొత్త సమస్యలకు కారణమవుతాయి. రెవెన్యూ వ్యవస్థ విషయంలో రాష్ట్రంలో జరిగిందిదే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించేదాకా ఈ సమస్య లోతుల్లోకి పోయినవారు లేరు. అసలేం జరుగుతున్నదో ఆలోచించి, పట్టించుకుని పరిష్కరించిన వారు లేరు. 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: భూమే ఉత్పత్తి వనరుగా, భూమే ఆదాయ మార్గంగా బతికిన తెలంగాణ పల్లెలు గత కొన్ని దశాబ్దాలుగా ఊహించని మార్పులకు లోనయ్యాయి. భూమి చుట్టే తిరిగిన గ్రామీణ జీవిక ఈ మార్పులకు అనుగుణంగా తన స్వభావాన్ని మార్చుకున్నది. చడీ చప్పుడు లేకుండా చోటుచేసుకున్న ఈ మార్పులో ప్రధానాంశం.. భూ బదలాయింపు. ఒకప్పుడు కొన్ని కులాల వద్దే కేంద్రీకృతమైన వ్యవసాయ భూమి, ఏండ్లుగా జరిగిన పరిణామాల్లో చిన్నచిన్న కమతాలుగా విడిపోయి, సమాజంలో వివిధ వర్గాల, బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి చేరింది.

 భూసామ్య కుటుంబాలు పట్టణాలకు తరలడం, వ్యవసాయాన్ని వదిలేసి ఇతర రంగాల్లో స్థిరపడడం, భూమిని అమ్మేయడం, కుటుంబ ఆస్తులు విభజనకు లోనుకావడం, బడుగు బలహీన వర్గాలు కష్టపడి ఎకరమో రెండెకరాలో కొనుగోలు చేయడంతో నేడు రాష్ట్రమంతటా 90 శాతానికి పైగా చిన్న కమతాలుగా మారిపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో బక్క, సన్నకారు రైతులే ఎక్కు. భూమి చిన్నచిన్న కమతాలుగా విడిపోతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతూ వచ్చాయి. గెట్ల పంచాయతీ మొదలుకుని యాజమాన్య సమస్యలు, కబ్జాల దాకా అంతూపొంతూ లేకుండా పోయింది.  పంచాయితీల్లో చిక్కుకున్నది తక్కువే అయినా కష్టపడి సంపాదించుకున్న భూమిని కాపాడుకునే క్రమంలో చిన్న రైతులు సమస్యల పరిష్కారంపైనే ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. కానీ సరైన రెవెన్యూ వ్యవస్థ లేక.. వారి సమస్యలు సమస్యలుగానే మిగిలి మరింత ముదిరిపోయాయి. 

గత ప్రభుత్వాలు పైపై పూతలు, పైపై మాటలతోనే సరిపెట్టడంతో చట్టబద్ధ వ్యవస్థకు, క్షేత్రస్థాయిలో రైతులకు మధ్య అంతరం పెరిగిపోయింది. ఈ క్రమంలో  తెలంగాణ ఏర్పడింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన  వెంటనే కేసీఆర్‌.. భూ సమస్యలకు మూల కారణం ఏమిటనే పరిశోధనలో పడ్డారు. భూమి చిన్న కమతాలుగా విడిపోవడం, సన్నకారు రైతుల సమస్యలను పరిష్కరించేందుకు వ్యవస్థ సానుకూలంగా లేకపోవడం, రైతుల అసహాయతను అలుసుగా తీసుకుని అధికారులు అవినీతికి పాల్పడడం గుర్తించారు. పేద రైతు కేంద్రంగా రెవెన్యూ వ్యవస్థను సంపూర్ణంగా సంస్కరిస్తే తప్ప ఈ సమస్యలను పరిష్కరించలేమని అంచనాకు వచ్చారు. దీనిపై మూడేండ్లుగా సమగ్ర కసరత్తు చేశారు. వివిధ దేశాల్లో, రాష్ర్టాల్లోని విధానాలను పరిశీలించారు. టెక్నాలజీ వినియోగంపై అధ్యయనం చేశారు. న్యాయ నిపుణులు, రెవెన్యూ వ్యవహారాల్లో తలపండిన వారితో సుదీర్ఘ మేధో మథనం నిర్వహించారు.  

ఎన్నో నెలల కష్టం

చట్టసభల్లో ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ బిల్లు వెనుక ఎంతో కష్టం దాగుంది. రాష్ట్రంలో ఎక్కువగా చిన్న కమతాలే ఉన్నాయని గుర్తించిన సీఎం.. వాటి సమస్యలపై దృష్టి సారించారు. ఇందుకోసం నెలల తరబడి కసరత్తు చేశారు. అసలు రాష్ట్రంలో ఎంతమంది రైతులున్నారు? వీరిలో చిన్న, సన్నకారు రైతులెందరు? వీరు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి? వాటిని ఏ విధంగా పరిష్కరించాలి? ప్రస్తుత రెవెన్యూ చట్టంలో ఎలాంటి మార్పులు చేయాలి? అనే అంశాలపై నెలల తరబడి వివిధ రంగాల నిపుణులతో చర్చించారు. చివరికి ప్రస్తుత రెవెన్యూ చట్టాన్ని సమూలంగా మార్చడమే పరిష్కారమార్గమనే అభిప్రాయానికి వచ్చారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా నిజంగా పేద రైతుల, నోరులేని రైతుల కష్టాలను తీర్చే చట్టానికి రూపకల్పన చేశారు. 

లంచగొండుల వేధింపులు

రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య లంచగొండుల వేధింపులు. తమ భూ సమస్య పరిష్కారం కోసం వారు రెవెన్యూ ఆఫీసుల మెట్టు ఎక్కాలన్నా దిగాలన్నా కూడా లంచం చదివించుకోవాల్సిన పరిస్థితులు ఉండేవి. అసలే బక్క రైతులు.. బుక్కెడు బువ్వ కోసం నానా కష్టాలుపడే వీరు అధికారుల అవినీతి దాహాన్ని తీర్చలేకపోయారు. దీంతో వారి సమస్యలు మరింత జటిలమయ్యాయి. ఇటు లంచాలు ఇంచుకునే స్థోమతలేక, అటు సమస్యలు పరిష్కరించుకునే మార్గం లేక నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు భూమే ఆధారం. వారంతా నిజంగా వ్యవసాయం చేసుకునే రైతులు. కానీ భూ సమస్యల వల్ల వారికి వ్యవసాయం భారమైంది. భూ సమస్యల వల్ల ప్రభుత్వ పథకాలను పొందలేక వ్యవసాయం మానుకున్న రైతులు కూడా ఉన్నారు. వీరి సమస్యలు పరిష్కరిస్తే తప్ప ఎవుసం చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భూ సంస్కరణల ఆవశ్యకతను సీఎం కేసీఆర్‌ గుర్తించి ఆ దిశగా అడుగులు వేశారు. ‘రాష్ట్రంలో భూస్వాములు పెద్దగా లేరు. పల్లెల్లో మారిన సమాజ స్వభావాన్ని అర్థం చేసుకోలేని కొందరు ఇంకా గతం నుంచి బయటకు రావడం లేదు. పల్లెల్లో 90 శాతంగా ఉన్న పేద చిన్న రైతులకు కొత్త చట్టం ఎంతో మేలు చేస్తుంది’ అని మాజీ డిప్యూటీ కలెక్టర్‌ ఒకరు చెప్పారు. 

అంతా చిన్న సన్నకారు రైతులే

రాష్ట్రంలోని 98.38 శాతం మంది రైతుల వద్ద ఉన్న భూమి 10 ఎకరాల లోపే. అదేవిధంగా 90శాతం మంది రైతులు ఐదెకరాలు లేదా అంతకన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం పట్టాదారు రైతుల సంఖ్య 60,95,134. వీరిలో 2.20 ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులు 39,52,232 మంది. అంటే మొత్తం రైతుల్లో వీరు 64.84 శాతం ఉన్నారు. 25 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు 6,679 మంది. ఇక నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా పాస్‌పుస్తకాల్లో అనుభదారుల కాలం పెట్టాలని, కౌలు రైతులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కానీ వాస్తవంగా రాష్ట్రంలో కౌలు రైతులు చాలా పరిమితంగా ఉంటారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అనుభవదారు కాలం పెట్టడం, కౌలుదారులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల మళ్లీ ఇబ్బంది పడేది సన్న, చిన్నకారు రైతులేనని తేలింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ నూతన రెవెన్యూ చట్టంలో ఈ రెండు అంశాలను చేర్చబోమని స్పష్టం చేశారు.logo