శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 30, 2020 , 02:08:17

మట్టిమనిషి మురిసె!

మట్టిమనిషి మురిసె!

  • ఊరూరా, వాడవాడలా సంబురాలు
  • పోర్టల్‌కు అన్నదాతల ఘనస్వాగతం
  • దళారుల బాధ తప్పిందని కోటిదండాలు

హైదరాబాద్‌, మేడ్చల్‌, నమస్తే తెలంగాణ: భూమిపుత్రుడు సంబురపడ్డడు.. నేల నాదనీ, ఈ భూమే నా భుక్తి అనీ పుడమి తల్లిని ముద్దాడిండు. ఏండ్ల తండ్లాట, జాగా పొట్లాటలు ఉండవని, కయ్యాలు కానరావని కండ్ల నిండా నీళ్లు తెచ్చుకున్నడు. గుండె మీద చెయ్యేసుకొని గంభీరంగా నిలబడ్డడు. మూడుచింతలపల్లిలో ధరణి పోర్టల్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభిస్తుంటే.. చిరునవ్వు చిందించిండు. కాళ్ల చెప్పులరిగేలా తిరిగిన నాటి రోజులను గుర్తుచేసుకొంటూ, ఆ బాధలు తప్పుతున్నాయని ఎగిరి గంతేసిండు. అవినీతి పోతుందని, దళారుల దండయాత్రలు ఇక ఉండవని ఊరూరా, వాడవాడలా రైతులు సంబురాలు చేసుకొన్నారు. అరుపు ఆకాశాన్ని అంటేలా జయహో కేసీఆర్‌ అంటూ నినదించారు.

ఇన్నేండ్లపాటు తమను పట్టిపీడించి వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించివేశారని సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ఏ ఊరి రచ్చబండ మీద చూసినా, ఏ ఇద్దరు రైతులు కల్సినా ధరణిపై ముచ్చటే. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రపంచవ్యాప్తంగా 40కిపైగా దేశాల్లోని తెలంగాణవాసులు ధరణి ప్రారంభోత్సవాలను తిలకించారు. లక్షలాదిమంది టీవీలకు అతుక్కుపోయారు. మూడుచింతలపల్లి వేదిక వద్దకు తండోపతండాలుగా తరలివచ్చిన రైతులు, ప్రజలు.. సీఎం కంప్యూటర్‌ బటన్‌ నొక్కగానే హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 

తనకు తెల్వకుండానే తనవాళ్లు భూమిని అమ్ముకొన్నారని, ఇకనైనా తనలా ఎవరూ మోసపోకుంటే చాలని లింగాపురం తండాకు చెందిన పంతుల్య చెప్పాడు. సీఎం రైతుబంధు వచ్చిందా అని అడగ్గానే, వచ్చింది సారూ అంటూ కృతజ్ఞతలు చెప్పారు. పైసలు టైమ్‌కు పడుతున్నయని శామీర్‌పేట మండలం మాజీద్‌పూర్‌కు చెందిన సత్యవతి ఆనందం వ్యక్తం చేశారు. సాదాబైనామాల నమోదు సమయాన్ని మరోవారం పొడిగిస్తామని సీఎం ప్రకటించగానే చప్పట్లతో స్వాగతించారు. సాదాబైనామాల మీద భూమి కొన్నోళ్లకు సీఎం సారు మంచి అవకాశం ఇచ్చిండని లింగాపూరం తండాకు చెందిన మోహన్‌ ఆనందం వ్యక్తం చేశాడు. భూ పంచాయితీలు ఉండకుంటే మంచిగ ఉంటదని మూడుచింతలపల్లికి చెందిన ఫతే మహ్మద్‌, గొడవలు లేకుండా ఊర్లు ప్రశాంతంగా ఉంటాయని అదే గ్రామానికి చెందిన శాంతి చెప్పుకొచ్చారు.

ఎవుసం చేసేటోళ్లకు కేసీఆర్‌ అంటే నమ్మకం

నేను అరవై ఏండ్లలో మస్తుమంది ముఖ్యమంత్రులను చూసిన. ఎన్నికలప్పుడు వచ్చుడు, అదిచేస్తం ఇది చేస్తం అని చెప్పుడు.. పోవుడు. మళ్లీ ఎన్నికలప్పుడే కనిపించేటోళ్లు. ఈ 60 ఏండ్లలో కేసీఆర్‌ లాంటి సీఎంను ఇంతకుముందెన్నడూ సూడలే. ఇయ్యాలా కేసీఆర్‌ వస్తుండంటే మళ్లీ ఏమిచ్చి పోతడో, ఏం చెప్పి పోతడో ఒక్క మాటన్న విందామని ఊరికి పోయినోడిని వచ్చిన. చివరకు వచ్చిన గానీ నయా పైసా ఖర్చు లేకుండ 10 నిమిషాల్లోనే పట్టాలిస్తనని అనంగనే నా గుండె సల్లవడ్డది. దూరం నుంచి వచ్చినందుకు మనసు కుదుటపడ్డది బిడ్డా. నాలా ఎవుసం చేసేటోళ్లకు కేసీఆర్‌ ఓ నమ్మకం. రైతులందరికి పెద్దకొడుకు. మా 60 ఏండ్ల కలను మూడేండ్లలో తీర్చిండు. సరిగ్గా రెండేండ్ల కిందటి వరకు మా తండా మూడుచింతలపల్లిలో కలిసి ఉండే. కేసీఆర్‌ సారు దత్తత తీసుకొని మాకు రోడ్లు వేసిండు, ఎప్పుడు పోకుండా కరెంటు ఇస్తుండు. అంతెందుకు మా తండాలో తాగేందుకు నీళ్లు లేక మా బిడ్డలు తల్లడిల్లిర్రు. ఇప్పుడు సూడుపో మా ఊరిలో ఫుల్లు నీళ్లు వస్తున్నయ్‌. ఆయన మాకు దేవుడయ్యా. కేసీఆర్‌ ఏం చేసిండని ఎవ్వడన్న అంటే నా చెప్పుతో కొడుతా.

- లక్ష్మణ్‌ నాయక్‌, రైతు, లింగాపూర్‌తండా

‘నమస్తే’ ధరణి ఫ్లెక్సీ

‘ధరణి’ పోర్టల్‌పై సమగ్ర వివరాలతో ఈ నెల 18న ‘నమస్తే తెలంగాణ’ ప్రచురించిన కథనాన్ని ఫ్లెక్సీల రూపంలో ముద్రించి మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన కూడళ్లు, తాసిల్‌ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు తాసిల్దార్‌ కార్యాలయ అధికారులు.

-తొర్రూర్‌ 

కొత్త ప్రయోగం

రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ ప్రారంభించడం కొత్త ప్రయోగం. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టుగా అమలు జరుగాలని సీపీఐ కోరుకుంటున్నది. కొత్త రెవెన్యూ చట్టాలు అమల్లోకి వచ్చినందున సర్వే నంబర్లవారీగా డిజిటల్‌ సర్వే ప్రారంభించాలి.

- చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి 

పండుగ రోజు

తెలంగాణ ప్రజలకు, ఎన్నారైలకు ఇదొక పండుగ దినం. ఎన్నో దశాబ్దాల భూసమస్యలకు పరిష్కారం చూపేలా ధరణి ప్రారంభించడం గొప్ప విషయం. ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ విధానాలు దేశానికే ఆదర్శం.

-అభిలాష గొడిశాల, కువైట్‌

 పేదోడి భూమికి రక్షణ

ధరణి పోర్టల్‌తో భూముల రిజిస్ట్రేషన్లు సులభంగా, వేగంగా అవుతాయి. ధరణి వల్ల మన భూములకు అత్యంత భద్రత కలుగుతుంది. ఎన్నారైలు భరోసాతో ఇక్కడ భూములు కొనొచ్చు. 

- శ్యామ్‌ ఆకుల, యూరప్‌ తెలంగాణ అధ్యక్షుడు

ధరణి.. ట్రెండ్‌ సెట్టర్‌

పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేసి ఆధార్‌ నంబర్‌సహా అన్ని వివరాలతో భూమి రిజిస్ట్రేషన్‌ పద్ధతి దేశంలోనే ట్రెండ్‌ సెట్టర్‌గా నిలుస్తుంది. ధరణి తెలంగాణ ప్రజల ఆస్తుల సంరక్షణి.

-శ్రీధర్‌ అబ్బగౌని, టీఆర్‌ఎస్‌ ఎన్నారై ఖతర్‌ అధ్యక్షుడు

సంతోషించదగ్గ విషయం

ధరణి అందుబాటులోకి తీసుకురావటం సంతోషించదగ్గ విషయం. ఏండ్ల నుంచి ఉన్న భూ సమస్యలు తొలగిపోతాయి. భూ క్రయవిక్రయాలు పారదర్శకంగా సాగుతాయి. అద్భుత వ్యవస్థను రూపొందించిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.

-చాడ సృజన్‌రెడ్డి, లండన్‌ 

సామాన్యుడికి వరం

సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన ధరణి పోర్టల్‌ సామాన్యుడి పాలిట వరం. రెవెన్యూ వ్యవస్థలో ఉన్న అవినీతిని అరికట్టడానికి ధరణి ఒక బ్రహ్మాస్త్రం. ఇకపై రాష్ట్రంలో ఉన్న భూముల సంరక్షణ చూసుకోవటం ఎన్నారైలకు సులువు కానున్నది. 

-పవిత్రరెడ్డి, ఎన్నారై లండన్‌

ధరణి విప్లవాత్మకం 

విప్లవాత్మక ధరణి పోర్టల్‌ని ప్రారంభించి రెవెన్యూ వ్యవస్థలో నవశకానికి నాంది పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎన్నారైల పక్షాన కృతజ్ఞతలు. ఎన్నారైల సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టి పరిష్కరిస్తున్న మంత్రి కేటీఆర్‌కు కూడా ధన్యవాదాలు.

- అనిల్‌ కూర్మాచలం, ఎన్నారై టీఆర్‌ఎస్‌ సెల్‌ ప్రెసిడెంట్‌

వినూత్న ఆలోచన

ధరణి పోర్టల్‌ వంటి వినూత్న ఆలోచన చేసిన తెలంగాణ ప్రభుత్వానికి శుభాభినందనలు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రగతిపథంలో దూసుకుపోతున్న తెలంగాణ.. మరింత ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం.

-రవి, అడిలైడ్‌ ఆస్ట్రేలియా

సులభంగా సేవలు

రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే సంకల్పంతో ధరణి పోర్టల్‌ ప్రారంభించడం గొప్ప విషయం. పది నిమిషాల్లో పట్టా అందుకోవటం అనేది ఒక రికార్డు. ఎన్నారైలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరం.

-నాగరాజు, దక్షిణాఫ్రికా 

గందరగోళం ఉండదు

దశాబ్దాలుగా ఉన్న భూ గందరగోళానికి తెరదించుతూ ధరణి పోర్టల్‌ తీసుకురావటం గొప్ప విషయం. ప్రజలు సులువుగా భూ వ్యవహారాలు తెలుసుకునేందుకు ధరణి ఉపయోగపడుతుంది.

- హరీశ్‌ రంగా, దక్షిణాఫ్రికా

ఎన్నారైలకు ఉపయోగకరం

సామాన్యులతోపాటు ఎన్నారైలకు ధరణి పోర్టల్‌ తో ఎంతో ఉపయోగం. ఇది అత్యవసరం. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. ధరణితో సమాచారం తెలుసుకోవచ్చు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాం. 

- నీలా శ్రీనివాస్‌, ఫ్రాన్స్‌

తలరాత మారింది

పాశ్చాత్య దేశాలకు దీటుగా డిజిటల్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించడం గొప్ప విషయం. సామాన్యుడికి ఎంతో సాంత్వన చేకూర్చే విషయం ఇది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం తలరాత మారింది. 

-శ్రీధర్‌, స్విట్జర్లాండ్‌

ఎన్నారైల భయాలకు చెక్‌

రెవెన్యూ సేవలు సులభంగా, పారదర్శకంగా ఉండాలనే ఆలోచనతో ధరణి ప్రారంభించడం గొప్ప నిర్ణయం. భూ రికార్డులన్నీ ఒకే పోర్టల్‌లో నిక్షిప్తం చేయడం మంచి ఆలోచన. ఎన్నారైలకు భూములపై ఉన్న భయాలకు చెక్‌ పడింది. 

- నవీన్‌రెడ్డి, లండన్‌

ఒక్క క్లిక్‌తోనే

ధరణి పోర్టల్‌ ప్రారంభించడం గొప్ప విషయం. భూమి అమ్మడం, కొనడం సులభతరం కానున్నది. ప్రపంచంలో ఎక్కడున్నా మన భూములు చూసుకోవటం ఒక్క క్లిక్‌తో సాధ్యం అవుతుంది. 

-సతీశ్‌కుమార్‌, బహ్రెయిన్‌

ఎంతోమేలు

ధరణి పోర్టల్‌ వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు త్వరగా పూర్తవుతాయి. అక్రమాలకు తావులేకుండా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలకు శ్రీకారం చుడుతున్నది. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.

- మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు

రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్‌

రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం సారు. ఎన్నో ఏండ్ల సంది భూములు పట్టాలు కాక ఆఫీసుల చుట్టూ తిరిగినోల్ల కష్టాలు ధరణితో తీరుతయి. చిన్న చిన్న సమస్యలున్న మాలాంటోల్లకు ఇబ్బందులు పోతాయి. మా ఊర్లో భూ తగాదాలతో చాలామంది మాట్లాడుకొనుడే మాసేసిండ్రు. ఇప్పుడు కేసీఆర్‌ సార్‌ సర్కార్‌ తెచ్చిన కానూన్‌తో మేలైతది.  గింత మంచి పనిచేసిన సీఎం సారు సల్లగుండాలె.  

-బొమ్మగాని ఉపేంద్ర, చింతపల్లి గ్రామం, ఖమ్మం రూరల్‌ మండలం, ఖమ్మం జిల్లా.

భూముల పంచాయితీ పోయింది

కేసీఆర్‌ సారచ్చినంక భూముల బాధలు తీరినయ్‌. ఎక్కడ గూడ భూముల పంచాయితీలు లేకుంటైనయ్‌. ఎప్పుడో తాతల కాలంల కొన్న భూములను గూడా పట్టాలు ఇచ్చిండ్రు. గిప్పుడు కొత్తగా తెచ్చిన ధరణితో ఒకటే రోజుల పట్టా మార్పిడి అయిపోతదంట. గతంల భూమి కొని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా.. పట్టా కోసం ఆఫీసుల సుట్టూ చెప్పులరిగేలా తిరిగేది. ఎకరానికి ఇంత ఇస్తేనే పట్టా చేస్తామని లంచాలు అడిగేటోళ్లు. గిప్పుడు ధరణితో గా సమస్యలన్నీ దూరం అయితాయని అంటున్రు.

-స్వామినాయక్‌, నీలి బండతండా, తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా 

దూరం పోవుడు తప్పింది

భూములను అమ్మాలనుకున్నప్పుడు కొనేటోళ్లకు పట్టా చేయాలంటే మా ఊరి నుంచి 40 కిలో మీటర్ల దూరంలున్న దేవరకొండకు పోవాల్సి వచ్చేది. పొద్దునపోతే ఇంటికి వచ్చేసరికి రాత్రయ్యేది. ఇకనుంచి సొంత మండలంలోనే భూములు పట్టా చేస్తారంటే రైతులకు మంచి జరుగుతది. దేవరకొండల అయితే సాక్షులు ఎవరొస్తారో అని బతిలాడేది. గా కష్టాలు పోయినట్టే. 

-దామెర రాములు, దామెర, నాంపల్లి, నల్లగొండ జిల్లా