శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 02:16:25

సులభంగా వేగంగా

సులభంగా వేగంగా

  • ధరణిలో రిజిస్ట్రేషన్‌ అంతా ఆన్‌లైన్‌లోనే..
  • లావాదేవీపై భూయజమానికి పూర్తి సాధికారత 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: పొద్దుగాల లేచి ఆఫీస్‌ల పొంటి ఉరుకుడు ఉండదు.. బ్రోకర్లను బతిమాలుడు లేదు.. రిజిస్ట్రేషన్‌ కోసమని పేపర్లు చేతుల పట్టుకుని ఆళ్లసుట్టు ఈళ్లసుట్టు తిరుగుడు ముచ్చటేలేదు.. ఏం తెల్వనోళ్లని సూశి ఎక్కువ పైసల్‌ గుంజుదామనుకుంటోళ్లు కనిపియ్యరిగ.. ఇయ్యాల్నా.. రేపా ఎప్పుడైతదో అని గాబరా పడాల్సిన పని కూడాలేదు. ధరణిలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చాలా సులభంగా ఉండనున్నది. పోర్టల్‌ ఓపెన్‌ చేశాక రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అవుతారు. ఆ తర్వాత సేల్‌, గిఫ్ట్‌, పార్టిషన్‌, సక్సెషన్‌లో ఏ రకమైన లావాదేవీ నిర్వహిస్తున్నారో నిర్ణయిస్తారు. పాస్‌బుక్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే.. భూ యజమాని పేరు మీద ఎక్కడెక్కడ ఎంత విస్తీర్ణంలో భూములు ఉన్నాయో కనిపిస్తుంది. ఇందులో నుంచి ఎంతమేర అమ్మాలనుకుంటున్నారో నిర్ణయిస్తారు. ఆ తర్వాత.. 

1. భూమి సరిహద్దులను నమోదు చేయాలి. 

2. భూ యజమాని వివరాలు కొన్ని ఆటోమెటిక్‌గా వస్తాయి. అడ్రస్‌ వంటి మిగతా వివరాలను నమోదు చేయాలి. 

3. కుటుంబసభ్యుల వివరాలను, వారి ఆధార్‌ నంబర్లను, ఫోన్‌ నంబర్లను నమోదుచేయాలి. 

4. కొనుగోలుదారు వివరాలు, కుటుంబసభ్యులందరి వివరాలను నమోదుచేయాలి. 

5. ట్రాన్సాక్షన్‌ సమ్మరీ రిసిప్ట్‌లో అన్ని వివరాలు సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత చలాన్‌ను జనరేట్‌ చేయాలి. అమ్మబోయే భూమి, ప్రాంతాన్ని బట్టి స్టాంప్‌ డ్యూటీ ఎంత కట్టాలో ఆటోమెటిక్‌గా వస్తుంది. దీనిని ఆన్‌లైన్‌లో లేదా ఎస్‌బీఐలో నేరుగా చెల్లించవచ్చు. రసీదును జాగ్రత్తగా పెట్టుకోవాలి.

6. సాక్షుల వివరాలను నమోదు చేయాలి. 

7. భూ లావాదేవీకి సంబంధించిన అఫిడవిట్‌ను అప్‌లోడ్‌ చేయాలి. వీటిని డాక్యుమెంట్‌ రైటర్‌తో రాయించుకోవచ్చు. లేదా పోర్టల్‌లో ఉన్న నమూనా పత్రాలను తీసుకొని, వివరాలు నింపి మళ్లీ అప్‌లోడ్‌ చేయాలి. 

8. మనకు నచ్చిన తేదీ, సమయంలో స్లాట్‌ బుకింగ్‌లు చేసుకోవాలి. రసీదును భద్రపరుచుకోవాలి.

9. నిర్దేశిత సమయానికి తాసిల్దార్‌ కార్యాలయానికి వెళ్తే..  ధరణి ఆపరేటర్‌ అమ్మకందారు, కొనుగోలుదారు, సాక్షుల వేలిముద్రలు తీసుకుంటారు. ఆ తర్వాత వారి ఫొటోలు తీసుకుంటారు. అక్కడి నుంచి దరఖాస్తు  తాసిల్దార్‌ వద్దకు వెళ్తుంది. 

10. తాసిల్దార్‌ తన వేలిముద్ర సాయంతో  ధరణిలో లాగిన్‌ అవుతారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించి స్టాంప్‌ డ్యూటీ, బయోమెట్రిక్‌, ఫొటోలను తనిఖీ చేస్తారు. అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారణ చేసుకున్నాక రిజిస్ట్రేషన్‌కు అప్రూవల్‌ ఇస్తారు. ధరణి ఆపరేటర్‌ వద్దకు పంపుతారు. 

11. ధరణి ఆపరేటర్‌ రివర్స్‌ ఎండార్స్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభిస్తారు. క్రయ, విక్రయదారులు తీసుకొచ్చిన పట్టాదార్‌ పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్‌ ఒరిజినల్‌ డాక్యుమెంట్‌, ఈ-చలాన్‌ ప్రింట్‌, ఇద్దరి ఆధార్‌, పాన్‌కార్డులు, సాక్షుల ఆధార్‌కార్డులను పరిశీలిస్తారు. పాన్‌ లేకపోతే ఫారం-61 నింపాలి. ఈ పత్రాలను ధరణి ఆపరేటర్‌ స్కానింగ్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తారు. అక్కడినుంచి దరఖాస్తు మళ్లీ తాసిల్దార్‌ వద్దకు చేరుతుంది. 

12. అప్‌లోడ్‌ చేసిన పత్రాలన్నింటిని తాసిల్దార్‌ సరి చూసుకొని మ్యుటేషన్‌ చేస్తారు. అన్ని రికార్డులపై డిజిటల్‌ సంతకం చేస్తారు. రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 

13. చివరగా కొత్త ఈ-పట్టాదార్‌ పాస్‌బుక్‌, పహాణి, 1బీ పత్రాలను ఇస్తారు. అమ్మకందారు, కొనుగోలుదారు పాస్‌బుక్‌లో తాజా లావాదేవీ వివరాలను ప్రింట్‌ చేస్తారు. ఒకవేళ కొనుగోలుదారుకు పాస్‌బుక్‌ లేకుంటే కొత్తది ప్రింట్‌ చేయించి ఇస్తారు.    భూ లావాదేవీ పూర్తవుతుంది.