సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 02:41:13

రాష్ట్రం రక్ష.. కేంద్రం శిక్ష

రాష్ట్రం రక్ష.. కేంద్రం శిక్ష

 • అన్నదాతకు అండగా తెలంగాణ ప్రభుత్వం 
 • పంట పొలమే కేంద్రంగా సర్కారు పథకాలు
 • డిమాండ్‌ పంటల సాగుకు రాష్ట్రం ప్రోత్సాహం  
 • రైతుకు మద్దతులో ఎంతతేడా!
 • మొండిగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
 • రైతులపైకి కార్పొరేట్‌ను ఎగేస్తున్న కేంద్రం
 • కాంట్రాక్ట్‌ ఫామింగ్‌ బంధనాల్లోకి కర్షకులు
 • కాంట్రాక్ట్‌ ఫామింగ్‌తో కర్షకులను కార్పొరేట్‌ 
 • గుప్పిట బందీచేసేలా కేంద్ర ప్రభుత్వ విధానం

‘ఎద్దేడిసిన ఎవుసం.. రైతేడిసిన రాజ్యం బాగుపడదు’ అనే విషయాన్ని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి అనేక రైతు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది.అవి రైతన్నకు శ్రీరామరక్షగా నిలుస్తున్నాయి. రైతును రాజును చేయాలనే లక్ష్యంతో రాష్ట్రం ముందుకు సాగుతుంటే.. కేంద్రం మాత్రం మొండిగా వ్యవహరిస్తున్నది. రైతు సంక్షేమాన్ని గాలికొదిలి కార్పొరేట్‌కు పట్టం కడుతున్నది. రాష్ట్ర పథకాలు రైతుకు రక్షణగా నిలుస్తుంటే.. కేంద్రం ప్రవర్తన కర్షకులకు శిక్ష విధించేలా ఉన్నది. ఎరువుల పంపిణీ మొదలు పంటల కొనుగోలు వరకు కేంద్రం రైతు వ్యతిరేక నిర్ణయాలు అమలుచేస్తున్నది. ఇటు రాష్ట్రం, అటు కేంద్రం ప్రవేశపెట్టిన పలు పథకాలు, విధానాలను ఒక్కసారి పరిశీలిస్తే ఎవరు రైతుకు మేలుచేస్తున్నారనేది సుస్పష్టం అవుతుంది.  


పంటల సాగు..

 • రాష్ట్రం అమలుచేస్తున్న విధానం

 ఏండ్లుగా ఒకే పంటను సాగుచేస్తూ.. తగిన ధర రాకపోవడంతో రైతు అప్పులపాలవుతున్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన సీఎం కేసీఆర్‌.. రైతును ధనికులను చేయాలనే లక్ష్యంతో నియంత్రిత సాగుకు రూపకల్పనచేశారు. సీఎం మాటను తు.చ. తప్పకుండా పాటించిన రైతులు నియంత్రిత సాగుకు అనుగుణంగానే వివిధ పంటలను సాగుచేశారు. ఈ సీజన్‌లో మక్కజొన్న వేయొద్దని సీఎం సూచించగా రైతులు ఆ పంట జోలికి పోలేదు. ఇప్పుడు అదే రైతులకు వరమైంది. లేదంటే తమ మక్కలను అడ్డికి పావుసేరు చొప్పున కూడా కొనే దిక్కులేక ఇబ్బంది పడేవారు.

కేంద్రం అనుసరిస్తున్న విధానం

పంటల సాగులో కేంద్రం రైతులకు ఇప్పటివరకు విలువైన సూచనలు ఇచ్చిన దాఖలాల్లేవు. పైగా.. రైతులకు కీడుచేసేలా కాంట్రాక్ట్‌ ఫామింగ్‌ను ప్రోత్సహిస్తున్నది. రైతులను కార్పొరేట్‌ గుప్పిట్లో బందీచేసి వారి పొలాల్లో వారినే కూలీలుగా మార్చే కుట్రకు తెరలేపింది. కాంట్రాక్ట్‌ ఫామింగ్‌ ద్వారా రైతు ఆ కంపెనీ చెప్పినట్టు నడుచుకోవాలి. ఒక విధంగా మళ్లీ రైతు బానిసగా మారే ప్రమాదం ఉన్నది.

పంటల కొనుగోలు..

 • రాష్ట్రం అమలుచేస్తున్న విధానం

రైతులకు నష్టం రావొద్దని మొత్తం పంటలను మద్దతు ధర ఇచ్చి మరీ రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నది. రైతుకు సొమ్మును 48 గంటల్లోనే చెల్లిస్తున్నది. యా సంగి పంటల కొనుగోళ్లే ఇందుకు నిదర్శనం. కరోనా వేల రైతులు తమ గ్రామం దాటకుండా ఊళ్లలోనే 6,408 కొనుగోలు కేంద్రాల ద్వారా 9.68 లక్షల మంది రైతుల నుంచి రూ.12 వేల కోట్ల విలువైన 65 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలుచేసింది.

కేంద్రం అమలుచేస్తున్న విధానం

పంటల కొనుగోలుకు దళారులను రైతులపైకి ఎగదోస్తున్నది. మద్దతు ధరను పక్కన పెట్టి రైతులను దోచుకునేందుకు కార్పొరేట్‌ కంపెనీలకు అధికారం కల్పిస్తున్నది. నియంత్రిత మార్కెట్‌ వ్యవస్థకు స్వస్తి చెప్పి స్వేచ్ఛా వాణిజ్యానికి తలుపులు తెరిచింది. తద్వారా కార్పొరేట్‌ కంపెనీలకు దేశంలో ఏ దిక్కుకైనా వెళ్లి పంటలు కొనే అధికారం కల్పించింది. దీంతో కంపెనీలు సిండికేట్‌గా మారి రైతుల నుంచి తక్కువ ధరకే పంట కొనుగోలుచేసే ప్రమాదం ఉన్నది. తద్వారా గిట్టుబాటు ధర హుళక్కే. మద్దతు ధర మిథ్యే కానున్నది. 

పెట్టుబడి సాయం..

 • రాష్ట్రం అమలుచేస్తున్న విధానం

పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేయొద్దనే భావనతో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి రైతుకు ఏటా రెండు పంటలకు ఎకరానికి రూ.10 వేలు పెట్టుబడి సాయంగా అందిస్తున్నది. ఈ వానకాలం సీజన్‌లో 57.62 లక్షల మంది రైతులకు రూ.7,251.85 కోట్లను వారి ఖా తాల్లో 48 గంటల్లోనే జమచేసి రికార్డు సృష్టించింది. 

కేంద్రం అమలుచేస్తున్న విధానం

దేశవ్యాప్తంగా రైతులు పెట్టుబడి లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణ రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టి ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఎంత భూమి ఉన్నా ఏటా రూ.6 వేలే ఇస్తున్నది. అదీ మూడు విడుతల్లో. సవాలక్ష నిబంధనలు పెట్టడంతో మెజారిటీ రైతులు అర్హులు కాలేదు.

పంటల బీమా.. 

 • కార్పొరేట్‌కే ధీమా

ప్రకృతి విపత్తులు, చీడపీడలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలోనూ కేంద్రం వింతగా ప్రవర్తించింది. ఇందుకోసం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన.. రైతులకు మేలుచేయకపోగా కార్పొరేట్‌ కంపెనీకి పట్టం కట్టింది. పథకం అమలులో అనేక షరతులు విధించడంతో రైతులు బీమా పొందలేకపోయారు. బీమా వాటా చెల్లింపులో కేంద్రం తన వాటా తగ్గించుకొని ఆ భారాన్ని రాష్ర్టాలపై మోపింది. సదరు కార్పొరేట్‌ కంపెనీ పరిహారం కింద రైతులకు చెల్లించిన మొత్తం కన్నా బీమాలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు సదరు కంపెనీకి చెల్లించిన మొత్తమే ఎక్కువ.  కార్పొరేట్‌ కంపెనీ వందల కోట్లు ఆర్జించింది. పథకంలోని లోపాలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వాటా చెల్లింపు నిలిపివేసింది. దీనిస్థానంలో రైతులకు మేలుచేసే మంచి పంటల బీమా పథకాన్ని తెచ్చే యోచనలో ఉన్నది. 

రైతు మరణిస్తే పరిహారం..

 • రాష్ట్రం అమలుచేస్తున్న విధానం

ఏ కారణం చేతనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం పెద్దదిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతు మరణిస్తే అతని కుటుంబానికి పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 2018లో ‘రైతుబీమా’ పథకాన్ని ప్రవేశపెట్టింది. కారణమేదైనా సరే రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని అందిస్తూ.. పెద్దదిక్కుగా నిలుస్తున్నది. ఇప్పటివరకు వివిధ కారణాలతో మరణించిన 31,654 మంది రైతుల కుటుంబాలకు రూ.1,582 కోట్లను పరిహారంగా అందించింది. 

కేంద్రం అమలుచేస్తున్న విధానం

రైతులు మరణిస్తే కేంద్రం ఎలాంటి పరిహారం అందించడం లేదు.

రైతులను సంఘటితం చేసేలా..

 • రాష్ట్రం అనుసరిస్తున్న విధానం

అసంఘటితంగా ఉన్న రైతుల సంఘటితానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచనచేసింది. ప్రతి గ్రామంలో రైతు వేదికలను నిర్మిస్తున్నది. రైతులంతా ఒకచోటచేరి వ్యవసాయ విధానాలపై చర్చించుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో రూ.573 కోట్లతో 2,604 రైతువేదికలను నిర్మిస్తున్నది.

కేంద్రం అమలుచేస్తున్న విధానం

రైతులను సంఘటితంచేసే దిశగా కేంద్రం పెద్దగా ఎలాంటి చర్యలుచేపట్టడం లేదు. అయితే ఇటీవల దేశవ్యాప్తంగా ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీవో)లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇది కొత్త విధానమేమీ కాదు. చాలాఏండ్లుగా దేశంలో అమలులో ఉన్నది. 

ఎరువులు కూడా ఇవ్వలేదు

దేశంలో సాగయ్యే పంటలకు సరిపడా ఎరువులు కూడా సరఫరాచేయలేని స్థితిలో కేంద్రం ఉండటం బాధాకరం. ఈ సీజన్‌లో మెజారిటీ రాష్ర్టాలకు ఎరువుల వాటాలో కోత పెట్టింది. మన రాష్ట్రం విషయానికొస్తే ఆగస్టు వరకు 8.69 లక్షల టన్నుల యూరియా పంపాల్సి ఉండగా, 6.15 లక్షల టన్నుల యూరియానే సరఫరాచేసి 2.54 లక్షల టన్నులు బకాయి ఉంచింది. రాష్ట్ర రైతాంగం కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. సాగుకు ప్రాథమిక అవసరమైన ఎరువులను ఇవ్వకపోవడం కేంద్రం అసమర్థతకు నిదర్శనం.


logo