మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 23, 2020 , 02:41:16

రైతు చుట్టం.. రెవెన్యూ చట్టం

రైతు చుట్టం.. రెవెన్యూ చట్టం

 • అన్నదాతల కష్టాలకు చెల్లుచీటి
 • టైటిల్‌ గ్యారంటీ దిశగా ప్రభుత్వం తొలి అడుగు
 • అధికారులకు తగ్గనున్న భారం 
 • ఎన్నారైలకు దక్కిన భరోసా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కొత్త రెవెన్యూ చట్టం.. రైతులకు చుట్టం! కబ్జాదారులకు కరుకుచట్టం. అధికారులకు ఊరటనిచ్చే మహాఘట్టం! రాష్ట్ర వ్యవసాయరంగ రూపురేఖలను సమూలంగా మార్చే కొత్త రెవెన్యూచట్టం ఇప్పుడు అమల్లోకి వచ్చింది. భూ సంబంధ సమస్యల్లేని రాష్ట్రందిశగా మహా అడుగుపడింది. ఇక ఎవరి భూమి ఎంత? ఎక్కడ? ఉన్నదో పక్కా డిజిటల్‌ రికార్డులతో ధరణి పోర్టల్‌ రూపొందుతున్నది. ఇందులో భూయజమాని పేరుతోపాటు కుటుంబసభ్యుల వివరాలనూ నమోదుచేయనుండటంతో భవిష్యత్‌లో భూముల అమ్మకం, కొనుగోలు, పంపకాల సమయంలో వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడనున్నది. ధరణి రికార్డుల్లో ఉన్న ప్రకారమే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, పాస్‌బుక్‌ల జారీ జరుగుతాయి. భూ సంబంధ రికార్డులన్నీ వందశాతం పక్కాగా ఉండి, ఎలాంటి వివాదాలు లేకపోతే కంక్లూజివ్‌ టైటిల్‌ ఇవ్వడం పెద్దసమస్య కాబోదు. గెట్ల పంచాయతీ తలెత్తితే ఇరువర్గాలవారు ధరణినుంచి డిజిటల్‌ మ్యాప్‌ సేకరించి,  కొలుచుకొని సమస్యను పరిష్కరించుకోవచ్చు.  

బతిలాడుడు ఉండది 

సారూ.. నా భూమి రిజిస్ట్రేషన్‌ అయిపోయింది. మ్యుటేషన్‌ చేయండని ఇక అధికారులను బతిలాడుడు ఉండదు. రికార్డులన్నీ పక్కాగా ఉండటంతో స్లాట్‌బుక్‌ చేసుకొని వెళ్లినరోజే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ జరిగిపోతాయి. పది నిమిషాల్లోనే హక్కుపత్రం చేతికొస్తుంది. స్వగ్రామాల్లో ఉన్న భూముల గురించి రంది పడుతున్న ఎన్నారైలకు కొత్త రెవెన్యూ చట్టం గొప్ప ఊరట. ‘ఆధార్‌కార్డు లేనంత మాత్రాన ఎన్నారైలు భూమిని కోల్పోవద్దు. ఆధార్‌ లేకుంటే పాస్‌పోర్ట్‌వంటి ఇతర రుజువుపత్రంతో వారి వివరాలను ధరణిలోకి ఎక్కిద్దాం’ అని అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై ఎన్నారైలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

అవమానాలు.. నిందలు మాయం

రెవెన్యూ అధికారుల్లో కొంతమంది అవినీతి కారణంగా వ్యవస్థ మొత్తం నిందను మోయాల్సి వస్తున్నది. రికార్డుల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉండటమే అవినీతికి బీజం వేస్తున్నది. రికార్డుల్లో కొన్నింటిని వీఆర్వోలే మార్చే సౌలభ్యం కూడా ఉండటంతో ఈ అవినీతి చీడ.. రెవెన్యూశాఖకు పీడగా మారింది. కొత్త రెవెన్యూ చట్టంలో ఇలాంటి విచక్షణాధికారాలకు కత్తెర పెట్టడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 

రూపురేఖలే మారిపోతాయి 

కొత్త రెవెన్యూ చట్టం వందశాతం కార్యరూపం దాల్చితే భూ సమస్యల్లేని తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది. ఫలితంగా పరిపాలన, వ్యవసాయ సంస్కరణలు అత్యంత సులభమవుతాయి. రైతుబంధు, రైతు బీమా వంటివి క్షణాల్లో లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతాయి. నియంత్రిత సాగు వంటి విప్లవాత్మక విధానాలను తేలిగ్గా అమలు చేయవచ్చు. రికార్డులన్నీ పారదర్శకంగా ఉండటంతో పారిశ్రామికవేత్తలు కూడా తరలివస్తారు. ప్రభుత్వ భూముల బదలాయింపు క్షణాల్లో జరిగిపోతుంది. ప్రైవేట్‌ భూములు సేకరించాల్సి వస్తే.. కొనుగోలు, మార్పిడి, చెల్లింపులు వేగంగా జరుగుతాయి.

అమల్లోకి కొత్త చట్టాలు

 • రెవెన్యూ ఇతర చట్టాలపై గెజిట్లు
 • ఉత్తర్వులు జారీచేసిన న్యాయశాఖ

 నూతన రెవెన్యూ చట్టంతోపాటు ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన పలు చట్టాలకు గవర్నర్‌ ఆమోదం తెలుపడంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్‌ విడుదలచేసింది. ఈ మేరకు మంగళవారం న్యాయశాఖ కార్యదర్శి గవర్నర్‌ తరఫున గెజిట్లు జారీచేశారు. దీంతో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినట్టయింది. 

అమలులోకి వచ్చిన చట్టాలు ఇవే..

 • తెలంగాణ రైట్స్‌ ఇన్‌ లాండ్‌ అండ్‌ పట్టాదార్‌ పాస్‌బుక్స్‌ యాక్ట్‌-2020.
 • తెలంగాణ అబాలిషన్‌ ఆఫ్‌ ద పోస్ట్స్‌ ఆఫ్‌ విలేజ్‌ రెవెన్యూ ఆఫీసర్స్‌ యాక్ట్‌-2020.
 • తెలంగాణ మున్సిపల్‌ లా అమెండ్‌మెంట్‌ యాక్ట్‌-2020.
 • తెలంగాణ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ సెకండ్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌-2020.
 • తెలంగాణ స్టేట్‌ బిల్డింగ్‌ పర్మిషన్‌ అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం(టీఎస్‌-బిపాస్‌) యాక్ట్‌ 2020.
 • తెలంగాణ పంచాయతీరాజ్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌-2020.
 • తెలంగాణ స్టేట్‌ ప్రైవేట్‌ యూనివర్సిటీస్‌ (ఎస్టాబ్లిష్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌)(అమెండ్‌మెంట్‌ యాక్ట్‌)-2020.

ఇక దక్షిణం.. ఉత్తరం కాదు

సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అధికారుల చుట్టూ తిరిగి స్వగ్రామంలో తండ్రికి చెందిన రెండెకరాల భూమికి పాస్‌బుక్‌లు సంపాదించాడు. ఆ భూమిని దున్నుకుంటున్న వ్యక్తుల నుంచి లంచం తీసుకున్న వీఆర్వో ‘ఊరికి దక్షిణంవైపు ఉన్న ఆ భూమి.. ఉత్తరం దిశగా 30 ఏండ్ల క్రితం తీసిన కాలువ కింద పోయింది’ అంటూ రికార్డుల్లో మార్చి రాసేశాడు. భూమి కండ్లముందే ఉన్నా.. సాంకేతికంగా కాలువ కింద మాయమైపోయింది. కొత్త రెవెన్యూ చట్టంతో ఇలాంటి అనేక సమస్యలకు అడ్డుకట్ట పడనున్నది. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ప్రజలకు రెవెన్యూవాళ్లను శత్రువులుగా మార్చిన వీఆర్వో వ్యవస్థను ప్రభుత్వం రద్దుచేసింది. దీంతోపాటు తాసిల్దార్లు, పైఅధికారుల విచక్షణాధికారాలకు కత్తెర వేసింది.

కంక్లూజివ్‌ టైటిల్‌ దిశగా ఇది తొలి అడుగు. వందశాతం భూ సంబంధ వివాదాలు పరిష్కారమైనప్పుడే ప్రభుత్వాలు కంక్లూజివ్‌ టైటిల్‌ ఇస్తాయి. తెలంగాణకు త్వరలోనే ఆ పరిణతి రావాలని కోరుకుంటున్నా.

- ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌


logo