మన ఊరు.. మన బియ్యం

- మారిపోతున్న అన్నదాతల దృక్పథం
- సన్నాలను మరపట్టి బియ్యంగా అమ్మకం
- గ్రామాల్లో బియ్యానికి పెరుగుతున్న డిమాండ్
- క్వింటాల్‌కు రూ.400 వరకు అదనపు ఆదాయం
- తవుడు, నూకలు రావడంతో మరింత లాభం
- కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అన్నదాతల ప్రయోగం
రైతులంతా సంఘటితమైతే ఏదైనా చేయగలరు. తెలంగాణ ఆవిర్భవించిన నాటినుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతును రాజు చేయాలన్న తపనతోనే అనేక పథకాలను అమలుచేస్తున్నది. ప్రభుత్వం ప్రకటించిన ఒక్కో పథకం.. రైతుల్లో భరోసా నింపుతూవచ్చింది. మన ఊళ్లో పండిన ధాన్యాన్ని మనమే బియ్యంగా మార్చి అమ్ముకొంటే.. అని వచ్చిన ఆలోచన.. కరీంనగర్ జిల్లాలో ఒక సొసైటీ ఆవిర్భావానికి కారణమైంది. అందులోని రైతులంతా సమిష్టిగా ఆలోచించి ధాన్యం పండించి బియ్యంగా మార్చి అమ్ముతున్నారు. రైతులు సంఘటితం కావాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ మొదట్నుంచీ కంటున్న కల. రైతు వేదికలు ఆ కలనుంచి పుట్టినవే. నియంత్రితసాగు ఆ స్వప్నం ఫలితమే.
కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రైతులు వ్యాపారులుగా మారితే.. తాను పండించిన సన్న వడ్లను.. మరపట్టి బియ్యంచేసి విక్రయిస్తే.. ఆ ఊరిలోనే బియ్యాన్ని అమ్మగలిగితే.. ఎంత లాభమొస్తుంది? రైతులకు ఇది సాధ్యమేనా? నూటికి నూరుపాళ్లు సాధ్యమేనని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతులు నిరూపిస్తున్నారు. రైతులు సమూహాలుగా, సంఘాలుగా ఏర్పడి.. తాము పండించిన ధాన్యాన్ని తామే బియ్యంగా మార్చి విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఏటా సుమారు 30 వేల క్వింటాళ్లకు పైగా బియ్యాన్ని రైతులు అమ్ముతున్నారు. ఈ ఏడాది వీరి అమ్మకాలు మరింత పెరిగే అవకాశమున్నదని రైతులు చెప్తున్నారు. బయటి మార్కెట్‌తో పోలిస్తే.. తక్కువకే విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు.
మన ఊరు.. మన బియ్యం
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగన్‌పల్లి గ్రామం.. ఈ ఊరి రైతులు వివిధ రకాల సన్న వడ్లను పండిస్తూ విక్రయిస్తున్నారు. వడ్లను అమ్మితే తక్కువ డబ్బులు వస్తున్నాయని గమనించిన 13 మంది రైతులు 2018లో ఒక సంఘంగా ఏర్పడ్డారు. వారు పండించిన వడ్లను వారే పట్టించి.. ‘మన ఊరు.. మన బియ్యం’ పేరుతో అమ్మడం మొదలుపెట్టారు. వినియోగదారులనుంచి ఆదరణ రావడంతో.. ఆ గ్రామం పేరుతోనే జోగన్‌పల్లి రైస్ సొసైటీ ఏర్పాటుచేశారు. 2018లో 70 ఎకరాల్లో జైశ్రీరాం రకం వడ్లను పండించి 1300 క్వింటాళ్ల బియ్యాన్ని అమ్మారు. దీంతో రైతుల సంఖ్య 13 నుంచి 30కి పెరిగింది. ఈ సారి రెండువేల క్వింటాళ్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. గ్రామంలోనే రైస్ డిపోను ఏర్పాటుచేసి.. మార్కెట్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ వ్యాపారంచేస్తున్నారు. ఒకదశలో క్వింటాలు రూ.4,600 కూడా అమ్మినట్టు రైతులు చెప్తున్నారు. జోగన్‌పల్లి సొసైటీని ఆదర్శంగా తీసుకొని మిగతా గ్రామాల్లో రైతులు కూడా ఇదే దారిన నడుస్తున్నారు.
హాట్‌కేకులా అమ్మకాలు
జోగన్‌పల్లి రైతులు అమ్ముతున్న బియ్యం హాట్‌కేకులా అమ్ముడుపోవడానికి కారణం, వినియోగదారుల్లో విశ్వసనీయత ఉండటమే. కండ్లముందే పండిన పంట.. కల్తీ ఉండదనే నమ్మకం వినియోగదారులకు భరోసాను కల్పిస్తున్నాయి. దీంతో బియ్యం వచ్చింది వచ్చినట్టుగా అమ్ముడుపోతున్నది. సాధారణంగా దుకాణాలకు వెళ్లి కొంటే.. ఆ బియ్యానికి సంబంధించిన నమ్మకమైన సమాచారం మనకు తెలియదు. కానీ.. రైతులు తాము పండించిన పంటనే మరపట్టించి.. బియ్యంగా మార్చి అమ్ముతుండటంతో నమ్మకం పెరిగింది. అందుకే వినియోగదారులు వీటిపట్ల ఆసక్తిచూపుతున్నారు. మరోవైపు రైతులు వడ్లను బియ్యంగా మార్చి అమ్మడం వల్ల క్వింటాలుకు రూ.200 నుంచి రూ.400 వరకు లాభం వస్తున్నది.
మద్దతుధర కోసం ఎదురుచూడం
మేం పండించిన పంటనే మేమే విక్రయించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. మా ఆలోచనను వినియోగదారులు స్వాగతిస్తున్నారు. గడిచిన రెండేండ్లుగా మా అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. మంచి లాభాలు ఆర్జిస్తున్నాం. కొనుగోలుదారుల కోసం వేచిచూసే అవసరం లేదు. నాణ్యమైన సన్నరకం బియ్యాన్ని వినియోగదారులకు నేరుగా మార్కెట్ ధరకంటే తక్కువకు విక్రయించడంతో మా జోగన్పెల్లి రైస్‌కు డిమాండ్ వస్తున్నది. రైతులు మద్దతు ధరకోసం ఎదురుచూడకుండా స్వయంగా బియ్యంగా మార్చి విక్రయిస్తే అధిక లాభాలను పొందే అవకాశం ఉందన్న విషయాన్ని తోటి రైతులు గుర్తించాలి. ఈసారి 120 ఎకరాల్లో సన్నరకం పంటలు వేశాం.. సుమారు రెండువేల క్వింటాళ్లు విక్రయించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.
- సామ నాగేశ్వర్‌రెడ్డి, జోగన్‌పల్లి సొసైటీ కన్వీనర్
తవుడు, నూకలు అదనం
రైతే ధాన్యాన్ని పట్టించి బియ్యాన్ని నేరుగా విక్రయించడం వల్ల తవుడు, నూకలు అదనంగా మిగులుతాయి. క్వింటాలు వడ్లు పట్టిస్తే.. 10 కిలోల వరకు తవుడు వస్తుంది. కిలో తౌడు రూ.21 ధర పలుకుతుంది. పశువులులేని రైతులు కిరాయి కింద తవుడును మిల్లర్‌కు అప్పజెప్తున్నారు. ఇక నూకలు రానుపోను ఖర్చులు కిందకు పనికొస్తున్నాయి. ఇలా ఏ లెక్కన చూసుకొన్నా వడ్లు మర పడితే రైతులకు అదనంగా డబ్బు వస్తుంది.
పట్నాలకు ఎగుమతి
జోగన్‌పల్లి రైస్ సొసైటీ బియ్యం పట్టణాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. పట్టణాలలో కొత్త బియ్యం క్వింటాలుకు రూ.3800 ఉండగా జోగన్‌పల్లి రైతుల దగ్గర కేవలం రూ.3200 పలుకుతున్నది. మిల్లర్ల దగ్గర బియ్యం పాలిష్ ఎక్కువగా వేయడం.. కల్తీ ఉంటాయనే భయంతో పట్టణవాసులు రైతులు పట్టించిన బియ్యం తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు.
అమ్ముకుంటేనే లాభం
నాకున్న నాలుగు ఎకరాలలో సన్న (బీపీటీ) రకం సాగు చేశాను. వాతావరణం అనుకూలించక కొంచెం దిగుబడి తగ్గింది. కొనడానికి మిల్లర్లు విముఖత చూపడంతో వడ్లు మరపట్టి బియ్యం అమ్మాలని నిర్ణయించాడు. మరపట్టించిన రెండ్రోజులలో బియ్యం మొత్తం అమ్ముడు పోయింది.
- రావుల సమ్మిరెడ్డి, పెద్దపాపయ్యపల్లి, కరీంనగర్ జిల్లా
గతంలో కంటే ఎక్కువగా గిరాకీ ఉన్నది
గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా వడ్లు పట్టించే గిరాకీ ఉన్నది. మిల్లు దగ్గరకే వచ్చి బియ్యం కొంటున్నారు. వడ ్లధర, దిగుబడి తగ్గడంతో చాలా మంది రైతులు వడ్లు పట్టిస్తున్నారు. క్వింటాలు బియ్యానికి రూ.150 పట్టినందుకు తీసుకొంటున్నాం. పొద్దున్నుంచే గిరాకీ మొదలైతది. ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వడ్లు మిల్లు దగ్గరికే తీసుకొస్తున్నరు.
- విజేందర్‌రెడ్డి, రైస్‌మిల్లు యజమాని
కల్తీ భయం లేదు
జోగన్‌పల్లి రైస్‌ను గత రెండేండ్లనుంచి కొంటున్నా. అన్నం మంచిగ అయితున్నది. రుచి కూడా ఉంటున్నది. నూకలు అసలే ఉండటం లేదు. కల్తీ లేకుండా నాణ్యమైన బియ్యాన్ని రైతులు అందిస్తున్నారు. దీంతో మా మిత్రులు, బంధువులు సైతం జోగన్‌పల్లి రైస్‌ను కొంటున్నారు.
- పోతవేణి మధు, వినియోగదారుడు