శుక్రవారం 05 మార్చి 2021
Telangana - Dec 18, 2020 , 01:27:11

కల్లం నుంచే.. మిల్లుకు..

కల్లం నుంచే.. మిల్లుకు..

 •   తెలంగాణ సన్నాలకు భారీ డిమాండ్‌ 
 • పోటీ పడి కొంటున్న వ్యాపారులు
 • 10 లక్షల టన్నులు కొన్న 4 రాష్ర్టాలు
 • ఎంఎస్‌పీకి అదనంగా చెల్లింపులు 
 • మార్కెట్లకు తక్కువగా వస్తున్న సన్నాలు 
 • ఈ ఏడాది ఎక్కువగా ధాన్యమే సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం

ఈ ఏడాది రాష్ట్రంలో పండిన సన్నాలకు దేశవ్యాప్తంగా భారీ డిమాండ్‌ నెలకొన్నది. మన బియ్యాన్ని కొనడానికి రాష్ర్టాల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడింది. మిల్లర్లు.. వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున మన సన్నాలను కొంటున్నారు. ఏకంగా రైతు కల్లాల దగ్గరి నుంచే ధాన్యం మిల్లులకు తరలిపోతున్నది. రైతులకు మద్దతు ధరకంటే.. అదనంగా వంద నుంచి ఐదు వందల వరకు లాభం వస్తున్నది.

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ సన్నాలకు మునుపెన్నడూ లేనివిధంగా మార్కెట్లో గిరాకీ పెరిగిపోయింది. ఇక్కడి సన్నాలను కొనుగోలు చేసేందుకు పలు రాష్ర్టాలు పోటీపడుతున్నాయి. ఇతర రాష్ర్టాలకు తోడుగా తెలంగాణలోని మిల్లర్లు, వ్యాపారుల మధ్య కూడా  తీవ్రమైన పోటీ నెలకొన్నది. మంచిరకం ధాన్యాన్ని ఒకరి కన్నా మరొకరు ఎక్కువ ధర ఇచ్చి మరీ కొనడం విశేషం. మిల్లర్లే రైతుల వద్దకు వచ్చి మరీ కొంటున్నారు. కల్లాల వద్దే.. సన్న ధాన్యం అమ్ముడుపోతున్నది. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు తెలంగాణలో పండిన సన్నరకం ధాన్యాన్ని అధికంగా కొంటున్నారు. ఇప్పటి వరకు ఏకంగా 10 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని ఈ రాష్ర్టాలే కొన్నాయి. సన్నాల రైతులకు రేటు కూడా మద్దతు ధరకు మించి లభిస్తున్నది. ప్రభుత్వం సన్నాలకు క్వింటాలుకు రూ.1,888 మద్దతు ధర ఇస్తుంటే మిల్లర్లు, వ్యాపారులు రూ.1,900 నుంచి రూ.2,400 వరకు చెల్లించి కొంటున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు 16 లక్షల టన్నుల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 

రైతులు ప్రభుత్వ కేంద్రాలకు రావడం లేదు 

ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యాన్ని కొనడంలేదంటూ తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే.. సన్న ధాన్యాన్ని పండించిన రైతులే కొనుగోలు కేంద్రాలకు రావడంలేదు. మిల్లర్లు మద్దతు ధర కన్నా ఎక్కువగా ఇచ్చి కొంటుండటంతో ధాన్యాన్ని మిల్లర్లకే అమ్ముకొంటున్నారు. అంతేగానీ సన్నాలను ప్రభుత్వం కొనడంలేదన్న ప్రచారంలో వాస్తవం లేదు. సన్నాల రైతులు మిల్లర్ల వద్దకు వెళుతుంటే.. దొడ్డు ధాన్యం రైతులు మాత్రం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకే వస్తున్నారు. ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ కొన్న ధాన్యం వివరాలను పరిశీలిస్తే మనకు ఈ విషయం స్పష్టమవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు ప్రభుత్వం 36.01 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనగా, ఇందులో 23.81 లక్షల మెట్రిక్‌ టన్నులు దొడ్డురకం కాగా, సన్నరకాలు 12.19 లక్షల మెట్రిక్‌ టన్నులు  ఉన్నాయి. కాగా, మిల్లరు 16 లక్షల సన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో ప్రభుత్వం ఎక్కువగానే ధాన్యాన్ని కొన్నది. గతేడాది వానకాలంలో  ఇదే సమయానికి 28.11 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్న ప్రభుత్వం ఈ సీజన్‌లో ఇప్పటివరకు 36.01 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొన్నది. 

ఇతర రాష్ర్టాలకు మన సన్నాల ఎగుమతి వివరాలు 

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట నుంచి ఆంధ్రప్రదేశ్‌ లోని మండపేట వ్యాపారస్థులు సన్నాలను కొన్నారు. గద్వాలలో కూడా ఇదే రకమైన ధాన్యాన్ని రాయిచూర్‌ నుంచి వచ్చి కొన్నారు. వీరంతా కూడా నేరుగా రైతు పొలాలకు వెళ్లి ధాన్యాన్ని కొన్నారు. 

నిజామాబాద్‌లో 7 లక్షల టన్నుల సన్నాల దిగుబడిలో పౌరసరఫరాల సంస్థ 3.30 లక్షల మెట్రిక్‌ టన్నులు కొన్నది. స్థానిక మిల్లర్లు, ట్రేడర్స్‌ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వ్యాపారస్థులు 3.70 లక్షల టన్నులు కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో 1.40 మెట్రిక్‌ టన్నుల సన్నధాన్యాన్ని  జగిత్యాల, నిజామాబాద్‌ మిల్లర్లు క్వింటాలుకు రూ.2100 చొప్పున కొన్నారు. వర్నిలో 33 శాతం తేమ ఉన్న ధాన్యాన్ని క్వింటాలుకు రూ.1920 నుంచి రూ.2100 వరకు నల్లగొండ, మిర్యాలగూడ మిల్లర్లు కొన్నారు.

జగిత్యాలలో జైశ్రీరాం, బీపీటీ, ఆర్‌ఎస్‌ఆర్‌, తెలంగాణ సోనా రకాలు 2.60 లక్షల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వచ్చాయి. నల్లగొండ, మిర్యాలగూడ, నిజామాబాద్‌ జిల్లా వ్యాపారస్థులు క్వింటాలుకు రూ.2000 నుంచి రూ.2,200 వరకు 80 వేల టన్నులు, స్థానిక మిల్లర్లు 20 వేల టన్నులు కొన్నారు. పౌరసరఫరాల సంస్థ  15,600 మెట్రిక్‌ టన్నులు కొనుగోలుచేసింది.

 • ఉమ్మడి ఆదిలాబాద్‌లో మహారాష్ట్ర, ఏపీతోపాటు మిర్యాలగూడ, హైదరాబాద్‌ వ్యాపారస్థులు 45,050 టన్నులు కొన్నారు. 
 • ఉమ్మడి మెదక్‌లో 20 వేల టన్నుల వరకు స్థానిక మిల్లర్లు, మిర్యాలగూడ హైదరాబాద్‌ మిల్లర్లు, ఏపీలోని మండపేట, పెద్దాపురం మిల్లర్లతోపాటు తమిళనాడు వ్యాపారస్థులు 1.20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నారు. 
 • సిద్దిపేట జిల్లాలో కుకునూరుపల్లి, ప్రజ్ఞాపూర్‌, గౌరారం, జగదేవ్‌పూర్‌ ప్రాంతాల్లో ధాన్యాన్ని తమిళనాడు, మిర్యాలగూడ, ఏపీ మిల్లర్లు క్వింటాలుకు రూ.1900 నుంచి 2,100 వరకు కొన్నారు. 
 • ఉమ్మడి కరీంనగర్‌లో బీపీటీ, హెచ్‌ఎంటీ, జై శ్రీరాం, ఆర్‌ఎన్‌ఆర్‌ లాంటి సన్న రకాలను (లక్ష టన్నుల మేరకు) సీడ్‌ కంపెనీలు, 40 వేల టన్నుల వరకు లోకల్‌ మిల్లర్లు కొన్నారు. కాగా, ఏపీ మిల్లర్లు 50 వేల టన్నులు కొన్నారు. 
 • ఉమ్మడి వరంగల్‌లో 35 వేల టన్నుల ధాన్యాన్ని సీడ్‌ కంపెనీలు, 40 వేల టన్నులు లోకల్‌ మిల్లర్లతో పాటు మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌ మిల్లర్లు కొన్నారు. ఏపీ మిల్లర్లు 50 వేల టన్నులు కొన్నారు. 
 • ఉమ్మడి ఖమ్మంలో 70వేల టన్నులు స్థానిక మిల్లర్లతోపాటు మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, ఏపీ మిల్లర్లు కొన్నారు.
 • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నల్లగొండ, సూర్యాపేట, మిర్యాలగూడ మిల్లర్లు 8.65 లక్షల టన్నులు కొన్నారు. ఏపీ మిల్లర్లు 80 వేల టన్నులు కొన్నారు. 
 • ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కర్ణాటక, ఏపీ మిల్లర్లు 75 వేల టన్నులు కొన్నారు. 
 • అక్టోబర్‌లో ఏపీలో కురిసిన భారీవర్షాలతో పంటనష్టం జరిగింది. ధాన్యం దిగుబడి తగ్గడంతో ఆ రాష్ట్ర వ్యాపారస్తులు తెలంగాణనుంచి ధాన్యాన్ని కొంటున్నారు. దీంతో తెలంగాణ సన్నాలకు డిమాండ్‌ పెరిగింది.

ధాన్యం కొనుగోలు వివరాలు

 • మొత్తం కొనుగోలు కేంద్రాలు 6,760
 • ఇప్పటి వరకుప్రారంభించినవి 6,425
 • సేకరించిన ధాన్యం 36.01లక్షల టన్నులు 
 • రైతుల సంఖ్య  8.17లక్షలు
 • కొన్న ధాన్యం విలువ: 6,796 కోట్లు
 • రైతులకు చెల్లించినది: 5,269 కోట్లు

VIDEOS

logo