శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 01, 2020 , 02:28:02

రైతన్న సంబురం

రైతన్న సంబురం

  • కొత్త రెవెన్యూ చట్టానికి  అన్నదాత జేజేలు
  • భారీగా ట్రాక్టర్ల ర్యాలీ
  • పాల్గొన్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టం ఎంతో మేలు చేసేదిగా ఉందంటూ రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. బుధవారం పలు జిల్లాల్లో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో భారీ ర్యాలీలు నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ‘సీఎం కేసీఆర్‌ జిందాబాద్‌' అంటూ నినదించారు. ఈ సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని రైతులను ఉత్సాహపరిచారు. నారాయణపేటలో ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజమ్మ పాల్గొన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా ఐనవోలు, వర్ధన్నపేట మండలాల రైతులు ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఆధ్వర్యంలో 1,200 ట్రాక్టర్లతో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్‌ తదితరులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషే కం చేశారు. కాగా జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల రైతులు సుమారు వెయ్యి ట్రాక్టర్లతో జనగామలో నిర్వహించిన ర్యాలీని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో రైతులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొ న్న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో వంద ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ర్యాలీ తీశారు.