గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 18:37:50

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రులు

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రులు

ఖమ్మం : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి, రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వారు రైతువేదికలను ప్రారంభించారు. రఘునాథపాలెం మండల కేంద్రంలో రూ.40 లక్షల వ్యయంతో రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సొంత ఖర్చులతో ఆయన సోదరుడు పువ్వాడ ఉదయ్‌కుమార్‌ స్మారకార్థం నిర్మించిన రైతువేదిక, భూసార పరీక్షా కేంద్రాన్ని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డితో కలిసి వారు ప్రారంభించారు.

కొణిజర్ల మండలం తనికెళ్లలో, బోనకల్‌ మండలం ముష్టికుంట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతువేదికలను ప్రారంభించారు. రఘునాథపాలెం మండలం జింకలతండా రోడ్డులో రూ.11.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన మార్కెటింగ్‌ గోడౌన్‌ నిర్మాణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. అక్కడే 1200 టన్నుల నిల్వ సామర్థ్యం గల విత్తన గిడ్డంగి మార్కెటింగ్‌ గోడౌన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.1.43 కోట్ల వ్యయంతో నిర్మించిన విత్తన నాణ్యత ప్రయోగశాలను  ప్రారంభించారు. 


ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రైతు ప్రయోజనాల పరిరక్షణకు ఏ ప్రభుత్వం చేపట్టని అనేక సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్నదని చెప్పారు. వ్యవసాయ భూములకు ధరణి పోర్టల్‌ ద్వారా మండల కేంద్రంలోని తహసీలాఫీసుల్లోనే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేస్తున్నామన్నారు. దీని వల్ల గతంలో జరగని అనేక ప్రయోజనాలు రైతులకు ఒనగూడాయని వివరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నలమల వెంకటేశ్వరరావు, పలువురు రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు  పాల్గొన్నారు.