బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 03:40:25

పొలానికి తడి.. కూలీకి ఉపాధి

పొలానికి తడి.. కూలీకి ఉపాధి

  • ఉపాధి హామీతో కాలువల పూడికతీత
  • ధర్మపురిలో దిగ్విజయంగా ‘జలహితం’
  • శ్రీరాంసాగర్ కాలువలకు కొత్తరూపు

పూడికతో నిండి దశాబ్దాలుగా వట్టిపోయిన ఎస్సారెస్పీ కాలువలకు కొత్తరూపు వస్తున్నది. కాలువల పూడికతీతతో చివరి పొలాలకు తడి అందడంతోపాటు, ఉపాధి హామీ కూలీకి చేతినిండా పనిదొరుకుతున్నది. ఉపాధి కూలీలతో కాలువల మరమ్మతులు చేపట్టేలా రాష్ట్రంలోనే తొలిసారి జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమవుతున్నది. ఇందులోభాగంగా ఆరు మండలాల పరిధిలో 425 కిలోమీటర్ల మేర ఎస్సారెస్పీ కాలువను ఆధునీకరించాలని లక్ష్యం పెట్టుకోగా.. 23 రోజుల్లో 69.32 కిలోమీటర్ల మేర పూర్తయింది.

ధర్మారం: జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని ధర్మపురి, బుగ్గారం, వెల్గటూరు, గొల్లపల్లి, పెగడపల్లి, ధర్మారం మండలాల పరిధిలో ఎస్సారెస్పీ కింద 82 వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఎస్సారెస్పీ డీ 83/ ఏ, డీ 83/ బీ మెయిన్, మైనర్ కాలువలు 425 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ కాలువల ద్వారా మొదట్లో పుష్కలంగా నీళ్లందాయి. కాలక్రమేణా ఎస్సారెస్పీ నుంచి నీటిరాక తగ్గడంతో కాలువల్లో పూడిక పెరుగడంతోపాటు, చెట్లు, బండరాళ్లతో నిండిపోయాయి. ఫలితంగా చివ రి భూములకు నీరందని పరిస్థితి నెలకొన్నది. రైతులు సమస్యను ఎన్నిసార్లు విన్నవించినా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రస్తుతం  ప్రభుత్వం ‘జలహి తం’ పేరిట కాలువలకు పూర్వవైభవం తీసుకొస్తున్నది. ఇటు కాళేశ్వరం ప్రాజె క్టు, అటు ఎస్సారెస్పీ పునర్జీవ పథకంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాటర్ హబ్ మారిన నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గంలోని ఎస్సారెస్పీ కాలువలను ఆధునీకరించాలని మంత్రి ఈశ్వర్ నిర్ణయించారు. కాలువల్లో పూడిక తొలిగింపు, మరమ్మతు కు  ప్రభుత్వం అనుమతిచ్చింది. ఉపాధి హా మీ పథకం కింద కాలువల పునరుద్ధరణ పనులకు ధర్మపురి నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టు ఎంపికచేశారు. జలహితం కింద కాలువల పునరుద్ధరణ పనులు చేపట్టారు. 

చివరి దశకు పనులు

పొలానికి తడి.. కూలీకి పని అనే నినాదంతో చేపట్టిన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ధర్మపురి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రధాన, ఉప కాలువలు 425 కిలోమీటర్ల మేర ఉండగా, గతనెల 18న పనులు ప్రారంభించారు. ఆదివారాలు మినహా ఇతర రోజుల్లో ఉపాధి కూలీలు ఉదయం 6 గం టల నుంచి 9.30 గంటల వరకు కాలువల మరమ్మతు పనులు చేపడుతున్నారు. 23 రోజుల్లో ఆరు మండలాల్లోని 138 గ్రామాల పరిధిలో 369.32 కిలోమీటర్ల మేర పూడికతీత పూర్తయింది. మరో 55.68 కిలోమీటర్లు శుభ్రం చేస్తే జలహితం కార్యక్రమం సంపూర్ణం కానున్నది. చివరి ఆయకట్టుకు తడి అందనున్నది. కాలువల ఆధునీకరణతో కూలీలకు చేతినిండా పని దొరుకుతున్నది. 23 రోజుల్లో 38,974 మందికి అధికారులు పని కల్పించారు.

రైతు సంక్షేమమే లక్ష్యం

కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ సస్యశ్యామలమవుతున్నది.  పుష్కలంగా జలాలు ఉన్నందున చివరి భూములను తడుపాలన్న ఉద్దేశంతోనే ఎస్సారెస్పీ కాలువలు, చెరువులకు అనుసంధానంగా ఉన్న కెనాళ్లలో పూడిక తీయించాలని సంకల్పించిన. ప్రభుత్వం కూడా అనుమతులు ఇవ్వడంతో ‘జలహితం’ పేరిట పనులు చేపట్టినం. 23 రోజుల్లోనే 20 ఏండ్లనాటి పూడిక తొలిగిపోయింది. వానకాలం నుంచి భూములన్నింటికీ నీరందుతుంది. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.

- కొప్పుల ఈశ్వర్, ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి


logo