గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 18:44:34

రైతు వేదికలు భరోసా కేంద్రాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

రైతు వేదికలు భరోసా కేంద్రాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

గద్వాల/మల్దకల్‌ : దేశానికి రైతు భరోసా అని.. రైతు లేకుంటే రాజ్యమే లేదని, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం బాగుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలం పెద్దపల్లి, కుర్తిరావుల చెరువు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక భవనాలు, పెద్దపల్లిలో పల్లెప్రకృతి వనాన్ని నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహంతో కలిసి ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికలు కర్షకులకు భరోసా కేంద్రాలుగా ఉండనున్నాయని చెప్పారు. రైతును రాజు చేయాలని సీఎం కేసీఆర్‌ చర్యలు చేపడుతున్నారని పేర్కొన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసే ఏ ప్రభుత్వాలు ఇప్పటికీ మనుగడ సాగించలేదని గుర్తు చేశారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతును పరబ్రహ్మగా మంత్రి అభివర్ణించారు. 

అనంతరం మల్దకల్‌లోని స్వయంభు లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన రైతు సంబురాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి బండ లాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. అంతకుముందు లక్ష్మీవేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం కన్వీనర్‌ గట్టు తిమ్మప్ప, కలెక్టర్‌ శృతిఓఝా, ఆర్డీవో రాములు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ సరోజమ్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

 logo