మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 20:01:42

రైతుకు ఆదాయం పెరిగేలా కృషి చేయాలి : హరీశ్‌రావు

రైతుకు ఆదాయం పెరిగేలా కృషి చేయాలి : హరీశ్‌రావు

సిద్ధిపేట : రైతుకు ఆదాయం పెరిగేలా ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో సిద్ధిపేట రూరల్‌, నారాయణరావుపేట మండలాలకు చెందిన 422 మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు, 28 మందికి కల్యాణలక్ష్మి, ఒకరికి షాదీముబారక్‌ చెక్కులను మంత్రి అందజేశారు. అంతకు ముందు చిన్నకోడూర్ మండలం పెద్దకోడూర్కు చెందిన 590 మందికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు, భారీ వర్షాలకు ఇండ్లు కూలిపోయిన 267 మందికి రూ.3200 చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది వానలు అధికంగా కురిశాయని, కాళేశ్వరం నీళ్లు రావడంతో కాలమైందన్నారు. ఈ యేడాది డబుల్‌ ధమాకా అనీ, బోర్లు, బావులు నిండి పారుతున్నాయన్నారు. ఇలా జరగాలని ఎన్నో ఏండ్ల నుంచి కలలుగన్నామని, ఈ యాసంగికి బలువైన పంట పండుతుందన్నారు. 


ముందుకొచ్చిన గ్రామాన్ని సీడ్‌ విలేజ్‌గా మారుస్తా

వారం రోజుల్లోపు నియోజకవర్గంలో ఏదైనా గ్రామం ముందుకొస్తే సీడ్ విలేజ్‌గా మార్చేందుకు కృషి చేస్తానని హరీశ్‌రావు పేర్కొన్నారు. విత్తనోత్పత్తి కేంద్రంగా జిల్లాను మార్చుకుందామని పిలుపునిచ్చారు. విత్తనోత్పత్తిలో భాగంగా వరి, మక్క పెడితే రైతులకు అధిక లాభాలుంటాయన్నారు. విత్తనం తయారు చేస్తే రూ.50వేల నుంచి రూ.60వేల వరకు మిగులుతుందని చెప్పారు. కాళేశ్వరం జలాలతో జిల్లా అన్ని వనరులు సమృద్ధిగా పొందిందని, రైతుల ఆదాయం పెరగాలని, విత్తనోత్పత్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. నిన్నటి వరకు విత్తనాలు కొన్నాం.. రేపటి నుంచి విత్తనోత్పత్తి తయారు చేద్దామన్నారు. పామాయిల్‌ తోటలు జిల్లాలో 50వేల ఎకరాలల్లో సాగు చేయవచ్చని తేలిందని, పామాయిల్ సాగుతో అన్నీ ఖర్చులు పోనూ కనీసం రూ.లక్ష వరకు మిగులుతాయని మంత్రి వెల్లడించారు. కీరదోస, కూరగాయల సాగు, మల్బరీ వైపు ప్రత్యేక దృష్టి సారించాలని రైతులకు మంత్రి సూచించారు. సంప్రదాయ పంటల నుంచి ఆధునిక పంటలతో విత్తనోత్పత్తి చేద్దామని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. విత్తనోత్పత్తి కోసం పోటీ పడాలని కోరారు. లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo