మంగళవారం 26 మే 2020
Telangana - May 23, 2020 , 13:42:33

నియంత్రిత విధానంలో సాగు చేసి రైతు రాజు కావాలి : మంత్రి సత్యవతి

నియంత్రిత విధానంలో సాగు చేసి రైతు రాజు కావాలి : మంత్రి సత్యవతి

ములుగు : తెలంగాణ రైతు రాజు కావాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ రైతులను కోరారు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన పంటలు పండించి రైతులు లాభపడాలని ఆమె ఆకాంక్షించారు. నియంత్రిత సాగుపై ములుగు జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గతంలో దాదాపు 40 లక్షల బోర్లు, బావుల ద్వారా సాగు జరుగుతుండగా సీఎం కేసీఆర్‌ అపర భగీరథ కృషి వల్ల నేడు కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ ద్వారా నీళ్లు వస్తున్నాయన్నారు. అదేవిధంగా రైతు బంధు, 24 కరెంట్‌ సరఫరా, గిట్టుబాటు ధర కల్పించడం వంటి చర్యలు చేపట్టారన్నారు. ధాన్యం కొనుగోళ్లకు రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కేసీఆర్‌ ఒక్కరే అన్నారు.

నియంత్రిత విధానంలో సాగుచేసి మనకు కావాల్సినవి మనం పండించుకోవడంతో పాటు మార్కెట్‌లో మంచి ధర పలికే ధాన్యాన్ని పండించాలన్నారు. ఇందుకోసం అధికారులు రైతుల వెన్నంటి ఉండాలన్నారు. సరైన మార్గదర్శనం చేస్తూ వారికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు, ఫెస్టిసైడ్స్‌ను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, జడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్‌, కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఇతర అధికారులు, స్థానిక నేతలు పాల్గొన్నారు.


logo