శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Feb 11, 2020 , 00:29:27

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి

కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి
  • బడ్జెట్‌ను నిరసిస్తూ 13న కార్యక్రమాలు
  • రైతులకు ఏఐకేఎస్‌సీసీ పిలుపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రామీణ ప్రజల ఆదాయం, కొనుగోలు శక్తిని పెంచడంలో కేంద్ర బడ్జెట్‌ విఫలమైందని అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) విమర్శించింది. బడ్జెట్‌లో గ్రామీణప్రాంతాల వాటా 9.83 శాతం నుంచి 9.30 శాతానికి తగ్గిందని, బడా కార్పొరేట్‌ కంపెనీల లాభాలను పెంచడానికే ఈ బడ్జెట్‌ తోడ్పడుతుందని ఆరోపించింది. కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 13వ తేదీన నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమంలో రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చింది. సోమవారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూంభవన్‌లో అఖిలభారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ.. కార్పొరేట్‌ సంస్థలు చెల్లించకుండా బకాయిపడిన రూ.2 లక్షల కోట్ల రుణాలను కేంద్రం ఇటీవల మాఫీచేసి, వారికి అదనంగా 1.45 లక్షల కోట్ల పన్ను రాయితీలను కల్పించిందని విమర్శించారు. మూడేండ్లలో రైతులు నష్టపోగా, ప్రైవేటు కంపెనీలు పంటబీమా నుంచి రూ.18,830 కోట్లు సంపాదించాయని అన్నారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్‌ జాతీయ అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తీగల సాగర్‌, పశ్య పద్మ, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అచ్యుత రామారావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
logo