మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 16:21:22

అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు

అన్నదాతలను సంఘటితం చేసేందుకే రైతు వేదికలు

సూర్యాపేట  : వ్యవసాయ రంగంలో  విప్లవాత్మకమైన మార్పులతో ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాలను రూపొందించారని విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అదే సమయంలో రైతులు అధునాతన వ్యవసాయంవైపు అడుగులు వెయ్యాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని  సూర్యాపేట రూరల్, పెన్ పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రాల్లో గురువారం  ఆయన రైతువేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆయన ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో  మాట్లాడుతూ.. రైతాంగాన్ని సంఘటితం చేసేందుకే రైతు వేదికల నిర్మాణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఆయన వెల్లడించారు. తద్వారా పండించిన పంటకు మద్దతు ధర సాధించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని ఆయన తెలిపారు.


దశాబ్దాలుగా రైతాంగాన్ని ఓటు బ్యాంక్ గా చూసిన కాంగ్రెస్ వంటి పార్టీలకు.. రైతుబంధు, రైతుబీమాలతో పాటు రైతువేదికల నిర్మాణాలు, పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు  వంటి పథకాలు కలలో కూడా వచ్చి ఉండేవి కావంటూ మంత్రి ఎద్దేవా చేశారు. 45 ఏండ్లుగా గోదావరి జలాల కోసం ఎదురు చూసి సూర్యపేట జిల్లా ప్రజలు దగా పడితే.. తాము చెప్పిన ప్రకారం కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను తీసుకొచ్చామన్నారు.


logo