సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 15:13:04

సాగు విధానాలపై చర్చించుకోవడానికే రైతు వేదికలు

సాగు విధానాలపై చర్చించుకోవడానికే రైతు వేదికలు

మంచిర్యాల : రైతులు సంఘటితంగా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం రైతు వేదికలను నిర్మిస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో తాళ్ళ గురిజాల, క‌న్నాల గ్రామాల్లో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి అల్లోల భూమిపూజ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..రైతులు ఒక చోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా రైతు వేదికలను నిర్మించాలన్నది ప్రభుత్వ సంకల్పమ‌న్నారు. ఎరువులు, మందులు, విత్తనాల ఎంపిక, మార్కెటింగ్ ఇలా అనేక విష‌యాల్లో రైతులకు ఈ వేదికలు మార్గదర్శకంగా నిలుస్తాయ‌న్నారు.

 ఇందులో భాగంగానే రాష్ట్రంలో రైతులకు వ్యవసాయ సేవలను మరింత చేరువ చేసేందుకు 5 వేల ఎకరాలకు కలిపి ఒక క్లస్టర్‌ చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2,604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయం విస్తరణాధికారి (ఏఈవో)ని నియమించిందని చెప్పారు. స్థానిక పరిస్థితులను బట్టి రైతులు లాభసాటిగా ఉండే పంటలు వేయాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఎమ్యెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ పురాణం స‌తీష్, క‌లెక్టర్ భారతీ హోళికేరి, త‌దిత‌రులు పాల్గొన్నారు.


logo