సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 26, 2020 , 01:51:11

కడచూపూ దక్కలేదు..

కడచూపూ దక్కలేదు..

  • గుండెపోటుతో మరణించిన రైతు 
  • కొడుకు ఆస్ట్రేలియాలో, కూతురు బెంగళూర్‌లో.. 
  • భర్తకు అంతిమసంస్కారాలు చేసిన భార్య 
  • వరంగల్‌ అర్బన్‌ జిల్లా నారాయణగిరిలో విషాదం

ధర్మసాగర్‌: కరోనా కారణంగా అగ్గిపట్టుడు దేవుడెరుగు కడచూపుకు నోచుకోలేని పరిస్థితి తలెత్తింది. తలంత బలగం ఉన్నా కాటికి సాగనంపేందుకు ఎవరూ రాలేని దుస్థితి నెలకొనడంతో చివరకు భార్యే.. భర్త చితికి నిప్పంటించింది. తండ్రి అంత్యక్రియలను అంతర్జాలంలో చూడాల్సిన అగత్యం కన్నబిడ్డలకు ఎదురైంది. వివరాల్లోకెళితే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా ధర్మసాగర్‌మండలం నారాయణగిరికి చెందిన ప్రతాప్‌రెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతిచెందాడు. ‘నాన్న మనకు లేడు బిడ్డా! అని తల్లి చెప్పగానే బెంగుళూర్‌లో ఉన్న కూతురు కుప్పకూలిపోయింది. ఆస్ట్రేలియాలో ఉన్న కొడుకు సాయికృష్ణారెడ్డిదీ అదే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా ప్రభావం వల్ల కన్నతండ్రి అంత్యక్రియలకు రాలేక విలవిల్లాడిపోయారు. గ్రామస్థులు కూడా మృతదేహం దగ్గరికి రాలేకపోయారు. రాలేకపోతున్నామని బంధువులు ప్రతాప్‌రెడ్డి భార్య సరళారెడ్డిని ఫోన్‌లోనే పరామర్శించారు. మరోవైపు మా ఊరికి ఎవరూ రావొద్దంటూ ఊరి పొలిమేరలో ముళ్లకంచె వేసి కట్టడిచేశారు. ఈ నేపథ్యంలో ప్రతాప్‌రెడ్డి అంతిమ సంస్కారాలను భార్య సరళాదేవి నిర్వహించింది. ‘ఎవలు మాత్రం ఏం చేస్తారు? ఎవలకు వాళ్లు ఇంటి నుంచి రాకూడని పరిస్థితి ఉండె. ఇంకొకలను అని ఏం లాభం? కన్నబిడ్డలే రాలేని పరిస్థితి ఉండె. ఇసొంటి పరిస్థితి పగొడిగ్గూడా రావద్దు’ అంటూ సరళారెడ్డి చెప్తున్నతీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఆపత్కాలంలో అమ్మకు అండగా నిలబడాలని ధైర్యం చేసి కూతురు నితీషారెడ్డి బెంగళూరు నుంచి హైదరాబాద్‌ చేరుకొని వైద్యపరీక్షల అనంతరం ఇంటికి చేరుకొన్నది.


logo