ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 01:21:30

రైతు కేంద్రీకృత విధానాలు భేష్‌

రైతు కేంద్రీకృత విధానాలు భేష్‌

  • నియంత్రిత సాగుపై మహారాష్ట్ర ప్రశంసలు
  • కొనసాగుతున్న మంత్రి నిరంజన్‌రెడ్డి పర్యటన 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు కేంద్రీకృత పథకాలను మహారాష్ట్ర సర్కార్‌ కొనియాడింది. కొత్త రాష్ట్రమైనప్పటికీ వినూత్న పద్ధతుల్లో సాగు కు పెద్దపీట వేయడం హర్షణీయమని, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యవసాయంపై చూపిస్తున్న శ్రద్ధ అభినందనీయమని పేర్కొన్నది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మహారాష్ట్ర పర్యటనలో భాగంగా బుధవారం తాలెగావ్‌ ఎంఐడీసీలో 500 ఎకరాల్లో ఉన్న ఫ్లోరికల్చర్‌ పార్క్‌ను సందర్శించారు. 110 ప్లాట్లుగా విభజించి వివిధ రకాల పూల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్న విధానాన్ని పరిశీలించారు. 

అనంతరం మహారాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి దాదాజీ దగదుబూసే, ఉద్యానశాఖ మంత్రి సందీపన్‌రావు బుమ్రే, ముఖ్యకార్యదర్శి ఏక్‌నాథ్‌ దవాలేతో భేటీ అయ్యారు. తెలంగాణలో ఆయిల్‌పాం సాగుపై మహారాష్ట్ర మంత్రులు ఆసక్తి చూపించారు. సాగు విధానాన్ని పరిశీలించేందుకు త్వరలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటిస్తామని తెలిపారు. తెలంగాణలో తీగ జాతుల కూరగాయల సాగు, పందిరి సాగు పద్ధతిని అభినందించారు. మహారాష్ట్రలో 1.74 కోట్ల హెక్టార్లలో మొత్తం పంటలను సాగుచేస్తుండగా.. 80-85 లక్షల హెక్టార్లలో పత్తి, సోయా..మిగిలిన విస్తీర్ణంలో మామిడి, నారింజ, దానిమ్మ, ద్రాక్ష, పూల మొక్కలను సాగుచేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో ఉద్యాన పంటల సాగుకు సహకరిస్తామని తెలిపారు. ఉద్యాన పంటల సాగుపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించినట్టు మంత్రి నిరంజన్‌ రెడ్డి వివరించారు.