శనివారం 04 జూలై 2020
Telangana - Jun 04, 2020 , 02:00:57

వినూత్న పద్ధతుల్లో కూరగాయలు, పండ్ల సాగు

వినూత్న పద్ధతుల్లో కూరగాయలు, పండ్ల సాగు

  • అంతర పంటలతో అధికాదాయం
  • లాభాలు గడిస్తున్న మేడ్చల్‌ రైతు నందారెడ్డి
  • శాస్త్రవేత్తల సూచనలతో కొత్త వంగడాలపై దృష్టి
  • పశుపోషణ, చేపల పెంపకంతో అదనపు ఆదాయం

వ్యవసాయాన్ని ఇగురంతో చేయాలి. ఒకే రంకం పంట వేస్తే తంటాలు తప్పవు. అదే అంతర పంటలు వేస్తే ఒక పంటకు సరిపోయే నీటితో అనేక వ్యవసాయోత్పత్తులను పొందవచ్చు. ఇది గ్రహించిన మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్‌ నారెడ్డి నందారెడ్డి తనకున్న ఆరెకరాల్లో పండ్లు, కూరగాయలు సాగుచేస్తూ లాభాలు గడిస్తున్నారు. మిశ్రమ వ్యవసాయం చేస్తూ తన పొలాన్ని మోడల్‌ వ్యవసాయక్షేత్రంగా మార్చారు. పశువులు, చేపలు, కోళ్లు, గొర్రెలు పెంచుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

మేడ్చల్‌: మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలోని అత్వెల్లి గ్రామానికి చెందిన జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్‌ నారెడ్డి నందారెడ్డి మిశ్రమ వ్యవసాయం చేస్తున్నారు. రైతులకు మెళకువలు తెలిపేందుకు, లాభసాటి వ్యవసాయం చేసి చూపేందుకు ప్రణాళికాబద్ధంగా సాగు మొదలుపెట్టారు. తనకున్న ఆరెకరాల్లో రెండేండ్లుగా కూరగాయలు, పండ్ల తోటలు సాగుచేస్తూ లాభాలు పొందుతున్నారు. ఒకటిన్నర ఎకరంలో పందిరిసాగు ప్రారంభించి తీగజాతి పంటలను సాగుచేయడమే కాకుండా వాటి నీడలో అంత రపంటలను వేస్తూ తక్కువ నీటితో ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. ఏడాది క్రితం పందిరి సాగుకు ఆనుకొని ఎకరం స్థలంలో జామ, మామిడి మొక్కలు నాటగా, ఈ ఏడాది జామ కాత వచ్చింది. ఈ తోటలో అంతరపంటగా వంకాయ, దోస వేశారు. మిగిలిన పొలంలో ఆధునిక పద్ధతుల్లో కూరగాయలు పండిస్తున్నారు. అదేవిధంగా గట్లపై బొప్పాయి, దానిమ్మ, అరటి పండ్ల చెట్లను పెంచుతున్నారు. పంటల సాగుతోపాటు నందారెడ్డి తన పొలంలో చేపల చెరువు ఏర్పాటుచేశారు.  ఆరు వేల చేప పిల్లలను పెంచుతున్నారు. 

మిశ్రమ పంటలతోనే లాభం

మూససాగుకు బదులు లాభాలు వచ్చే పంటలు వేయాలి. అధికారుల సలహాలు తీసుకొని సన్న, చిన్నకారు రైతులు కూడా మిశ్రమ పంటల సాగు ద్వారా లాభాలు పొందవచ్చు. ప్రభుత్వ చేయూతతో రైతు లు తమ ప్రాంత అవసరాలకు అనుగుణంగా, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని పంటలు వేసుకొంటే నష్టం రాదు. రైతులకు కేవలం మాటల ద్వారా తెలియజేస్తే నమ్మకం కలుగదు. అందుకే నేను మిశ్రమ పంటలను సాగుచేసి చూపుతున్నా.

- నారెడ్డి నందారెడ్డి, మేడ్చల్‌ జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్‌


పశువులు, కోళ్ల పెంపకం

నందారెడ్డి ఆవులు, బర్రెలను కూడా పెంచుతున్నారు. కృత్రిమ ఎరువులకు బదులు పశువుల పేడను సేంద్రియ ఎరువుగా ఉపయోగిస్తున్నారు. పాలను అమ్ముతూ అదనపు లాభాలు గడిస్తున్నారు. వీటితోపాటు గొర్రెలు, కోళ్లను కూడా పెంచుతున్నారు.

5 చెట్లకే 15 కిలోల కంది పప్పు

శాస్త్రవేత్తల సూచనలతో నందారెడ్డి కొలంబో కందిని ప్రయోగాత్మకంగా సాగుచేస్తున్నారు. కేవలం 5 చెట్ల నుంచి 15 కిలోల పప్పు దిగుబడి వచ్చింది. ప్రస్తుతం వాటి కొమ్మలు కత్తిరించి రెండో కాతకు సిద్ధంచేస్తున్నారు.


logo