సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 01:59:57

రైతు ఆత్మహత్యాయత్నం

రైతు ఆత్మహత్యాయత్నం
  • సిద్దిపేట అర్బన్‌ తాసిల్‌కార్యాలయం వద్ద హల్‌చల్‌
  • రికార్డులు మార్చారని ఆరోపణ

సిద్దిపేట అర్బన్‌: తన భూమి రికార్డులను మార్చారని, కొద్దినెలలుగా 1బీ రికార్డులు రావడం లేదని ఆరోపిస్తూ ఓ రైతు గురువారం సిద్దిపేట అర్బన్‌ తాసిల్‌ కార్యాలయ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిద్దిపేట అర్బ న్‌ మండలం మిట్టపల్లికి చెందిన కాసుల కిష్టయ్యకు 1975లో ప్రభుత్వం రెండెకరాల భూమిని మిట్టపల్లి శివారులోని 308 సర్వే నంబరులో కేటాయించింది. దాన్ని ఆయన 2012లో సిద్దిపేటకు చెందిన కృష్ణమూర్తికి విక్రయించాడు. ఈ క్రమంలో మిట్టపల్లికి చెందిన మరో వ్యక్తి ఈ స్థలం తనదంటూ రావడంతో సమస్య సిద్దిపేట అర్బన్‌ తాసిల్‌ కార్యాలయానికి చేరింది. విచారణ జరిపిన అధికారులు ఈ భూమి కాసుల కిష్టయ్యకు చెందినదిగా ప్రకటించారు. కాసుల కిష్టయ్య సదరు స్థలాన్ని కృష్ణమూర్తి అనే వ్యక్తికి విక్రయించినట్టు తెలుసుకున్న ప్రస్తుత తాసిల్దార్‌ అమ్మిన, కొన్న వారికి గతనెల 25న నోటీసులు జారీచేశారు. తన స్థలం విక్రయించకుండా తాసిల్దార్‌ అడ్డుకుంటున్నారని, రికార్డులు మార్చారని ఆరోపిస్తూ గురువారం తాసిల్‌ కార్యాలయ ఆవరణలో కిష్టయ్య ఆత్యహత్యకు ప్రయత్నించాడు.


విచారణకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం  

రైతు ఆత్మహత్యాయత్నంపై స్పందించిన ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఘటన వెంటనే విచారణ జరిపించాలని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డిని ఆదేశించారు. రైతు కాసుల కిష్టయ్య భూరికార్డుల సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. కార్యాలయాల వద్దకు వచ్చే రైతులను గౌరవించాలని మంత్రి సూచించారు.


logo