బుధవారం 03 జూన్ 2020
Telangana - Jan 24, 2020 , 00:56:23

నాగోబా జాతరకు వేళాయె..

నాగోబా జాతరకు వేళాయె..
  • నేటి అర్ధరాత్రి మహాపూజతో ఉత్సవాలు ప్రారంభం
  • గోదావరి జలాలతో మర్రిచెట్ల వద్దకు మెస్రం వంశీయులు.. 27న ప్రజాదర్బార్‌ నిర్వహణ

ఆదిలాబాద్‌, నమస్తేతెలంగాణ ప్రతినిధి: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆదిలాబాద్‌ జిల్లాలోని నాగోబా జాతర శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభంకానున్నది. మెస్రం వంశీయులు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తలమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను తీసుకొని కాలినడకన నాలుగు రోజుల కిందట కెస్లాపూర్‌కు చేరుకున్నారు. నాగోబా ఆలయ పరిసరాల్లోని మర్రిచెట్ల కింద వారు సేదతీరారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మెస్రం వంశీయుల ప్రత్యేక పూజల అనంతరం జాతర ప్రారంభమవుతుంది. ఈ జాతరలో కీలకమైన ప్రజాదర్బార్‌ ఈనెల 27న జరుగనుండగా.. మం త్రులు, కలెక్టర్‌, వివిధశాఖల అధికారులు హాజరై గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపడం ఇక్కడి ప్రత్యేకత. 


రెండో అతిపెద్ద జాతర..

అతిపెద్ద గిరిజన జాతరలో  నాగోబా జాతర రెండోది. ఆదివాసీలు నాగోబాను తమ ఆరాధ్యదైవంగా కొలుస్తారు. ఆదివాసీల ఐక్యత, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఈ జాతరలో ప్రతి ఘట్టం ప్రత్యేకను సంతరిచుకుంటుంది. ములుగు జిల్లాలోని మేడారం జాతర తర్వాత రెండో అతిపెద్దది.


రూ.2 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం

రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2 కోట్లతో నాగోబా ఆలయ నిర్మాణంతోపాటు  దర్బార్‌ భవనాన్ని నిర్మించారు. జాతరకు వచ్చే ఆదివాసీలు ఇబ్బందులు పడకుండా ఐటీడీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మరుగుదొడ్ల నిర్మాణం,  తాగునీరు, విద్యుత్‌, భోజన వసతి వంటి ఏర్పాట్లు చేశారు.  


పుష్యమాసం ప్రారంభంలో..

ఏటా పుష్యమాసం ప్రారంభంలో నెలవంక కనిపించిన రెండోరోజు మెస్రం వంశీయులు నాగోబాకు తొలిపూజ చేస్తారు. అమావాస్య రోజు అర్ధరాత్రి నాగోబాకు గంగాజలంతో అభిషేకం చేసి మెస్రం వంశీయులే మహాపూజలు నిర్వహిస్తారు. పుష్య అమవాస్యకు ముందు రోజు మెస్రం వంశస్థులు ఒకే చోట తూం(పితృ కర్మ) పూజలు చేస్తారు. పుష్య అమావాస్య మొదలుకాగానే మెస్రం వంశస్థులు తీసుకొచ్చిన పవిత్ర గోదావరి జలాలతో నాగోబాను అభిషేకించడంతో జాతర ప్రారంభమవుతుంది. వారం రోజులపాటు జరిగే ఈ జాతరలో నవ వధువుల బేటింగ్‌ (బేటింగ్‌ కియ్‌వల్‌) ఉంటుంది. కొత్తగా వివాహమైన వధువులను దేవుడికి పరిచయం చేసి పూజ చేయిస్తారు. ఈ పరిచయ వేదికలో పాల్గొనక ముందు దేవుడిని చూడటం, పూజించడం ఉండదు. జాతర ముగిసేంత వరకు మెస్రం వంశీయులు ఇక్కడే ఉంటారు.


మెస్రం వంశీయులే అర్చకులు

నాగోబా దేవతకు మెస్రం వంశీయులే అర్చకులుగా వ్యవహరిస్తూ నాగోబాకు గిరిజన సంప్రదాయ ప్రకారం మహాపూజలు చేస్తారు. మెస్రం వంశంలోకి 22 తెగలు వస్తాయి. అందులో ఏడుగురు దేవతలను కోలిచేవారంతా మెస్రం వంశస్థులు. మడావి, మర్సుకోల, పుర్క, మెస్రం, వెడ్మ, ఫంద్రా, ఉర్వేత.. ఇలా ఇంటిపేర్లు గలవారు మెస్రం వంశంలోకి వస్తారు. 


గోవాడ్‌లో 22 పొయ్యిలపై వంటలు

జాతరకు వచ్చే మెస్రం వంశీయులకు చెందిన మహిళలు వంటలు చేసుకునేందుకు మాత్రం గోవాడలో 22 పొయ్యిలను ఏర్పాటు చేస్తారు. మహాపూజలకు అవసరమయ్యే నైవేద్యాలు ఇక్కడే సిద్ధం చేస్తారు. గోవాడ్‌లో ఇతరులు రాకుండా నిబంధనలు విధిస్తారు. ఇతరులు ఆలయ ఆవరణలో ఎక్కడైనా వంటలు చేసుకొని ఆ ప్రాంతంలోనే బస చేయవచ్చు.


పొరుగు రాష్ర్టాల నుంచి..

ఏటా జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ర్టాల తోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ర్టాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వారం రోజులపాటు జరిగే ఈ జాతరలో గిరిజనుల సంప్రదాయ ప్రకారం నాగోబాకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. 


logo