సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 07:05:53

‘ఏరువాక’ తో పండుగ వాతావరణం

‘ఏరువాక’ తో పండుగ వాతావరణం

వికారాబాద్‌ రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల్లో ఏరువాక పౌర్ణమి వచ్చిందంటే చాలు రైతన్నమదిలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తనకున్న పొలంలో ఏ ఏ పంటలు వేయాలన్నది ఆ రోజు నుంచే ఆచరణలో పెడుతాడు. తనకున్న ఆవు, ఎద్దులు, ఎడ్లబండ్లను అందంగా అలంకరించి ఆ రోజు పశువులకు ఇంట్లో చేసిన ఆహారం తన చేత్తో తినిపిస్తాడు. సాయంత్రం సమయం కాగానే గ్రామాల్లోని రైతన్నలం తా ఒక్కటై ఆలయాల చుట్టూ ఎద్దులను, ఎండ్ల బండ్లను తిప్పుతూ ఈసారి పంటలు బాగా పండాలని, సంవృద్ధిగా వర్షాలు కురువాలని కోరుతూ ఆనందంగా ఏరువాక పౌర్ణమిని జరుపుకుంటారు.

జూన్‌ మాసంలో వచ్చే రుతువు జేష్టశుద్ధ పౌర్ణమి రోజు ఏరువాక పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. మిగతా పండుగలన్నీ ఒకేలా ఉంటే ఏరువాక పౌర్ణమి మాత్రం రైతన్న తాను నమ్ముకున్న భూ తల్లిని పూజించి వ్యసాయం చేసే పశు సంపదను, పొలానికి వాడుకునే బండ్లను, నాగళ్లను ప్ర త్యేక పూజలు చేపడుతారు. రంగు రంగులుగా ఎద్దులను తయారు చేసి ప్రత్యేకంగా చేసిన పోలేలు తినిపించి ఆ రోజంతా కుటుంబం పశువులతో గడుపుతారు.

గోగునారతో చేసిన తోరణాన్ని పొడువుగా కట్టి ఆ ఊరిలో ఉన్న కర్నాకులందరు చర్నకొలతో కొట్టి పీచుగా చేస్తారు. ఆ పీచును ఎవరి దొరికితే వారు తీసుకు వెళ్లి వారి ఎద్దులకు, నాగళ్లకు కడుతారు. ఆ విధంగా చేస్తే పశువులకు మంచి జరుగుతుందని, పంటలు బా గా పండుతాయనే నమ్మకం ఆ నాటి నుంచి వస్తున్నది. వికారాబాద్‌ మండల పరిధిలోని పీరంపల్లి, సిద్దులూరు, గొట్టిముక్కుల, మైలార్‌దేవరంపల్లి, పీలారం తదితర గ్రామాల్లో ఈ పండుగను రైతులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
logo