మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:29:42

ఇంటర్‌ బోర్డుపై అసత్య ప్రచారం

ఇంటర్‌ బోర్డుపై అసత్య ప్రచారం

  • రౌడీ శక్తులపై చర్య తీసుకోవాలి
  • తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం వినతి 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణ ఇంటర్‌బోర్డుపై కొందరు సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వారిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారులసంఘం (ఇంటర్‌విద్య) నాయకులు ఇస్మాయిల్‌, రవికుమార్‌, నవీన్‌బాబు, వెంకటేశ్వర్లు డిమాండ్‌చేశారు. ప్రైవేట్‌ కళాశాలలకు అనుమతివ్వడంలేదని కార్పొరేట్‌ దళారులు, విద్యాస్ఫూర్తి కొరవడిన వాళ్ల ఏజెంట్లు గోబెల్స్‌ ప్రచారానికి తెరతీశారని మండిపడ్డారు. అవే శక్తులు గతేడాది కూడా బోర్డుపై అసత్యప్రచారానికి పాల్పడి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

విప్లవాత్మకచర్యలతో ఇంటర్‌ విద్యాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలను చేపడుతున్నదని, దశాబ్దాలుగా పేరుకుపోయిన అనేక సమస్యలను పరిష్కరించిందని గుర్తుచేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో తమ ఉనికి కోల్పోతున్నామనే అక్కసుతో కొందరు కార్పొరేట్లు ఈ ప్రచారానికి తెగబడుతున్నారని తెలిపారు. దీనిని విద్యార్థుల తల్లిదండ్రులు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఇలాంటి రౌడీశక్తుల ఆటలను కట్టించిన తెలంగాణ మరిన్ని జాగ్రత్తలు చేపట్టి అసత్య ప్రచారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


logo