ఆదివారం 23 ఫిబ్రవరి 2020
నకిలీ వీసాల ముఠా అరెస్ట్‌

నకిలీ వీసాల ముఠా అరెస్ట్‌

Feb 15, 2020 , 02:25:59
PRINT
నకిలీ వీసాల ముఠా అరెస్ట్‌
  • దుబాయ్‌ మీదుగా కువైట్‌కు మహిళల అక్రమ తరలింపు
  • నిందితులను అరెస్టుచేసిన శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు

శేరిలింగంపల్లి: నకిలీ వీసాలతో మహిళలను అక్రమంగా కువైట్‌కు పంపుతున్న ముఠాను శంషాబాద్‌ జోన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీంఅరెస్టుచేశారు. శుక్రవారం సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి చెందిన రెల్లు కుబేందర్‌రావు అలియాస్‌ చిన్నా (32) 2016లో హైదరాబాద్‌కు వచ్చి రాజేంద్రనగర్‌లో ఎయిర్‌టికెట్లను బుక్‌చేసే ఆఫీసుప్రారంభించాడు. రెండేండ్ల తర్వాత నకిలీ వీసాలు, పత్రాలు తయారుచేసి మహిళలను అక్రమం గా కువైట్‌ పంపించడం మొదలుపెట్టాడు.


కువైట్‌కు వెళ్లి పనిచేయాలనుకొనే మహిళల నుంచి డబ్బులు తీసుకొని అక్రమంగా దుబాయ్‌ మీదుగా కువైట్‌ పంపేవాడు. సాధారణంగా కువైట్‌ వెళ్లాలంటే ఇమ్మిగ్రేషన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌ అవసరం. ఈ క్రమంలో కుబేందర్‌రావు దుబాయ్‌ టూరిస్టు వీసాలు వచ్చేలాచేసి ముందుగా అక్కడికి పంపేవాడు. అక్కడ తన ఏజెంట్ల ద్వారా ఆ మహిళలను కువైట్‌కు తరలించేవాడు. వారికి పోలీస్‌ క్లియరెన్స్‌, వీసా స్టాంపింగ్‌,  మెడికల్‌ సర్టిఫికెట్ల న్నీ నకిలీవి తయారుచేసి ఇచ్చేందుకు తమిళనాడులోని కుంభకోణంకు చెందిన షేక్‌ బషీ ర్‌, బాలుప్రసాద్‌ సహాయం తీసుకొనేవాడు. 


కువైట్‌లో ఏజెంట్లు లక్ష్మి, శారద, శ్రీను, సారా వారికి ఉద్యోగం చూపించేవారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కాశీకుమారి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన శంషాబాద్‌ జోన్‌ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం కుబేందర్‌రావు, షేక్‌ బషీర్‌ను అదుపులోకి తీసుకొన్నారు. బాలుప్రసాద్‌ పరారీలో ఉన్నా డు. సబ్‌ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కనపాల మెహాన్‌రావు, ఇందేటి అగస్టిన్‌, శ్రీమువళ్ల రుత్తమ్మ, కొల్లాటి రామకృష్ణ, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యన్నమడల సునీతను కూడా పోలీసులు అరెస్టుచేశారు. ఒక్కొక్కరి నుంచి లక్షకుపైగా వసూలుచేసి 21 మందిని నకిలీ వీసాలతో కువైట్‌కు పంపిచినట్టు విచారణలో తేలింది.


logo