మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 17:01:37

నిర్మల్ లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

నిర్మల్ లో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం

నిర్మల్ : నకిలీ  విత్తనాల విక్రేతలపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఉక్కుపాదం మోపాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించడంతో పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.జిల్లాలోని కడెం మండలం అల్లంపల్లి, పాలరేగడి, బాబానాయక్ తండాల్లో ఒక వ్యక్తి నకిలీ పత్తి విత్తనాలు తన ఇంట్లో పెట్టుకొని గ్రామస్తులకు అమ్ముతున్నాడని సమాచారం రాగా కడెం ఎస్ఐ, మండల వ్యవసాయ అధికారితో కలిసి దాదాపు 116 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శశిధర్ రాజుతెలిపారు. 

వాటి విలువ 1,16000 వరకు ఉంటుందని అన్నారు. నకిలీ విత్తనాలు కలిగియున్న తొడసం నరేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని విత్తనాలను స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. అపరిచిత వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి ఈ విత్తనాల బస్తాలను ఇచ్చారని, ఒక్కొక్క ప్యాకెట్ 1000 రూపాయలకు అమ్మి పెడితే రెండు వందల రూపాయలు కమీషన్ ఇస్తామని చెప్పడంతో అత్యాశకు పోయి విత్తనాల దుకాణం వ్యాపారి కేసులో ఇరుక్కున్నారని తెలిపారు. వ్యాపారులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ నకిలీ  పత్తి విత్తనాలు  ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు సరఫరా చేశారు?  అతను జిల్లాలో ఇంకా ఎవరికైనా ఇచ్చారా? అనే అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. రైతులు విడి విత్తనాలు కొనుగోలు చేయవద్దని తతక్కువ ధరకు లభిస్తున్నాయని ఆశతో విడి విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని ఎస్పీ సూచించారు.

నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేసేందుకు వెనకాడేది లేదని హెచ్చరించారు. అలాగే ఖానాపూర్ మండల కేంద్రంలోని విత్తనాలు, రసాయన ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాపారులు స్టాకు లైసెన్సు బిల్ బుక్కులు తదితర వివరాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.

           


logo