బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 26, 2020 , 02:29:19

కరోనా బాబా ఘరానా దందా

కరోనా బాబా ఘరానా దందా

  • నిమ్మకాయలు ఇచ్చి.. తాయత్తులు కట్టి..
  • మంత్రాలతో వైరస్‌ను వదిలిస్తానని మోసం
  • 12 వేల నుంచి 30 వేల దాకా వసూలు
  • హైదరాబాద్‌ హఫీజ్‌పేటలో దొంగబాబా 

ఆకలైతే అన్నం తింటే కడుపు నిండుతుంది. దూపయితే.. నీళ్లు తాగుతాం. రోగమొస్తే దవాఖానలో డాక్టర్‌ దగ్గరకు పోయి మందులు వాడితే తగ్గిపోతుంది.. మంత్రాలు, తంత్రాలతో ఆకలిపోదు. దప్పిక తీరదు.. రోగం తగ్గదు. సాంకేతికత ఇంత పెరిగినా ఇంకా అతీత శక్తులున్నాయని, మంత్రాల పేరుతో కొందరు బాబాలు అమాయకులను మోసంచేస్తూనే ఉన్నారు. కల్లోలం సృష్టిస్తున్న కొవిడ్‌-19ను  క్యాష్‌ చేసుకొనేందుకు కొత్తగా కరోనాబాబా అవతారమెత్తి ఘరానా దందా సాగిస్తున్న మోసగాడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. 

చందానగర్‌, నమస్తే తెలంగాణ: ఛూమంతర్‌కాలీ అంటాడు.. ఊదుతో ముఖానికి పొగేస్తాడు.. నిమ్మకాయలిస్తాడు.. తాయత్తు కడతాడు.. ఆపై కరోనా ఖతమైందంటూ రూ.వేలల్లో వసూలుచేస్తున్న కరోనాబాబా గుట్టురట్టయింది. మియాపూర్‌ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా మనకెళ్లి ప్రాంతానికి చెందిన ఎండీ ఇస్మాయిల్‌ (47) బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్‌ ప్రాంతంలో స్థిరపడ్డాడు. నాలుగేండ్ల కిందట హఫీజ్‌పేట హనీఫ్‌కాలనీలో ఒక స్థావరం ఏర్పాటుచేసుకుని బాబా అవతారం ఎత్తాడు. నరదృష్టి, దెయ్యం పట్టినా, చెడుగాలి సోకినా వదిలిస్తానంటూ అమాయకులను నమ్మించాడు. విభూది, తాయత్తులు, నిమ్మకాయలు ఇచ్చేవాడు.


60 మందితో వాట్సాప్‌ ప్రచారం

ఇస్మాయిల్‌ ముఖ్య శిష్యుడైన సలీం బాబా దగ్గరికి వచ్చే 60 మంది భక్తులతో వాట్సాప్‌గ్రూప్‌ ఏర్పాటుచేశాడు. బాబాకు అతీతశక్తులు ఉన్నాయని, వాటితో ఎంతటి ఆరోగ్య, మానసిక సమస్యలున్నా నయం చేస్తాడని ప్రచారం మొదలుపెట్టాడు. కరోనాను కూడా ఖతం చేస్తాడని మిగతావారితో చెప్పిస్తూ నమ్మిస్తున్నాడు. సాధారణ జలుబు, దగ్గు వంటి సమస్యలున్నవారికి సైతం కరోనా వచ్చిందని ఆ శిష్యులు నమ్మిస్తూ.. బాబా దగ్గరకు వెళ్తే వ్యాధి నయమవుతుందని పంపుతున్నారు. నాలుగునెలల్లో బాబా దగ్గరికి వస్తున్నవారి సంఖ్య పెరిగిపోయింది. ఇస్మాయిల్‌బాబా కాస్త కరోనాబాబాగా ప్రాచు ర్యం పొందాడు. తన దగ్గరకు వచ్చిన ఒక్కొక్కరి వద్ద రూ.12 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్టు సమాచారం. మూడునెలల్లో 70 మందికిపైగా అమాయకులు కరోనాబాబా ఉచ్చులో పడ్డారని తెలుస్తున్నది. కరోనా నయంచేస్తానని నమ్మించి ఇస్మాయిల్‌ రూ.40 వేలు తీసుకుని మోసం చేశాడని బోరబండకు చెందిన ఓ బాధితుడు మియాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు శుక్రవారం రాత్రి హనీఫ్‌కాలనీలోని కరోనాబాబా స్థావరంపై దాడిచేశారు. ఇస్మాయిల్‌, అతని శిష్యుడిని అదుపులోకి తీసుకుని, వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. బాబాకు ఎలాంటి శక్తులు లేవని, ఆరోగ్య సమస్యలుంటే దవఖానాలకు వెళ్లాలని అక్కడకు వచ్చినవారిని పోలీసులు పంపించారు. 


logo