శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 03, 2020 , 01:59:28

నోముల వాయిస్‌తో ఫేక్‌ ఆడియో

నోముల వాయిస్‌తో ఫేక్‌ ఆడియో

  • మరణ వాంగ్మూలమంటూ వైరల్‌
  • పదేపదే ప్రసారం చేసిన ఏబీఎన్‌  
  • ఎస్పీకి నర్సింహయ్య కుమారుడు భగత్‌ ఫిర్యాదు
  • తానే మిమిక్రీ చేశానంటున్న పీఎన్‌ఎం కళాకారుడు 

నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  ‘నోముల నర్సింహయ్య మరణ వాంగ్మూలం’ పేరిట ఆయన ఫేక్‌ వాయిస్‌తో సోషల్‌ మీడియాలో రెండు ఆడియోలు వైరల్‌ అయ్యాయి. దీనిని ఏబీఎన్‌ చానల్‌ పదేపదే ప్రసారం చేసింది.  

అచ్చం నర్సింహయ్య మాట్లాడినట్టు..

ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మాట్లాడినట్టుగా ఉన్న 2.39 నిమిషాలు, 1.18 నిమిషాల నిడివితో రెండు ఆడియో క్లిప్పులు వాట్సాప్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఒకదాంట్లో సీపీఎం కార్యకర్తలను ఉద్దేశించి ‘ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఎం బిడ్డలు.. పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కంకణబద్ధులైన కామ్రేడ్‌ కళాకార సోదరులారా.. మీఅందరికీ విప్లవ, కళాభివందనాలు. మీ నర్సింహయ్యగా.. ఎర్రజెండా నర్సింహయ్యగా నేను కోరుకునేది ఒక్కటే.. అంటూ ప్రారంభించి.. ఏదిఏమైనా మీరంతా కమ్యూనిస్టు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు’ అని ఒక క్లిప్పింగ్‌లో ఉండగా, ‘మిత్రులారా సభను ఏర్పాటుచేసిన సభాధ్యక్షులు.. మిత్రులారా.. నేను మీ నర్సింహయ్యను మాట్లాడుతున్నా.. ఈ రోజు నేను మీ అందరికీ శాశ్వతంగా సెలవుపెట్టి వెళ్తున్న పరిస్థితి. మీ అందరూ ఎర్రజెండా నర్సింహయ్యగారికి కడసారిగా వీడ్కోలు పలుకుతారని కోరుకుంటూ.. మీ నర్సింహయ్య’ అని రెండోక్లిప్పులో ఉన్నది. ఈ రెండు ఆడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారా యి. వీటిని ఏబీఎన్‌ చానల్‌ ‘శాశ్వతంగా సెలవుపెట్టి వెళ్తున్న.. వీడ్కోలు పలకండి.. మీ నర్సింహయ్య.. కన్నీరు పెట్టించే చివరి ఆడియో’ అంటూ పదేపదే ప్రసారం చేసింది. దీనిని తీవ్రంగా ఖండించిన నర్సింహయ్య కుమారుడు భగత్‌.. ‘మా నాన్న మరణించడానికి కొద్ది గంటల ముందు మా అందరితో ఎప్పటిలాగే మాట్లాడారు. తెల్లవారుజామున నిద్రలోనే అపస్మాకరస్థితిలోకి వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన పేరుతో ఆడియో బయటకు రావడం చాలాబాధ కలిగిస్తున్నది’ అని పేర్కొన్నారు. ఈ విషయమై ఎస్పీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. సదరు ఆడియో క్లిప్పులు తాను చేసినవే అంటూ సీపీఎం ప్రజానాట్యమండలికి చెందిన మిమిక్రీ ఆర్టిస్టు ఏడుకొండలు ముందుకొచ్చారు. కోదాడకు చెందిన తాను నర్సింహయ్యపై ఉన్న ప్రేమతోనే ఇలాచేశానని మరో వీడియో క్లిప్పింగ్‌ ద్వారా వివరణ ఇచ్చారు. తోటి కళాకారులు కోరడంతో చేశానని కానీ, కొందరు ఈ క్లిప్పింగ్‌ను వైరల్‌ చేసి నోముల కుటుంబాన్ని కలత చెందేలా చేశారని పేర్కొన్నారు. నర్సింహయ్య కుటుంబసభ్యులు తనను క్షమించాలని కోరారు.  


logo