మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:34:56

అండర్‌కవర్‌ ఆపరేషనంటూ కిడ్నాప్‌

అండర్‌కవర్‌ ఆపరేషనంటూ కిడ్నాప్‌

  • భారీగా డబ్బు లాగేందుకు పథకం
  • నకిలీ మిలిటరీ ఉద్యోగి అరెస్టు
  • నిందితులుగా మరో ముగ్గురు

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ‘నేనొక మిలిటరీ ఉద్యోగిని. ఉగ్రవాదిని పట్టుకొనేందుకు మిలటరీ ఇంటెలిజెన్స్‌ అండర్‌కవర్‌ ఆపరేషన్‌ చేస్తున్నా. మీరు నాకు సహకరించండి. మీకు డబ్బుతోపాటు మిలిటరీలో ఉద్యోగం ఇప్పిస్తాను’ అంటూ నమ్మించి మరో ముగ్గురి సాయంతో ఓ వ్యాపారి కొడుకును కిడ్నాప్‌ చేసిన దొంగ.. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. వ్యాపారి కొడుకును కిడ్నాప్‌ చేసి డబ్బు గుంజేందుకు యత్నించగా సైబరాబాద్‌ మాదాపూర్‌ ఎస్వోటీ పోలీసులు అరెస్టుచేశారు. మంగళవారం గచ్చిబౌలిలోని పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో సైబరాబాద్‌ కమిషనర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన నాగరాజు రఘువర్మ హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పనికి కుదిరాడు. యజమాని స్నేహితుడికి ఇంటితోపాటు 34 అంబులెన్స్‌ వాహనాలు ఉండటం చూసి.. అతని కొడుకును కిడ్నాప్‌చేసి భారీగా డబ్బు గుంజవచ్చని పథకం రచించాడు. మిలటరీ అధికారినని, మిలటరీ ఇంటెలిజెన్స్‌ అండర్‌ కవర్‌ ఆపరేషన్‌చేస్తున్నానని అమాయకులైన ఇద్దరు విద్యార్థులు, ఓ సామాన్యుడిని మాయమాటలతో నమ్మించాడు. ఈ నెల 4న నాగరాజు రఘువర్మ అలియాస్‌ ఎస్‌ఎస్‌ కాకతీయ.. ఆర్మీ కల్నల్‌ వస్ర్తాల్లో సికింద్రాబాద్‌ లాల్‌బజార్‌, నారాయణగూడ ప్రాంతాల్లో ఆర్మీ దుస్తులు, బేడీలు, డమ్మీ పిస్తోళ్లు, ఓ రైఫిల్‌, వాకీటాకీలు, బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ కొని మిగతా ముగ్గురికి ఇచ్చాడు. 5వ తేదీన వ్యాపారి కొడుకును బీహెచ్‌ఈఎల్‌ వద్ద అడ్డగించి హఫీజ్‌పేట ఐ హెల్త్‌ ఆయుర్వేదిక్‌ మెడికల్‌ దుకాణానికి తీసుకువెళ్లారు. ‘మేం మిలిటరీ అధికారులం. మీ నాన్న స్నేహితుడి గురించి సమాచారం కావాలి. అతడో పెద్ద ఉగ్రవాది. అతని చేతికి బేడీలు వేసి ఎన్‌కౌంటర్‌ చేస్తాం. లేదంటే మీ నాన్నను ఇక్కడి రమ్మని చెప్పు’ అని నాగరాజు బెదిరించాడు. కొద్దిసేపటికే స్టేషన్‌ బెయిల్‌ కావాలంటే రూ.26 వేలు ఇవ్వాలని వ్యాపారి కొడుకు నుంచి వసూలుచేశాడు. కొన్ని ఖర్చుల కోసం అతడి వ్యాలెట్‌ నుంచి డబ్బు ఖర్చుపెట్టాడు. వ్యాపారి కొడుకు కారు తీసుకుని అతన్ని బీహెచ్‌ఈఎల్‌ వద్ద వదిలేసి నలుగురు కలిసి కారులో బంజారాహిల్స్‌కు వచ్చారు. అక్కడ ముగ్గురికి రూ.12 వేలిచ్చిన నాగరాజు.. కారు తీసుకుని తణుకు వెళ్లిపోయాడు. కిడ్నాప్‌పై బాధితుడు ఫిర్యాదుచేయగా, మాదాపూర్‌ ఎస్వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధీర్‌కుమార్‌ బృందం నాగరాజు రఘువర్మతోపాటు అతనికి సహకరించిన కల్లేపల్లి రాజేశ్‌, లావేటి రామకృష్ణ, జోరేసింగ్‌ను మంగళవారం అరెస్టుచేశారు. డమ్మీ తుపాకీలు, రైఫిల్‌ ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూలు

2017, 2018 సంవత్సరాల్లో నాగరాజు బాలానగర్‌, పంజాగుట్ట ప్రాంతాల్లో డ్రైవర్‌గా పనిచేసే చోట చోరీకి పాల్పడి జైలుకు వెళ్లాడు. 2018లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాడు. పోలీసు ఎస్బీ విచారణలో అతనికి నేర చరిత్ర ఉన్నదని తెలియడంతో ఉద్యోగం రాలేదు. నకిలీ ఆర్మీ అధికారిగా అవతారమెత్తిన నాగరాజు మిలటరీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి పలువురి నుంచి దాదాపు రూ.6.80 లక్షలు వసూలుచేసి మోసం చేశాడు. అద్దెకు కార్లు తీసుకుని వాటిపై మిలటరీ అధికారి స్టిక్కర్‌ అంటించుకుని హంగామా చేసేవాడు. సొంత గ్రామంలో నిజమేననుకుని చాలామంది వ్యాపార ప్రారంభోత్సవాలకు నాగరాజును పిలిచి.. కటౌట్‌లు కట్టి స్వాగతాలు కూడా పలికారు.


logo