బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:42:00

వైరస్‌ కట్టడికి విస్తృత చర్యలు

వైరస్‌ కట్టడికి విస్తృత చర్యలు
  • గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ హాస్పిటళ్లలో ఏర్పాట్లు
  • ప్రైవేటు దవాఖానల్లోనూ చికిత్స
  • హైకోర్టుకు వెల్లడించిన రాష్ట్రప్రభుత్వం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా వైరస్‌ వ్యాపిని కట్టడిచేయడానికి పటిష్ఠచర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కరోనా నేపథ్యంలో హోలీ వేడుకలను జరుపకుండా ఆదేశాలు జారీచేయడంతోపాటు వైరస్‌ విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై చీఫ్‌జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ అభిషేక్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోమారు విచారణ చేపట్టింది. ప్రివెంటివ్‌ మెడిసిన్‌ విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ శంకర్‌ స్వయంగా హాజరై కోర్టుకు వివరాలు తెలియజేశారు. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు కొనసాగిస్తూ.. కరోనా వైరస్‌ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నదని వివరించారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌హాస్పిటళ్లలో ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటుచేశామని, ఆయా దవాఖానల్లో 100 పడకల వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. 


కంటోన్మెంట్‌లోని ఆర్మీ, అనంతగిరిలోని చెస్ట్‌ హాస్పిటళ్లలో 250 పడకలతో వార్డులు ఏర్పాటుచేసినట్టు తెలిపారు. ప్రైవేటు దవాఖానల్లోనూ ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా 19 వైరాలజీ ల్యాబ్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించిందని, అందులో భాగంగా తెలంగాణలో నూతన ల్యాబ్‌ ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గాంధీలో ఉన్న ల్యాబ్‌ 24 గంటలు పనిచేస్తున్నదని వివరించారు. డైలీ మానిటరింగ్‌ సిస్టం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. కరోనా కట్టడి విషయంలో విజయవంతమైన కేరళలో విధానాలను పరిశీలించేందుకు 12 మంది వైద్యుల బృందాన్ని అక్కడికి పంపిస్తున్నట్టు తెలిపారు. విచారణను ధర్మాసనం ఈ నెల 12వ తేదీకి వాయిదావేసింది.


logo